Share News

Kishan Reddy: మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఒవైసీ వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 13 , 2026 | 07:43 AM

హిజాబ్‌ ధరించే ముస్లిం మహిళ దేశానికి ప్రధాని కావాలని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆకాంక్షించడం వెనుక దేశ విభజన రాజకీయాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

Kishan Reddy: మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఒవైసీ వ్యాఖ్యలు

  • హిజాబ్‌ ధరించే ముస్లిం మహిళ ప్రధాని కావాలని ఆకాంక్షించడం వెనుక దేశ విభజన రాజకీయాలు

  • పాక్‌, బంగ్లా వెళ్లి హిందువు ప్రధాని కావాలని అనగలరా? బీఆర్‌ఎస్‌ పని ఖతం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): హిజాబ్‌ ధరించే ముస్లిం మహిళ దేశానికి ప్రధాని కావాలని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆకాంక్షించడం వెనుక దేశ విభజన రాజకీయాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఒవైసీ వ్యాఖ్యలు మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించారు. ఓ హిందువు ప్రధాని కావాలని పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వెళ్లి డిమాండ్‌ చేయగలరా? అని ఒవైసీకి కిషన్‌రెడ్డి సవాల్‌ చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్‌లో హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందన్నారు. లేనిపక్షంలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల్లోని హిందువులకు పట్టిన గతే ఇక్కడి హిందువులకు పట్టేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మతాల పేరుతో రాజకీయాలు జరుగబోవని తేల్చిచెప్పారు. పాతబస్తీలో దళితులు, గిరిజన బస్తీలు, చెరువులను కబ్జా చేసిన చరిత్ర మజ్లి్‌సదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. పని కావాలని నమోదు చేసుకున్న కూలీలకు 15 రోజుల్లో పని కల్పించకపోతే వారికి నిరుద్యోగభృతి ఇచ్చేలా వీబీ-జీరాం చట్టంలో పొందుపరచినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఒక పథకం పేరు మార్పు అన్నది ముఖ్యం కాదని పేర్కొంటూ, ఆ పథకం ద్వారా పేదలకు ప్రయోజనం కలుగుతుందా.. లేదా? అన్నదే ప్రధానమని కిషన్‌రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తాము కూడా కోరతామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడిందని, వచ్చే ఎన్నికల తర్వాత పార్టీ ఆధ్వర్యంలో సర్కారు ఏర్పాటు కాబోతోందన్నారు. తెలంగాణాలో బీఆర్‌ఎస్‌ పని అయిపోయందన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మోదీ నాలుగోసారి ప్రధాని కావడం తథ్యమన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 07:44 AM