బతుకమ్మ, దసరా వేళ ఆర్టీసీ ఛార్జీల పెంపు.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్
ABN , Publish Date - Oct 18 , 2026 | 10:58 AM
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 18: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పండుగల వేళ ప్రజలకు ఊరట కల్పించాల్సింది పోయి.. టికెట్ ధరలను పెంచి ప్రయాణికులపై అదనపు భారం మోపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
రెగ్యులర్ బస్సులను తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు గతంలో రూ.230గా ఉన్న టికెట్ ధరను రూ.400కు పెంచారని, మహబూబ్‌నగర్ నుంచి ఎంజీబీఎస్‌కు రూ.220గా ఉన్న ఛార్జీని రూ.290కు పైగా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండుగల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నారని విమర్శించారు.
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెబుతూ, పురుషుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడం వల్ల ఆ భారం తిరిగి కుటుంబాలపైనే పడుతోందని హరీశ్ రావు అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ టికెట్ ఛార్జీలను పలుమార్లు పెంచారని ఆరోపిస్తూ, పండుగల సమయంలో అదనపు ఛార్జీలతో పేద, మధ్యతరగతి ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పండుగల పేరుతో పెంచిన ఛార్జీలను తగ్గించాలని, రెగ్యులర్ బస్సులను యథావిధిగా నడిపి ప్రయాణికులపై అదనపు భారం పడకుండా చూడాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.
ఈ వార్తలూ చదవండి
రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్‌ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.
‘ఫుట్‌పాత్ ఏర్పాటు చేయకపోతే ధర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక