Telangana: తొలి దశలో 2310 గ్రామాల్లో అనుభవదారు సర్వే!
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:47 AM
రాష్ట్రంలో దశలవారీగా అనుభవదారు (ఎంజాయ్‌మెంట్) సర్వేను చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జిల్లాకు 70 గ్రామాల చొప్పున 2310 గ్రామాల్లో తొలి దశ సర్వే చేసేందుకు రంగం సిద్ధమైంది. సంక్రాంతి తర్వాత సర్వే ప్రారంభించి, మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయాలనే ఆలోచనలో..
పండగ తర్వాత ప్రారంభం.. 3 నెలల్లో పూర్తి?..
4 దశల్లో రాష్ట్రమంతటా పూర్తి చేయాలని యోచన
విస్తీర్ణానికి మించి పాస్ పుస్తకాల జారీ
ఈ సమస్యను అధిగమించడమే సవాల్
హైదరాబాద్, జనవరి 12 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో దశలవారీగా అనుభవదారు (ఎంజాయ్‌మెంట్) సర్వేను చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జిల్లాకు 70 గ్రామాల చొప్పున 2310 గ్రామాల్లో తొలి దశ సర్వే చేసేందుకు రంగం సిద్ధమైంది. సంక్రాంతి తర్వాత సర్వే ప్రారంభించి, మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇటీవల నియమితులైన 3456 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను, త్వరలో నియామకం కానున్న మరో 3500 మంది సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 10954 రెవెన్యూ గ్రామాల్లో నాలుగు విడతలుగా సర్వే పూర్తి చేసి.. భూధార్ కార్డులను అందించేందుకు రెవెన్యూ శాఖ సిద్ధమైంది. పాత సర్వే నంబరుతో సంబంధం లేకుండా సర్వే చేస్తారా? లేక కొత్త సర్వే నంబర్ల ప్రకారమే చేస్తారా? అన్నదానిపైనే ఈ కార్యక్రమ విజయం ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విస్తీర్ణానికి మించి పాస్ పుస్తకాలు జారీ కావడం, సర్వే నంబరులో ఉన్న విస్తీర్ణానికి సంబంధించిన మ్యాప్‌లు లేకపోవడంతో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వివాదాలు తప్పవని మాజీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
తొలుత జిల్లాకు 70 గ్రామాల్లో..
ప్రతి జిల్లా నుంచి 70 గ్రామాలను ఎంపిక చేసి పంపాలని సీసీఎల్‌ఏ నుంచి గత ఏడాది నవంబరులో కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఒకటి, రెండు తప్ప అన్ని జిల్లాల కలెక్టర్లు గ్రామాల వివరాలు పంపారు. ఆయా గ్రామాల్లో సర్వే అనంతరం అనుభవదారు కాలంలో ఉన్న రైతుల వివరాల ఆధారంగా భూధార్ కార్డులను అందజేయనున్నారు. తాత్కాలిక భూధార్ కార్డులు జారీ చేస్తామని భూ భారతి చట్టంలో పేర్కొన్న ప్రభుత్వం ఈ మేరకు కార్డుల జారీకి ముందే సర్వే చేసేందుకు సన్నద్ధమైంది. భూమి వాస్తవంగా ఎవరి అనుభవంలో ఉంది? సర్వే నంబరు, సబ్‌డివిజన్ నంబర్ సరైనవా, కావా? భూమికి సమీపంలో రోడ్లు, చెట్లు, ఇళ్లు, జలవనరులు ఉన్నాయా? హద్దులు పాత రికార్డులతో సరిపోతున్నాయా, లేదా? ఆర్వోఆర్ ప్రకారం హక్కుదారుడి వివరాలు సరిపోతున్నాయా? అనే వివరాలను సేకరిస్తారు. దీనివల్ల భూమి హక్కుల నిర్ధారణ జరుగుతుంది. ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే వివాదరహితమైన రికార్డు తయారవుతుందని అధికారులు చెబుతున్నారు.
పాత సర్వే నంబర్ల ప్రకారం సర్వే చేస్తే కొంతమేర సమస్యలను తగ్గించవచ్చని.. కొత్త వాటి ప్రకారం చేస్తే గొడవలు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. కాగా, సర్వే సిబ్బందికి అవసరమైన పరికరాలనుఅందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 411 రోవర్లను కొనుగోలు చేసిన సర్వే విభాగం.. జిల్లాకు 10 రోవర్లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు 20 జిల్లాలకు 200 రోవర్లను సమకూర్చారు. త్వరలోనే మిగిలిన జిల్లాలకు కూడా సరఫరా చేస్తామని సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. తెలంగాణలో సమగ్ర సర్వేకు 2014లోనే కేంద్రం నిధులు మంజూరు చేసింది. రూ.250 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసి.. రూ.83 కోట్లను కూడా విడుదల చేసింది. కానీ, పదేళ్లుగా భూముల సర్వే దిశగా అడుగులే పడలేదు. తాజాగా రేవంత్ సర్కారు దశల వారీగా సర్వే చేసేందుకు సిద్ధమైంది.
అలా సర్వే చేస్తేనే వివాదాలు తగ్గుతాయి..
గుజరాత్, ఏపీ, గతంలో నిజామాబాద్‌లో నిర్వహించిన సర్వేలు విఫలమయ్యాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని సర్వే యూనిట్‌గా గ్రామాన్ని తీసుకోకుండా ప్రస్తుత సర్వే నంబరునే పరిగణనలోకి తీసుకోవాలి. అనుభవంలో భూమి లేకపోయినా పాస్‌పుస్తకాలు తీసుకుంటే.. వాటిని రద్దు చేయాలి. ప్రభుత్వ భూములు సాగు చేసుకునే వారు, పట్టా భూమి ఉండి, రికార్డులు సరిగా లేని వారి విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. అనుభవం లేని లైసెన్స్డ్ సర్వేయర్ల మీద ఆధారపడితే అవినీతితో పాటు తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. పాస్ పుస్తకంలో నమోదు చేసిన సర్వే నంబరుకు, భూమి ఉన్న సర్వే నంబరుకు పొంతన లేకపోతే ఏం చేయాలన్నదానిపైనా సర్కారు మార్గదర్శకాలు ఇవ్వాలి.
- సీహెచ్ సుబ్బారావు, రిటైర్డ్ ఉన్నతాధికారి
Also Read:
Kishan Reddy: మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఒవైసీ వ్యాఖ్యలు
Onions: మలక్‌పేట మార్కెట్‌కు పోటెత్తిన ఉల్లి
AP News: నేలమ్మకు రంగులకళ తెచ్చానని.. చుక్కా నవ్వవే!