Share News

ఎన్నికల సంఘం బిగ్ షాక్.. పార్టీలకు నో టైమ్..

ABN , Publish Date - Jan 27 , 2026 | 05:52 PM

తెలంగాణలో రాజకీయ పార్టీలకు ఈసీ షాక్ ఇచ్చిందా? మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌‌ ఆయా పార్టీల్లో టెన్షన్ రేపిందా? అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. మరి పొలిటికల్ పార్టీల టెన్షన్‌కు కారణమేంటి? ఆయా పార్టీలు ఎలా ముందుకు వెళ్లనున్నాయి? ఈ కథనంలో తెలుసుకుందాం..

ఎన్నికల సంఘం బిగ్ షాక్.. పార్టీలకు నో టైమ్..
Telangana municipal elections

హైదరాబాద్, జనవరి 27: రాష్ట్రంలో మరో ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలు ముగియగా.. ఆ హడావుడి తగ్గక ముందే మరో ఎన్నికలకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ రిలీజ్ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, తాజా నోటిఫికేషన్‌తో ఈసీ అన్ని పార్టీలకు బిగ్ షాకిచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఎందుకంటే.. అభ్యర్థులను ఖరారు చేసేందుకు కనీస సమయం కూడా ఇవ్వలేదు ఈసీ. రేపటి నుంచే(జనవరి 28వ తేదీ) నామినేషన్ల ప్రకియ ప్రారంభం అవుతుండటం.. కేవలం 3 రోజులు అంటే జనవరి 30 వరకు మాత్రమే నామినేషన్లకు అవకాశం కల్పించడంతో ఆయా పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈసీ ఇచ్చిన మూడు రోజుల వ్యవధిలోనే అభ్యర్థులను ఖరారు చేసుకోవడం, వారికి బీఫాం ఇవ్వడం చేయాలంటే ఆయా పార్టీలకు పెద్ద టెన్షన్‌తో కూడిన పనే అని చెప్పాలి. పైగా ప్రచారం చేసే సమయం కూడా పెద్దగా లేదు. ఫిబ్రవరి 11వ తేదీనే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో ప్రచారానికి కూడా ఎక్కువ సమయం లేకుండా పోయింది.


రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2,996 వార్డులకు ఎన్నికలు జరుగనుండగా.. ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు, ప్రధాన పార్టీల నుంచి టికెట్ పొందేందుకు ఎంతోమంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయని సమాచారం బయటకు వచ్చినప్పటి నుంచే ఆశావహులు తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ వచ్చారు. గ్రౌండ్ లెవల్లో పనులు చేసుకుంటూనే.. పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైపోయారు. అయితే, ఆశావహులు ఎంతమంది ఉన్నప్పటికీ.. పార్టీల తరఫున టికెట్ మాత్రం కొందరికే వచ్చే అవకాశం ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థుల బలాబలాలను పరిశీలించి.. ఎవరైతే గెలవగలరో వారికి మాత్రమే టికెట్ కేటాయిస్తారు. ఈ తతంగం అంతా చేయాలంటే ఖచ్చితంగా టైమ్ పడుతుంది.


కానీ, ఈసీ మాత్రం రాజకీయ పార్టీలకు అంత టైమ్ ఇవ్వలేదు. కేవలం మూడు రోజులు మాత్రమే నామినేషన్లకు అవకాశం ఇవ్వడంతో.. ఆయా పార్టీల్లో, ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని ఆశావహులు.. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని పొలిటికల్ పార్టీలు భావిస్తున్న తరుణంలో.. ఈసీ నోటిఫికేషన్ అందరి నోట్లో వెలక్కాయ పడినట్లుగా మారింది. అభ్యర్థులను ఎలా ఎంపిక చేయాలి.. ఎవరిని ఎంపిక చేయాలి.. టికెట్ ఆశించి భంగపడిన వారిని ఎలా కంట్రోల్ చేయాలా అని ఆయా పార్టీల పెద్దలు సతమతం అవుతున్నారు. అభ్యర్థుల ఎంపికల విషయంలో తొందరపడితే నష్టపోవచ్చనే భయం అన్ని పార్టీల నేతలను వెంటాడుతోంది. అలాగని నిదానంగా ఎంపిక చేయడానికి సమయం కూడా లేదు. దీంతో ముందు నుయ్యి.. ఎనుక గొయ్యి అన్నట్లుగా రాజకీయ పార్టీల పరిస్థితి తయారైంది.


ఎవరి ధీమా వారిదే..

పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీనే పై చేయి సాధించింది. పురపాలికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. మొత్తానికి మొత్తం కార్పొరేషన్లు కైవసం చేసుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీలు సైతం ఎక్కువ స్థానాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా.. ఈసీ ఇచ్చిన షాక్‌ను తట్టుకుని గెలిచి నిలిచే పార్టీ ఏది అనే అంశ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.


ఇవీ చదవండి:

ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. కస్టమర్లకు ఇక్కట్లు

టీ20 ప్రపంచకప్ నుంచి పాక్ తప్పుకుంటే.. తప్పవీ శిక్షలు!

Updated Date - Jan 27 , 2026 | 07:27 PM