‘నీ కుటుంబాన్ని లేపేస్తా, నిన్ను బొందపెడతా’
ABN , Publish Date - Nov 03 , 2026 | 03:00 AM
మంత్రి దామోదర రాజనర్సింహ తోటి ఎమ్మెల్యేల సమక్షంలో తనను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు ‘నీ కుటుంబాన్ని లేకుండా చేస్తా, నిన్ను బొందపెడతా’ అని బెదిరించారని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆరోపించారు.
అని మంత్రి దామోదర నన్ను బెదిరించారు
తోటి ఎమ్మెల్యేల సమక్షంలో దూషించారు
రూంలో వేసి చితక బాదుతానన్నారు
నాకు చెప్పకుండా డీసీసీ పదవులు
ఇప్పిస్తావా అంటూ హెచ్చరించారు
జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఆరోపణ
న్యూఢిల్లీ, కామారెడ్డి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మంత్రి దామోదర రాజనర్సింహ తోటి ఎమ్మెల్యేల సమక్షంలో తనను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు ‘నీ కుటుంబాన్ని లేకుండా చేస్తా, నిన్ను బొందపెడతా’ అని బెదిరించారని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆరోపించారు. సోమవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలోని సంగ్రీలా హోటల్ లాబీలో సోమవారం తనపై వ్యక్తిగత దూషణలకు దిగడమే కాకుండా, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బెదిరించారని చెప్పారు. తనకు, మంత్రి దామోదరకు ఎలాంటి వ్యక్తిగత తగాదాలు లేవని, తాను మర్యాదపూర్వకంగానే పలుకరించేందుకు వెళ్తే తీవ్రస్థాయిలో కేకలు వేస్తూ దుర్భాషలాడారని తెలిపారు. ‘నిన్ను బొందపెడతా... ఏమనుకుంటున్నావ్? నాకు తెలియకుండానే అధిష్ఠానంతో సంప్రదింపులు జరుపుతూ డీసీసీ పదవులు ఇప్పిస్తున్నావట.. నీవు ఎవడికంటే వాడికి ఇప్పిస్తావా? నువ్వేమైనా పెద్దసుల్తాన్ అనుకుంటున్నావా? అరగంట రూమ్‌లో వేసి చితకబాదుతా..’ అంటూ మంత్రి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తోటి ఎమ్మెల్యేల సమక్షంలోనే మంత్రి తనను బూతులు తిట్టడంపై తీవ్ర ఆవేదనకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌లకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డిని కూడా స్వయంగా కలిసి మంత్రిపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగుతున్న తన వ్యక్తిగత గౌరవానికి, ప్రజాప్రతినిధిగా తన హోదాకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలను కోరుతానని లక్ష్మీకాంతరావు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి