తెలంగాణతో కలిసి పనిచేస్తాం
ABN , Publish Date - Jan 21 , 2026 | 05:33 AM
పలు అంతర్జాతీయ సంస్థలు వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి, రాష్ట్రంలో తమ కార్యాలయాలు ప్రారంభించడానికి ముందుకొచ్చాయి.....
దావోస్ వేదికగా పలు అంతర్జాతీయ సంస్థల హామీ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందంతో సంస్థల ప్రతినిధుల భేటీలు
ఏఐలో భాగస్వామ్యానికి రాయల్ ఫిలిప్స్ ఆసక్తి
హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై చర్చ
ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ చైర్మన్‌తో సీఎం భేటీ
ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీ, స్టార్ట్‌పలపై గూగుల్ ఆసక్తి
జీసీసీ ఏర్పాటును పరిశీలిస్తామన్న యూనిలీవర్
ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి పని చేస్తామన్న యూఏఈ
స్కిల్ వర్సిటీతో భాగస్వామ్యానికి సౌదీ సంస్థ ఆసక్తి
ఏఐతో మెరుగైన పౌర సేవలు: సీఎం రేవంత్‌రెడ్డి
దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రసంగం
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కండి
పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు
హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): పలు అంతర్జాతీయ సంస్థలు వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి, రాష్ట్రంలో తమ కార్యాలయాలు ప్రారంభించడానికి ముందుకొచ్చాయి. ప్రముఖ హెల్త్‌టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్, ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్, యూనిలీవర్, సౌదీ అరేబియాకు చెందిన ఎక్స్‌పర్టయిజ్ వంటి సంస్థలు తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి కనబరిచాయి. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనడానికి దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం మంగళవారం పలు కీలక సమావేశాలు నిర్వహించింది. వివిధ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఈ సమావేశాల్లో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. తొలుత ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్‌తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్ట్‌పలకు సహకారాలపై విస్తృతంగా చర్చించారు. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), డీప్‌టెక్ ఇన్నోవేషన్‌తోపాటు హెల్త్‌టెక్, అగ్రి-టెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్ట్‌పలకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వడంతోపాటు భాగస్వామ్యం పంచుకోవాలని చర్చల్లో నిర్ణయించారు.
ఏఐ రంగంలో రాయల్ ఫిలిప్స్ ఆసక్తి..
ఏఐ రంగంలో తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రముఖ హెల్త్‌టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి కనబరిచింది. హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలపై కూడా చర్చించేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్ బృందంతో భేటీలో రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ జాన్ విల్లెమ్ స్కీజ్‌గ్రాండ్ మాట్లాడుతూ.. ఏఐ రంగంలో తెలంగాణ చేపడుతున్న కార్యక్రమాలు, ముఖ్యంగా ఆరోగ్య రంగంలో అమలు చేస్తున్న ఏఐ ఆధారిత సేవలు తమను ఆకట్టుకున్నాయన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘తెలంగాణ నెక్స్ట్--జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026--2030’ గురించి రాష్ట్ర ప్రతినిధి బృందం వివరించింది. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఔషధ తయారీ, పరిశోధనాభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) రంగాల్లో ప్రపంచ స్థాయి, స్థిరమైన పారిశ్రామిక క్లస్టర్‌ను తెలంగాణలో నిర్మిస్తున్నామని చెప్పారు. కాగా, వైద్య పర్యాటకానికి హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ను ఏఐకి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ఏఐ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇప్పటికే మెడ్‌ట్రానిక్, ఒలంపస్, జీఈ వంటి అగ్రశ్రేణి సంస్థల ఎంబెడెడ్ ఇంజినీరింగ్, ఆర్‌అండ్‌డీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. కాగా, ఆరోగ్య రంగంలో తెలంగాణ చేపడుతున్న ఏఐ ఆధారిత మార్పు అత్యంత ప్రశంసనీయమని రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్ జాన్ విల్లెమ్ స్కీజ్‌గ్రాండ్ అన్నారు. తమ నెదర్లాండ్స్ ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సందర్శించాలని ఆహ్వానించారు.
రేవంత్‌తో గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ భేటీ..
