Share News

Animal Husbandry: పెయ్యలే పుట్టాలి..!

ABN , Publish Date - Jan 13 , 2026 | 07:09 AM

మేలు జాతి పశుగణం వృద్ధి చెందాలి. ఇందుకోసం ఏడాదికో పెయ్య దూడ పుట్టాలి. పాల ఉత్పత్తి పెరగాలి. తద్వారా పశుపోషకుల ఆదాయం రెట్టింపు కావాలి...

Animal Husbandry: పెయ్యలే పుట్టాలి..!

  • పశుపోషకులు ఏడాదికో దూడ పొందటమే లక్ష్యం

  • రూ.150కే లింగ నిర్ధారిత వీర్య నాళికల పంపిణీ

  • 90శాతం కచ్చితత్వంతో పశుసంవర్ధక శాఖ చర్యలు

  • మేలు జాతి పెయ్యలతో పాల ఉత్పత్తి పెరుగుదల

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘మేలు జాతి పశుగణం వృద్ధి చెందాలి. ఇందుకోసం ఏడాదికో పెయ్య దూడ పుట్టాలి. పాల ఉత్పత్తి పెరగాలి. తద్వారా పశుపోషకుల ఆదాయం రెట్టింపు కావాలి...’ ఈ లక్ష్యంతో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ముందుకెళ్తోంది. ఈ క్రమంలో 90 శాతం కచ్చితత్వంతో మేలు రకం పెయ్య దూడలే పుట్టాలన్న సంకల్పంతో కృత్రిమ గర్భధారణ కేంద్రాల ద్వారా పశుసంవర్ధకశాఖ లింగ నిర్ధారణ వీర్య నాళికలను కేవలం రూ.150కే పంపిణీ చేస్తోంది. రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పశుసంపద, పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. రాష్ట్రంలో 9,326 కృత్రిమ గర్భధారణ కేంద్రాల ద్వారా ఇప్పటికే 2.32 లక్షల లింగ నిర్ధారణ వీర్య నాళికలను ఉపయోగించారు. మేలు జాతి ఆవులు, గేదెలకు ఈ లింగ నిర్ధారణ వీర్య నాళికలను అందిస్తున్నారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంలో భాగంగా 2030 నాటికి 30లక్షల లింగ నిర్ధారణ వీర్య నాళికలను రూ.30కోట్ల ఖర్చుతో 20లక్షల మంది పశువులకు పంపిణీ చేయాలని పశుసంవర్ధకశాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ విధానంలో ఇప్పటికే 21,577 పెయ్య దూడలు పుట్టినట్లు పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. పశుపోషకులు ఏడాదికో దూడ పొంది, ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి పశుసంవర్ధకశాఖ ఒక ప్రణాళిక రూపొందించింది. శాస్త్రీయ పశుపునరుత్పత్తి యాజమాన్యాన్ని పాటించాలి. ఈతకు.. ఈతకు మధ్య కాల వ్యవధిని 12-14 నెలలకు తగ్గించాలి. 36-40 నెలల వయస్సుకు మొదటి ఈత ఈనాలి. ఆరోగ్యవంతంగా ఎదిగిన పడ్డ, పెయ్య 24-30 నెలల్లో మొదటి ఎదకు రావాలి.


ఎదకు వచ్చిన 12-24 గంటల్లో కృత్రిమ గర్భధారణకు వీర్య నాళికను ఉపయోగించాలి. గర్భధారణ తర్వాత 21 రోజులకు ఎదకు రాకపోతే 60 రోజులకు చూడి పరీక్ష చేయించాలి. చూడి కడితే పాలు తగ్గుతాయనేది అపోహ మాత్రమే. అయితే చూడి చివరి రెండు నెలల్లో పాలు పితకడం ఆపాలి. చివరి మూడు నెలల్లో అదనపు దాణా అందించాలి. మళ్లీ ఎదకు వస్తే కృత్రిమ గర్భధారణ చేయించాలి. రెండు కన్నా ఎక్కువ సార్లు ఇలావస్తే గర్భకోశ వ్యాధుల పరీక్ష, చికిత్స చేయించాలని పశుపోషకులకు పశువైద్యులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఈనెల 19నుంచి 31వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నారు. ఎదకు రాని, చూడి కట్టని పశువులకు పరీక్షలు నిర్వహించి, సూచనలిస్తారు. గర్భకోశ వ్యాధులకు పరీక్షలు చేసి, తగిన వైద్యసేవలు అందించనున్నారు. ఎదలో ఉన్న పశువుల్ని గుర్తించి, కృత్రిమ గర్భధారణ సేవలు అందించి, పశుపోషణ, యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించనున్నా రు. పశు ఆరోగ్య సంరక్షణలో భాగంగా సామూ హికంగా వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేస్తారు.

Updated Date - Jan 13 , 2026 | 07:10 AM