ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక సమీక్ష
ABN , Publish Date - Aug 22 , 2026 | 04:12 PM
తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, మౌలిక వసతులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల డీసీహెచ్‌ఎస్‌లతో సమావేశమైన మంత్రి.. ఆసుపత్రుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
హైదరాబాద్, ఆగస్టు 22: ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక సమీక్షంచారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచడం, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవడంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. వెంగల్‌రావునగర్‌లోని IIHFWలో అన్ని జిల్లాల డీసీహెచ్‌ఎస్‌లతో మంత్రి సమావేశమయ్యారు. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, రోగులకు ఎదురవుతున్న ఇబ్బందులు, సిబ్బంది పనితీరు, ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికీ మెరుగైన వైద్యం అందేలా వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించినట్లు సమాచారం.
అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడం, అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడటం, వైద్య సేవల నాణ్యతను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. జిల్లాల వారీగా ఆసుపత్రుల పరిస్థితి, అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై మరింత నమ్మకం కలిగేలా ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల డీసీహెచ్‌ఎస్‌లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అనకాపల్లికి గోదావరి నీళ్లు.. సెప్టెంబర్ నాటికి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
దారుణం.. భార్యను చంపి గోదావరి నదిలో పడేసి.. ఆపై
Read Latest AP News And Telugu News