Migraine Homeopathy Treatment: మైగ్రేన్ మతలబు
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:09 AM
భరించలేని తలనొప్పి మైగ్రేన్‌కు హోమియోలో సమర్థమైన చికిత్సలున్నాయి. తక్షణమే నొప్పిని తగ్గించడంతో పాటు, దీర్ఘకాలంలో మైగ్రేన్‌ను శాశ్వతంగా నివారించే హోమియో చికిత్సా...
హోమియో
భరించలేని తలనొప్పి మైగ్రేన్‌కు హోమియోలో సమర్థమైన చికిత్సలున్నాయి. తక్షణమే నొప్పిని తగ్గించడంతో పాటు, దీర్ఘకాలంలో మైగ్రేన్‌ను శాశ్వతంగా నివారించే హోమియో చికిత్సా విధానాల గురించి వైద్యుల ఇలా వివరిస్తున్నారు.
హోమియో వైద్యం... భౌతిక, మానసిక లక్షణాల ఆధారంగా చికిత్సను నిర్థారించే విధానాన్ని అనుసరిస్తుంది. మైగ్రేన్ సమస్య మొదలయ్యే ముందు, మొదలైన తర్వాత కనిపించే లక్షణాలతో పాటు ఈ నొప్పిని ప్రేరేపించే అంశాలు చికిత్సలో కీలకంగా మారతాయి. అలాగే ఎంత తరచూ ఈ సమస్య వేధిస్తోంది? అన్నది కూడా ముఖ్యమే! హోమియో చికిత్స వ్యక్తికీ వ్యక్తికీ మారుతూ ఉంటుంది. ఒకరికి ఫలితాన్నిచ్చిన ఔషథం వేరొకకరికి ఉపయోగపడకపోవచ్చు. కాబట్టి భౌతిక, మానసిక, సామాజిక అంశాలు, ఆహారపుటలవాట్లూ, దురలవాట్లూ, స్వభావం, మానసిక స్థితి.. ఇలా ప్రతి ఒక్కరి వ్యక్తిగత లక్షణాల ఆధారంగా మందులను, మోతాదునూ నిర్ణయించాల్సి ఉంటుంది.
పలు అంశాల ఆధారంగా...
తలనొప్పి ఏ సమయంలో మొదలవుతోంది? ఎంత కాలం నుంచి వేధిస్తోంది? నొప్పి ప్రేరకాలు? తలలో ఏ భాగంలో నొప్పి మొదలవుతోంది? తలనొప్పితో పాటు మొదలయ్యే ఇతరత్రా లక్షణాలు? తలనొప్పి తగ్గే తీరు? ఇలా పలు ప్రశ్నలకు సమాధానాలను రాబట్టడం ద్వారా వైద్యులు చికిత్సను నిర్థారిస్తారు. పార్శ్వపు నొప్పితో బాధపడే కొందరు ఎక్కువ వెలుగు, శబ్దాలను భరించలేకపోతూ ఉంటారు. ఇంకొందరు ఒత్తిడి, ఆందోళనలను తట్టుకోలేకపోతూ ఉంటారు. అలాగే తలనొప్పి మొదలైన తర్వాత ఉపశమనం కోసం కొందరు తలకు గట్టిగా వస్త్రాన్ని బిగించి కట్టుకుంటే, ఇంకొందరు నిద్రను ఆశ్రయిస్తారు. కొందరికి నీళ్లు తాగడం వల్ల, భోజనం తినడం వల్ల మైగ్రేన్ తగ్గుతుంది. కొందరికి మైగ్రేన్‌తో పాటు జీర్ణవ్యవస్థ సంబంధిత లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టే కొందర్లో వాంతులతో ఈ నొప్పి అదుపులోకొస్తూ ఉంటుంది.
చికిత్స ఇలా...
మైగ్రేన్ లక్షణాలనూ, నొప్పినీ తగ్గించడంతో పాటు, ఈ సమస్యను శాశ్వతంగా నివారించే చికిత్స హోమియోలో అందుబాటులో ఉంది. వాతావరణ మార్పులకు స్పందించే తీరు, ఆహారపుటలవాట్లూ, నచ్చే పదార్థాలు, నిద్ర వేళలు, భావోద్వేగాల ఆధారంగా సరైన, సమర్థమైన చికిత్సను వైద్యులు ఎంచుకుంటారు. చికిత్స మొదలుపెట్టిన కొన్ని రోజులకు సమస్య తీవ్రత తగ్గిపోవడం మొదలపెట్టి, క్రమేపీ మైగ్రేన్ అటాక్స్ మధ్య దూరం పెరుగుతూ, చివరకు ఈ సమస్య పూర్తిగా సమసిపోతుంది. అయితే చికిత్స ఫలితాన్నివ్వాలంటే వైద్యులు సూచించినంత కాలం, సూచించిన మోతాదుల్లో మందులు వాడుకోవాలి. ప్రారంభంలో నొప్పి తగ్గిపోగానే, పూర్తిగా నయమైపోయిందని మందులు ఆపేస్తే, సమస్య తిరగబెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో మెలగాలి.
