ఎమ్మెల్సీల నియామకంపై విచారణ వాయిదా.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
ABN , Publish Date - Apr 22 , 2026 | 01:37 PM
తెలంగాణలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జులై 22వ తేదీకి వాయిదా పడింది. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జులై 22వ తేదీకి వాయిదా పడింది. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కొత్తగా సిఫార్సు చేసిన అభ్యర్థులపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్‌కు మరికొంత సమయం కావాలని అటార్నీ జనరల్ కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేసిన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ (అజారుద్దీన్) ల నియామకంపై కొత్త గవర్నర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అటార్నీ జనరల్ వెంకటరమణి ధర్మాసనానికి వివరించారు. ఈ నెల 31తో ఆరు నెలల గడువు ముగుస్తున్న తరుణంలో, గవర్నర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ విచారణను కొనసాగించాలా లేదా ముగించాలా అన్నది తేలుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయగా.. అప్పటి గవర్నర్ తమిళిసై ఆ ఫైల్‌ను తిరస్కరించారు. దీన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. అయితే, పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి, కొత్త వారిని నియమించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని గతంలోనే జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ మేరకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాత సిఫార్సులను పక్కన పెట్టి.. కొత్త నోటిఫికేషన్ ద్వారా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను ప్రతిపాదించింది. వీరి నియామకంపై కొత్త గవర్నర్ నిర్ణయం వెలువడితే ఈ న్యాయపరమైన చిక్కులు తొలగిపోయే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
తప్పు చేసిన వారు తప్పించుకోలేరు: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్
ఎవరు ఔనన్నా కాదన్నా.. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం: హరీశ్ రావు
Read Latest Telangana News And Telugu News