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పులు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతామని తెలిపింది. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్ట్‌పలలో భాగస్వామ్యమయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు గూగుల్ ఏషియా పసిఫిక్ ఏరియా(ఏపీఏసీ) ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా.. సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధి నమూనాను సీఎం వివరించారు. కోర్ హైదరాబాద్ సిటీని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలను వెల్లడించారు. ట్రాఫిక్ కంట్రోల్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ ఇన్నోవేషన్ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలను ప్రస్తావించారు. తొలి గూగుల్ స్టార్టప్స్ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినందుకు గూగుల్ బృందానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
జీసీసీ ఏర్పాటుపై యూనిలీవర్ పరిశీలన
ప్రపంచవ్యాప్తంగా వస్తు వినియోగ రంగంలో అగ్రగామిగా ఉన్న యూనిలీవర్ సంస్థ.. హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(జీసీసీ)ను ఏర్పాటు చేసే అవకాశాలపై ఆసక్తి కనబరిచింది. యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్ ఆఫీసర్ విల్లెమ్ ఉయిజెన్తో మంగళవారం దావో్‌సలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా హైదరాబాద్ మారుతోందన్నారు. దీంతో హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటు అవకాశాలను తమ సంస్థ సానుకూలంగా పరిశీలిస్తుందని విల్లెమ్ ఉయిజెన్తో తెలిపారు. కాగా, హైదరాబాద్‌లో ఇప్పటికే మెక్‌డొనాల్డ్స్, హైనెకెన్, కాస్టకో వంటి ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ(వేగంగా విక్రయమయ్యే వినియోగ వస్తువులు) సంస్థల జీసీసీలు విజయవంతంగా పని చేస్తున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కుల్లో ఎఫ్‌ఎంసీజీ రంగ పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని యూనిలీవర్‌ను ఆహ్వానించారు. వాతావరణ పరిరక్షణ, నీటి వినియోగంలో సానుకూలత, ప్లాస్టిక్ వినియోగ తగ్గింపు వంటి యూనిలీవర్ లక్ష్యాలను, తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న పునరుత్పాదక శక్తి, నీటి సంరక్షణ, సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాలతో అనుసంధానం చేసే అంశాలపై కూడా చర్చలు జరిగాయి.
ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కలిసి పని చేస్తాం
భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణతో కలిసి పని చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్‌తౌక్ అల్ మారి తెలిపారు. ఆయన సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కాగా, సుమారు 30 వేల ఎకరాల్లో విస్తరించే ఫ్యూచర్ సిటీలో ఏఐ, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, నివాసం, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే మారుబేని, సెమ్ కార్ప్ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని, ఇటీవలే రిలయన్స్ గ్రూప్ వంతారాతో ఫ్యూచర్ సిటీలో కొత్త జూ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం కుదిరిందని సీఎం వివరించారు. కాగా, యూఏఈ ఫుడ్ క్లస్టర్‌తో తెలంగాణ కలిసి పనిచేసి గ్రామీణ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఆకాంక్షను అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రి వ్యక్తం చేశారు.
స్కిల్ వర్సిటీతో భాగస్వామ్యానికి సౌదీ సంస్థ ఆసక్తి..
సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ ‘ఎక్స్‌పర్టయిజ్’.. రాష్ట్రంలోని స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామ్యమయ్యేందుకు ఆసక్తి చూపింది. సంస్థ ప్రెసిడెంట్, సీఈవో మొహమ్మద్ ఆసిఫ్.. రేవంత్‌రెడ్డి బృందంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థకు, ఉద్యోగ అవకాశాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. 2047 విజన్‌కు అనుగుణంగా తెలంగాణను భవిష్యత్తు ప్రతిభా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రాథమిక విద్య, ఆధునిక నైపుణ్యాలు, శిక్షణ, మెంటార్‌షిప్ ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని సాధించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. భారతదేశంలో పూర్తిగా పరిశ్రమల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తొలి విశ్వవిద్యాలయం స్కిల్ యూనివర్సిటీయేనన్నారు. ఎక్స్‌పర్టయిజ్ సంస్థ సీఈవో ఆసిఫ్ మాట్లాడుతూ.. ఏటా సుమారు 5వేల మంది నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించుకునే అవసరం తమకు ఉందన్నారు. ఆ అవసరాలను తీర్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో భాగస్వామ్యం చేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన అన్ని విభాగాల్లో శిక్షణను యూనివర్సిటీతో కలిసి ప్రారంభించాలని అనుకుంటున్నామని చెప్పారు.
