Share News

పాలిటెక్నిక్‌ల విలీనంపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 20 , 2026 | 06:19 PM

స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్‌ల విలీనంపై నెలకొన్న అపోహలకు మంత్రి వివేక్ వెంకటస్వామి తెరదించారు. పాలిటెక్నిక్‌లను అప్‌గ్రేడ్ చేసి విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. లెక్చరర్లు, సిబ్బంది ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఫీజులు, ఈసెట్‌ ద్వారా లేటరల్ ఎంట్రీ విధానంలోనూ మార్పులు ఉండవని తెలిపారు.

పాలిటెక్నిక్‌ల విలీనంపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు
Telangana Polytechnic Merger

హైదరాబాద్, ఆగస్టు 20: ఇటీవల స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్‌ల విలీనంపై నెలకొన్న అపోహలకు మంత్రి వివేక్ వెంకటస్వామి తెరదించారు. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై కొందరు అపోహలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పాలిటెక్నిక్‌లను మరింత అప్‌గ్రేడ్ చేసి, విద్యార్థులకు మెరుగైన నైపుణ్య శిక్షణ అందించాలనే ఉద్దేశంతోనే వాటిని స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. బ్లూ కాలర్ ఉద్యోగాల్లోనూ తెలంగాణ యువత ముందుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్లు, సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగానే కొనసాగుతారని, వారి సర్వీసు భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. డిప్యూటేషన్, బదిలీల విధానంలోనూ ఎలాంటి మార్పులు ఉండవని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసినప్పటికీ పాలిటెక్నిక్ ఫీజుల్లో ఎలాంటి మార్పు ఉండదని, విద్యార్థులు ఈసెట్ ద్వారా బీటెక్ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ పొందే విధానం యథావిధిగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. అలాగే పాలిసెట్‌ను కూడా కొనసాగిస్తామని తెలిపారు.


పాలిటెక్నిక్ విద్యార్థులు, లెక్చరర్లకు విలీనంతో మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. విద్యార్థులకు రూ.2 వేల స్టైఫండ్ అందించే అంశంపై కూడా కసరత్తు చేస్తున్నామని చెప్పారు. వరంగల్‌లో విద్యార్థి పట్ల అనుచితంగా ప్రవర్తించిన సీఐపై చర్యలు తీసుకుని బదిలీ చేశామని తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలిటెక్నిక్ కాలేజీలను పట్టించుకోలేదని విమర్శించారు. విద్యార్థుల ఆందోళనల వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందని ఆరోపించిన మంత్రి.. రాజకీయ పార్టీల తప్పుడు ప్రచారాన్ని విద్యార్థులు, ఉద్యోగులు నమ్మవద్దని సూచించారు. శక్తి శాఖ పేరును కార్మిక శాఖగా కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయని, శాఖ పేరులో ‘కార్మిక’ పదం కూడా ఉండేలా మార్పులు చేసే ఆలోచన ఉందని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

ఎస్‌సీబీఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా రవిశంకర్ ఎన్నిక

సీఎం చంద్రబాబు ఆదర్శ పాలన అందిస్తున్నారు: ఎంపీ శ్రీభరత్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 20 , 2026 | 07:16 PM