ప్రపంచానికే గేట్‌వేగా తెలంగాణ
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:52 AM
దేశంలోనే కాదు.. ప్రపంచానికే తెలంగాణను గేట్‌వేగా నిలబెట్టాలనేది తన లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంట్ రాచబాటలా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.
ఆ లక్ష్యం దిశగా సాగుతున్నాం.. తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంటే దానికి రాచబాట
2034 నాటికి ట్రిలియన్ డాలర్లు.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
రైతులను వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం
కృష్ణా, గోదావరిపై ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్ని పునరుద్ధరిస్తాం
ఆర్థిక శక్తి కేంద్రాలుగా మహిళా సంఘాలు.. 5 శాఖల్లో ఖాళీల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్లు
ఉద్యోగులకు బీమా, నగదు రహిత ఆరోగ్య పథకం.. రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే కాదు.. ప్రపంచానికే తెలంగాణను గేట్‌వేగా నిలబెట్టాలనేది తన లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంట్ రాచబాటలా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఉండాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమన్నారు. ఈ ఆర్థికవృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం రెండున్నరేళ్లుగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మంగళవారం నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రైతులు కేవలం పంటలు పండించటమే కాదు.. వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా వారిని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామని సీఎం తెలిపారు. వరి, పత్తి, మొక్కజొన్నల సాగు, పశుసంపద, మత్స్యరంగం గణనీయమైన అభివృద్ధి సాధించాయని.. భవిష్యత్తులో రైతులు రాష్ట్రాన్ని సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు 2-3 రకాల పంటలసాగుకే పరిమితం కాకుండా నూనెగింజలు, పప్పుధాన్యాలు, కూరగాయలు పెద్ద ఎత్తున పండించాలని సూచించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తూనే, సౌరశక్తితో నడిచే పంపుసెట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని, అదనంగా ఉత్పత్తి అయ్యే కరెంటును గ్రిడ్‌కు అందించి రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చేస్తున్నామని చెప్పారు. రైతుభరోసా, రైతుబీమా, రుణమాఫీ పథకాలకు రెండున్నరేళ్లలో రూ.1,56,496 కోట్లు, ధాన్యం కొనుగోళ్లకు రూ.82,840 కోట్లు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ధాన్యం, మొక్కజొన్న, జొన్న తదితర పంటల కొనుగోళ్లలో దేశంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణతో పోటీపడే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ నీటిగోస తీరలేదని, పదేళ్ల గత పాలనలో పరిస్థితులు మారలేదని, కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాలు తేల్చి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేస్తామని సీఎం చెప్పారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు తిరిగి ప్రాణంపోస్తామని, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించే పనులు మొదలుపెడతామని ప్రకటించారు.


ఆర్థికశక్తి కేంద్రాలుగా మహిళా సంఘాలు
ప్రజాపాలనలో మహిళా సంఘాలు ఆర్థిక శక్తికేంద్రాలుగా, ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్షేత్రాలుగా తయారయ్యాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లు, సౌర విద్యుత్ ప్లాంట్లు, పెట్రోలు బంకులతోపాటు వెయ్యి ఆర్టీసీ బ స్సులకు ఓనర్లుగా మారారని, సూపర్ బజార్లు, లాజిస్టిక్ హబ్‌లు, గోడౌన్లు, రైస్‌మిల్లుల ఏర్పాటుకు మహిళలు సిద్ధమయ్యారని గుర్తు చేశారు. మరోవైపు, నిరుద్యోగులకు సీఎం శుభవార్త చెప్పారు. టీజీపీఎస్‌సీ ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, అటవీశాఖ, విద్యాశాఖల్లో ఖాళీ ల భర్తీకి ఈ నెలలో నోటిఫికేషన్ ఇస్తామని, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రస్తావిస్తూ.. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో 1,190 మంది విద్యార్థులు కోర్సు పూర్తిచేశారని, వీరిలో 838 మంది మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఏఐజీ- అపోలో హాస్పిటల్స్‌లో ఉద్యోగాలు పొందినట్లు సీఎం గుర్తు చేశారు. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని అమలుచేస్తామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
13 నెలల్లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, ఈ ఏడాది సెప్టెంబరు 17వ తేదీ నాటికి మరో 2 లక్షల ఇళ్లను పూర్తిచేస్తామని సీఎం ప్రకటించారు. ఈ ఏడాది క్యూర్ పరిధిలో లక్ష ఇళ్లు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసి, 19.44 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చి... మొత్తంగా 3.38 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. వృద్ధుల సామాజిక భద్రతకు భరోసా, గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం కొత్త చట్టాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 73 రకాల ఉపాధి రంగాల కార్మికులకు కనీస వేతనాలు నోటిఫై చేసినట్లు గుర్తు చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయటానికి కమిటీ వేశామన్నారు. కులగణనను, 59 షెడ్యూల్డు కులాల గ్రూపుల విభజనను విజయవంతంగా పూర్తిచేసి, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని ఆమోదించినట్లు తెలిపారు. ఉద్యోగులకు ప్రత్యేక బీమాను తీసుకొచ్చామని, నగదు రహిత ఆరోగ్య పథకాన్ని త్వరలో అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. వరంగల్ హెల్త్ సిటీ, సనత్‌నగర్, అల్వాల్, ఎల్‌బీ నగర్‌లో టిమ్స్ హాస్పిటళ్లు, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టినట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ముందే ముగిసిన సీఎం ప్రసంగం
సీఎం రేవంత్‌రెడ్డి పరేడ్ మైదానానికి ఉదయం 8.30 గంటలకు చేరుకొని జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత 9 గంటలకు ప్రసంగం ప్రారంభించారు. అరగంటపాటు మాట్లాడిన తర్వాత.. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రసంగాన్ని ముగిస్తున్నానని, పిల్లలు, పెద్దలు ఎవరూ ఇబ్బందులు పడకూడదని ప్రసంగ పాఠం మొత్తం చదవటంలేదని ప్రకటించారు. వేడుకల్లో పోలీసులు, కమెండోల పరేడ్‌లు, కళాకారుల ప్రదర్శనలు ప్రజలను అలరించాయి. పరేడ్ మైదానానికి వెళ్లే ముందు గన్‌పార్కులోని అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్‌రెడ్డి పుష్పాంజలి ఘటించారు.
తెలంగాణ సంస్కృతికి పెద్దపీట
రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు కళ్లెం వేశామని, షీ-టీమ్స్, టీ-సేఫ్ సర్వీస్ ద్వారా మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తున్నామని, మేడారం, యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర, కాళేశ్వరం ఆలయాల అభివృద్ధి పనులు శీఘ్రగతిన జరుగుతున్నాయన్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను రూ.వేయి కోట్లతో ఘనంగా నిర్వహిస్తామని, టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహిస్తున్నామని, లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్డు ట్యాక్స్‌లో మినహాయింపులు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. కబ్జాల్లో ఉన్న చెరువులు, కుంటలకు విముక్తి కలిగించామని, రూ.60 వేల కోట్ల విలువైన 1,045 ఎకరాల విస్తీర్ణాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలును ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా మూసీ తీరంలో మసీదు, చర్చి, గురుద్వారా నిర్మిస్తామని వెల్లడించారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఏర్పాటుచేస్తున్నామని, శంషాబాద్‌ను బుల్లెట్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేయటం ద్వారా రీజినల్ కనెక్టివిటీ బలోపేతం అవుతుందన్నారు. వరంగల్, ఆదిలాబాద్‌లో విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని, వరంగల్‌లో 950 ఎకరాల స్థలాన్ని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించినట్లు సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, 2030 నాటికి రాష్ట్రాన్ని టాప్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా నిలబెట్టాలనేది లక్ష్యమని, దీనిద్వారా రాబోయే రోజుల్లో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

అమరుల ఆకాంక్షలకు అనుగుణంగానే కాంగ్రెస్ పాలన: రాహుల్
అమరుల ఆకాంక్షలకు అనుగుణంగానే తెలంగాణ పాలన సాగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటాలను, అమరుల త్యాగాలను ఆయన మంగళవారం ‘ఎక్స్’ వేదికగా స్మరించుకున్నారు. ‘‘తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ అనేది లక్షలాది మంది ప్రజల పోరా టం, త్యాగాల ఫలితం. తమ కలల తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన ప్రతి ఒక్కరినీ ఈరోజు మనం స్మరించుకుందాం. సామాజిక న్యాయం, సమానత్వంతో, ప్రతి తెలంగాణ పౌరుడు ఆత్మగౌరవంతో తలెత్తుకుని ముందుకు సాగేలా, అమరుల వారసత్వా న్ని నిలబెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోంది’’ అని రాహుల్ పేర్కొన్నారు.