Telangana: ఎన్‌టీవీపై ఐఏఎస్‌ల సంఘం ఫిర్యాదు
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:20 AM
ఓ ఐఏఎస్ అధికారిణిపై తప్పుడు వార్తలను ప్రసారం చేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారంటూ ఎన్‌టీవీ, ఇతర యూట్యూబ్ చానెళ్లపై తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘం ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ చేసిన ఫిర్యాదు మేరకు..
సీసీఎస్‌లో బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు
మహిళా ఐఏఎస్‌పై వార్తా ప్రసారంపై అభ్యంతరం
హైదరాబాద్, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ఓ ఐఏఎస్ అధికారిణిపై తప్పుడు వార్తలను ప్రసారం చేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారంటూ ఎన్‌టీవీ, ఇతర యూట్యూబ్ చానెళ్లపై తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘం ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ చేసిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు భారత న్యాయ సంహిత(బీఎన్‌ఎస్) సెక్షన్లు 75, 78, 79, 351(1), 352(2)ల కింద ఎఫ్‌ఐఆర్(07)ను నమోదు చేశారు. ఎన్‌టీవీ యాజమాన్యం, దాని ఎడిటర్లు, రిపోర్టర్లు, యాంకర్లపై ఫిర్యాదు చేశారు. టీ న్యూస్ చానెల్‌తో పాటు వార్తను ప్రసారం చేసిన పలు యూ ట్యూబ్ ఛానెళ్లపై ఫిర్యాదు చేశారు. ఓ రాజకీయ నాయకుడితో తమ సంఘం మహిళా ఐఏఎస్ అధికారిణికి వ్యక్తిగత సంబంధం ఉన్నట్లు ఈ నెల 8న ఎన్‌టీవీ అవాస్తవ, కల్పిత, నిరాధార వార్తను ప్రసారం చేసిందని సంఘం ఆరోపించింది. సమాచారాన్ని నిర్ధారించుకోకుండా చేసిన ఆరోపణల కారణంగా అధికారిణి కుటుంబం అసౌకర్యానికి గురైందని, పరువుకు భంగం వాటిల్లిందని తెలిపింది. ఇది వక్తిత్వ హననమని, మహిళా అధికారిణిని వేధించడమేనని, ప్రతిష్టను దెబ్బ తీయడమేనని పేర్కొంది.
తక్కువ సమయంలో ఆమెకు కీలక పోస్టులు ఇచ్చారంటూ ప్రసారం చేయడం, పరిపాలన వ్యవస్థను అగౌరవపరచడమే కాకుండా అఖిల భారత సేవల విశ్వాసాన్ని భంగపరచడమేనని తెలిపింది. ఎన్‌టీవీ నేరుగా ఐఏఎస్ అధికారిణి పేరును పేర్కొనకపోయినప్పటికీ నల్లగొండ కలెక్టర్‌గా చేశారంటూ పేర్కొనడం వల్ల ఆమెను ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్లయిందని ఆరోపించింది. ఆ అధికారిణికి సంబంధించి 3పోస్టింగ్‌లను పేర్కొనడంతో ఆమె ఎవరో తెలిసిపోయిందని, ఇది వ్యక్తిగత గోప్యతను బయటపెట్టినట్లయిందని తెలిపింది. పైగా ద్వంద్వార్థాలతో వార్తను ప్రసారం చేశారని, ఇది అభ్యంతకరమని, వ్యక్తిగతంగా నష్టమని పేర్కొంది. ఇలాంటి వార్తలను ప్రసారం చేయడమే కాకుండా పలు సోషల్ మీడియా వేదికలనుంచి వైరల్ చేశారని తెలిపింది. ఈ దృష్ట్యా కేసు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని సంఘం కోరింది. డిజిటల్ మీడియాలో ఉన్న కంటెంట్‌ను తొలగించేలా చూడాలని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఐఏఎస్ అధికారుల సంఘం కోరింది.
Also Read:
అపెక్స్ కౌన్సిల్‌కు నీటి పంపిణీ బాధ్యత!