విత్ డ్రాలకు వేళాయె!
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:19 AM
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీలనూ ఉపసంహరించుకునే యోచనలో ఉన్న సర్కారు..
ఎస్‌బీఐలో లావాదేవీల నిలిపివేత దిశగా సర్కారు అడుగులు
కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా విత్‌డ్రా.. ప్రస్తుతం రూ.5-6వేల కోట్లు ఉన్నట్లు అంచనా
కార్పొరేషన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు సైతం వెనక్కి.. ‘లీడ్ బ్యాంకు’ హోదా కూడా తొలగింపు?
నేడు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం.. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి
ఎస్‌బీఐ తీరును ప్రధానికి, ఆర్థిక మంత్రికి,ఆర్‌బీఐ గవర్నర్‌కు వివరించనున్న సీఎం
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీలనూ ఉపసంహరించుకునే యోచనలో ఉన్న సర్కారు.. ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. రాయదుర్గంలోని సర్వే నంబరు 83/1లోని 5 ఎకరాల భూముల వేలం విషయంలో ఎస్‌బీఐ వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాకుండా.. పలు పథకాలు, ఇతరత్రా మ్యాచింగ్ గ్రాంట్ల కోసం కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా ఎక్కువగా ఎస్‌బీఐలోనే పెడుతుండగా.. వాటిని కూడా వెంటనే విత్‌డ్రా చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలిసింది. మరోవైపు ప్రభుత్వ పరిధిలోని పలు కార్పొరేషన్‌లు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు సంబంధించి వందల కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎస్‌బీఐలో ఉన్నట్లు సర్కారు సేకరించిన ప్రాథమిక వివరాల్లో తేలిందని, వాటిని కూడా వడ్డీతో సహా బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు ప్రభుత్వంలో ఎస్‌బీఐకి ఉన్న ‘లీడ్ బ్యాంకు’ హోదానూ పక్కనపెట్టే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అంశాలన్నింటిపై సోమ, మంగళవారాల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాయదుర్గంలోని ఐదెకరాల భూముల విషయంలో ఎస్‌బీఐ వ్యవహరించిన తీరును సోమ, మంగళవారాల్లో ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు, ఆర్‌బీఐ గవర్నర్ మల్హోత్రాకు వివరించే అవకాశం ఉందని తెలిసింది.
రూ.5-6వేల కోట్లు ఎస్‌బీఐలో!
రాష్ట్ర ప్రభుత్వం నిత్యం తన లావాదేవీలను ఎక్కువగా ఎస్‌బీఐ నుంచే నిర్వహిస్తోంది. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఈ బ్యాంకుతోనే తమ లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగుల జీతాలు, పీఎఫ్‌లు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు, కార్పొరేషన్లు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు సహా ఇతరత్రా లావాదేవీలు కూడా ఈ బ్యాంకు నుంచే జరుగుతున్నాయి. దీంతో ప్రతి రోజూ, నెల వారీగా చూస్తే రూ.వేల కోట్లలో ప్రభుత్వం.. ఎస్‌బీఐతో లావాదేవీలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ లావాదేవీలను నిలిపివేయడంతోపాటు ప్రభుత్వ సంస్థలకు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను కూడా ఉపసంహరించుకోవాలని సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది. శనివారం రాత్రి వరకు అన్ని శాఖల నుంచి అందిన ఎస్‌బీఐ లావాదేవీల ప్రకారం.. వివిధ స్కీమ్‌లు, మ్యాచింగ్ గ్రాంట్ల కింద రాష్ట్రానికి దాదాపు రూ.5-6 వేల కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం. ఈ నిధులన్నీ ప్రస్తుతం ఎస్‌బీఐలోనే ఉన్నట్లు, వాటన్నింటినీ విత్ డ్రా చేసుకుని వేరే బ్యాంకులోకి బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.
కార్పొరేషన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎస్‌బీఐలోనే అధికం..
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని కార్పొరేషన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఎస్‌బీఐలోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం సేకరించిన వివరాల ప్రకారం రోడ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఆర్‌డీసీ) పరిధిలో సుమారు రూ.75 కోట్లు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)కి సంబంధించి రూ.80 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మరో సంస్థ పరిధిలో సుమారు రూ.300 కోట్ల లావాదేవీలు ఎస్‌బీఐలో ఉన్నట్టు తేలింది. ఇలా అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు, యూనివర్సిటీల లావాదేవీలన్నీ కోట్లలోనే ఉన్నాయని సమాచారం. వీటన్నింటి నుంచి వైదొలగాలని ప్రభుత్వం యోచిస్తోందని, దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. కార్పొరేషన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను వేరే బ్యాంకుకు బదిలీ చేసేందుకు ఉన్న మార్గాలపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఎస్‌బీఐకి ఉన్న ‘లీడ్ బ్యాంకు’ హోదా నుంచి కూడా తొలగించేందుకు ఉన్న అవకాశాలపైనా ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం.