తెలంగాణ పోలీస్ శాఖలో ప్రమోషన్లకు లైన్ క్లియర్.. సీనియారిటీ వివాదాల పరిష్కారానికి డీజీపీ చొరవ
ABN , Publish Date - Nov 17 , 2026 | 06:13 PM
తెలంగాణ పోలీస్ శాఖలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లకు లైన్ క్లియర్ అయింది. సీనియారిటీ వివాదాల పరిష్కారానికి డీజీపీ సీవీ ఆనంద్ కీలక చొరవ తీసుకున్నారు.
హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణ పోలీస్ శాఖలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. సీనియారిటీ వివాదాలు, కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన ప్రమోషన్ల చిక్కుముడిని విప్పేందుకు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్వయంగా రంగంలోకి దిగారు. 1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన సివిల్ ఎస్ఐ (ప్రస్తుత డీఎస్పీలు) అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
విడతల వారీగా ప్రమోషన్లు, పోస్టింగ్స్
సీనియారిటీ వివాదాలు, కోర్టు కేసులను సామరస్యంగా పరిష్కరించుకుని విడతల వారీగా పదోన్నతులు, పోస్టింగ్స్ ఇవ్వాలని డీజీపీ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫేజ్-1, ఫేజ్-2 కింద ప్రమోషన్ ప్యానల్స్‌ను సిద్ధం చేశారు. ప్రస్తుతం వెంటనే భర్తీ చేసేందుకు 54 అదనపు ఎస్పీ (Additional SP) పోస్టులు సిద్ధంగా ఉన్నాయని, 2027 ఆగస్టు నాటికి మరో 34 అదనపు ఎస్పీ పోస్టులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
వీటితో పాటు 12 మంది అదనపు ఎస్పీలకు నాన్-క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించనుండగా, ఈ ప్యానల్ ఇయర్‌లో మరో 10 నాన్-క్యాడర్ ఎస్పీ పోస్టులను కేటాయించనున్నారు.
ముఖ్యమంత్రి దృష్టికి ఏకాభిప్రాయం
కోర్టు కేసులు, సీనియారిటీ వివాదాలతో ప్రమోషన్లు మరింత ఆలస్యమైతే అధికారులందరికీ నష్టం వాటిల్లుతుందని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ముఖ్యంగా పదవీ విరమణకు దగ్గరగా ఉన్న సీనియర్ అధికారులకు ఈ ప్రమోషన్లు ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగకుండా, పూర్తిగా నిబంధనలు, అర్హతల ప్రకారమే పదోన్నతుల ప్రక్రియ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో కుదిరిన ఏకాభిప్రాయాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ప్రమోషన్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని డీజీపీ తెలిపారు. (Telangana Police promotions)
ఇవి కూడా చదవండి:
అరుదైన గౌరవం.. ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీలోకి భారత షూటర్ మను భాకర్
ఐపీఎల్ 2027: ఎల్ఎస్‌జీతో ట్రేడ్ డీల్.. రాజస్థాన్ రాయల్స్‌కు షమీ