ఏఐతో మెరుగైన పౌర సేవలు: సీఎం రేవంత్
కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించి తెలంగాణ రాష్ట్రంలో పౌర సేవలను మరింత మెరుగ్గా, సమర్థంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్లూఈఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారం దావో్‌సలో ‘ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బిల్డింగ్ కాంపిటీటివ్‌నెస్’ అనే అంశంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం ప్రసంగించారు. రైతు భరోసా వంటి సబ్సిడీల ట్రాకింగ్ మొదలుకుని ఆస్తిపన్ను వసూలు, మహిళలకు అందించే సంక్షేమ పథకాల అమలు, పట్టణ మునిసిపల్ సమస్యల పరిష్కారం వరకు.. అనేక రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. వ్యవస్థలోని మేధస్సే ఒకవైపు సమస్యగా, మరోవైపు పరిష్కారంగా మారుతోందని అభిప్రాయపడ్డారు. ఏఐని సరైన దిశలో వినియోగిస్తే.. పాలన మరింత సమర్థంగా మారుతుందన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను ముఖ్యమంత్రి వివరిస్తూ.. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా మారిందని, అన్ని రంగాలకు చెందిన అగ్రశ్రేణి కంపెనీలు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ సదస్సులో స్మార్ట్ ఫ్యాక్టరీలు, స్థిరమైన ఇంధన వ్యవస్థలు, ఏఐ ఆధారిత సేవలు, స్మార్ట్ సిటీల నిర్మాణంపై ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాలపై చర్చించారు. సమావేశంలో ఈజిప్ట్ మంత్రి హస్సన్ ఎల్కహతీబ్, ఎమరాల్డ్ ఏఐ సీఈవో వరుణ్ శివరాం, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ(డబ్ల్యూఐపీవో) డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్, జర్మనీ డిజిటల్ శాఖ మంత్రి కార్‌స్టెన్ వైల్డ్ బెర్గర్, నోకియా సీఈవో జస్టిన్ హోటార్డ్, హిటాచి సీఈవో తోషియాకి టోకునాగా సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి బృందం ముందుగా స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. వారికి విమానాశ్రయంలో భారత రాయబారి మృదుల్‌కుమార్, తెలంగాణకు చెందిన ప్రవాసులు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అంతకుముందే దావో్‌సకు చేరుకున్నారు. సీఎంతో జరిగిన వివిధ సంస్థల ప్రతినిధుల సమావేశంలో ఈ మంత్రులిద్దరూ పాల్గొన్నారు.
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కండి: శ్రీధర్‌బాబు
సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌స)లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచిన తెలంగాణలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. పారిశ్రామికాభివృద్థికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణతో కలిసి పని చేేసందుకు, రాష్ర్టాభివృద్థిలో పాలు పంచుకునేందుకు ముందుకు రావాలని వారిని ఆహ్వానించారు. మంగళవారం డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సులో భాగంగా దావో్‌సలో ఏర్పాటు చేసిన ఇండియా పెవిలియన్ ప్రారంభోత్సవంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. అందుకనుగుణంగా దార్శనికతతో కూడిన, ప్రణాళికా బద్ధమైన అడుగులు వేస్తున్నామని తెలిపారు. తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా లైఫ్ సైన్సెస్ పాలసీ, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్(టీఏఐహెచ్)ను దావోస్ వేదికగా లాంఛనంగా ఆవిష్కరిస్తామన్నారు.
మెట్రో రెండో దశకు మార్గం సుగమం చేయండి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ లేఖ
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం త్వరిత గతిన ఆమోదం తెలిపేలా చూడాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ ప్రాజెక్టు విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు కిషన్‌రెడ్డికి ఒక లేఖ రాశారు. మెట్రో ఫేజ్-2కు కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిందని, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రం ప్రతిపాదించిన సంయుక్త కమిటీలోకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారులను నామినేట్ చేశామని, అడిగిన వివరాలన్నీ అందజేశామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ఫేజ్ -2 మెట్రో రైలు ప్రాజెక్టును వీలైనంత త్వరగా ఆమోదింపచేయాని కోరారు.