రాష్ట్రవ్యాప్తంగా మెగా గ్రోత్ కారిడార్లు
ABN , Publish Date - May 14 , 2026 | 04:20 AM
రాష్ట్ర వ్యాప్తంగా మెగా గ్రోత్ కారిడార్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వచ్చే 25 ఏళ్లకు సరిపడేలా వీటిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు...
ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లకు ఔటర్ రింగురోడ్లు
నల్లగొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్
ఆదిలాబాద్, బాసర, కడెం మధ్య టూరిజం కారిడార్
మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్ల కేంద్రంగా ఒకటి,
సుజాతనగర్, కొత్తగూడెం, పాల్వంచకు మరొకటి..
వచ్చే 25 ఏళ్లకు సరిపోయేలా వీటిని డిజైన్ చేయాలి
ఇంధన ఖర్చు తగ్గింపులో భాగంగా ఈవీలనే వాడాలి
మున్సిపాలిటీల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు: సీఎం రేవంత్
హైదరాబాద్‌లో ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
600 మందితో అమెరికా వెలుపల తొలి కేంద్రం
ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటు
సీఎం రేవంత్‌తో భేటీలో ఉబర్ సీఈవో ఖోస్రోషాహి
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా మెగా గ్రోత్ కారిడార్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వచ్చే 25 ఏళ్లకు సరిపడేలా వీటిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో మెగా గ్రోత్ కారిడార్లపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నగరాల చుట్టూ ఔటర్ రింగు రోడ్ల (ఓఆర్‌ఆర్)ను ఏర్పాటు చేయాలని, అవసరమైన మేర మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) నిర్మించాలని ఆదేశించారు. ఈ కారిడార్ భవిష్యత్‌లో తెలంగాణకు చాలా కీలకమని సీఎం పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాల్లో రోడ్లను నిర్మించాలని సూచించారు. అలాగే, సుజాతనగర్, కొత్తగూడెం, పాల్వంచను కలుపుతూ ఒక కారిడార్, మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్లను కలుపుతూ మరొక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటితోపాటు నల్లగొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టును కలుపుతూ టూరిజం కారిడార్‌ను ఏర్పాటు చేయాలన్నారు.
ఆదిలాబాద్‌లో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కానుందని, వరంగల్‌లోని మామునూరులో ఎయిర్‌పోర్టు నిర్మించనున్నామని.. వీటిని దృష్టిలో ఉంచుకుని రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంలో సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. నగరాలే కేంద్రంగా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలని సూచించారు. పట్టణాలు, నగరాల్లో రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించడానికి మల్టీ యుటిలిటీ టవర్స్ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం ప్రతీచోట స్మార్ట్ పోల్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సీవరేజ్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు నుంచి శుద్ధి చేసిన నీటినే భవన నిర్మాణాల్లో ఉపయోగించేలా నిబంధన పెట్టాలని ఆదేశించారు. పెద్ద మునిసిపాలిటీల సమీపంలో రేడియల్ రోడ్లు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వీటిని ఆయా నగరాలు, పట్టణాల జనాభాకు తగినట్టు డిజైన్ చేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగంపై సాంకేతిక నిపుణుల సలహా తీసుకోవాలన్నారు. ఇంధన ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా ఎలక్ర్టిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని, లీజుకు తీసుకునేవి కూడా ఈవీలే ఉండాలని సీఎం ఆదేశించారు. మునిసిపాలిటీల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. సింగరేణి పరిధిలో ఉన్న అన్ని మునిసిపాలిటీలను ఒక యూనిట్‌గా తీసుకుని, సీఎ్‌సఆర్ నిధులను ఖర్చు చేయాలన్నారు.

సీఎంను కలిసిన లోకాయుక్త
తెలంగాణ లోకాయుక్త జస్టిస్ రాజశేఖరరెడ్డి బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఇంజనీరింగ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఈఈపీసీ) రీజినల్ చైర్మన్ రామన్ రఘు, రీజినల్ డైరక్టర్ జె.వి. రాజగోపాలరావు, సైనిక్ సంక్షేమ శాఖ డైరక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్ బాబు కూడా సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.