సత్వర ఉపశమనం కోసం...
హోమియోలో తక్షణ ఉపశమనాన్ని అందించే మందులు ఉన్నాయి. మైగ్రేన్ నొప్పిని కూడా హోమియో మందులతో తగ్గించుకోవచ్చు. అయితే అవసరాన్ని బట్టి ఈ మందులు వాడుకుంటూ, సమస్య నివారణ కోసం వైద్యులు సూచించే ఇతర మందులను కూడా వాడుకుంటూ ఉండాలి. అత్యవసర మందును నొప్పి మొదలైన ప్రతి పావు గంటకూ, అరగంటకూ వాడుకోవాల్సి ఉంటుంది. మైగ్రేన్‌కు చాలా కారణాలుంటాయి. మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి, కుటుంబంలో ఒత్తిడి.. ఇలా పలు రకాల సమస్యలతో మైగ్రేన్ ప్రేరేపితమవుతున్నప్పుడు, ఈ ఒత్తిడిలను తగ్గించుకునే ప్రయత్నం కూడా చేయాలి. అందుకోసం ధ్యానం, యోగా, వ్యాయామాలను ఎంచుకోవాలి. అలాగే దురలవాట్లను మానుకుని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.

హోమియో మందులివే!
ఆర్సెనిక్ ఆల్బమ్: టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల పైత్యరసం పెరిగి, వాకారం, వాంతులతో పార్శ్వ్య నొప్పి వేధించే వారు ఈ మందు తీసుకోవచ్చు
యాంటిమోనియం క్రూడమ్: ఎడమ కన్నులో ఒక ప్రదేశంలో నొప్పి ఉంటుంది. మధ్యాహ్నం లేదా రాత్రుళ్లు మైగ్రేన్ వేధిస్తుంది
బెల్లడోనా: తలలో భారం, ఎండతో నొప్పి పెరగడం, నొప్పి ఆకస్మికంగా, తీవ్రంగా వేధించడం
బ్రయోనియా: తేమ, చల్లదనంతో నొప్పి మొదలవుతుంది. కదలికలతో పెరుగుతుంది. తల పగిలిపోతున్నంత నొప్పి వేధిస్తూ, తల అదిమిపెడితే ఉపశమనం కలగడం
కాక్యులస్ ఇండికస్: ప్రతి నెలసరిలో, నిద్రలేమితో తలనొప్పి మొదలవడం
జెల్సీమియం: తల వెనక నుంచి నుదుటి వైపు నొప్పి వ్యాపించడం, మూతి కండరాలు బిగదీసుకుపోవడం, మాట్లాడడం కష్టమవడం
గ్లోనైన్: ఎక్కువసమయం ఎండలో ఉన్నప్పుడు, మానసిక ఒత్తిడి తర్వాత నొప్పి వేధించడం, తల దిమ్ముగా ఉండడం
ఐరిస్ వి: మానసిక ఒత్తిడితో నొప్పి మొదలవడం, తల కుడివైపు నొప్పి, దృష్టి మసకబారడం, కడుపులో మంట, వికారం, వాంతోఓ ఉపశమనం కలగడం
లేకసిస్: ఎడమ కణత నుంచి భుజాలవరకూ నొప్పి వేధించడం, నెలసరికి ముందు నొప్పి ఇబ్బంది పెట్టడం, మెనోపాజ్‌లో పార్శ్వపు నొప్పి పెరగడం
నాట్రంమూర్: దృష్టి మసకబారడం, పాక్షిక అంధత్వం, విచారానికి లోననప్పుడు నొప్పి వేధించడం
ఫాస్ఫరస్: దీర్ఘకాలిక మైగ్రేన్, నొప్పి ఎడమ కంట్లోకి వ్యాపించడం, నుదుటి మంట, మాడు వేడిగా ఉండడం
స్పైజీలియా: ఎడమ కణతలో నొప్పి, కంటి నరాల బాధ, కళ్ల కదలికలతో నొప్పి తీవ్రమవడం, దీర్ఘకాలిక పార్శ్వపు నొప్పి
సాంగ్వినేరియా: కుడి కణతలో, కంటి నరాల్లో నొప్పి, ఎండతో నొప్పి పెరగడం, సాయంత్రానికి నొప్పి తగ్గడం
(ఈ హోమియో మందులు అవగాహనకే తప్ప శాశ్వత పరిష్కారం కోసం కాదు. శాశ్వత పరిష్కారం కోసం వైద్యులను సంప్రతించి, చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం)
డాక్టర్ దుర్గాప్రసాద్ రావు గన్నంరాజు
నిత్య హోమియోపతి,
కుత్బిగూడ (కాచిగూడ),
హైదరాబాద్.