Share News

2019లో మాకు రైతుబంధు ఇవ్వలే

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:59 AM

గత ప్రభుత్వ హయాంలో 2019 ఏడాదికి సంబంధించి తమకు రైతుబంధు అందలేదని ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందిన రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

2019లో మాకు రైతుబంధు ఇవ్వలే
Supreme Court

  • సుప్రీంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండల రైతుల పిటిషన్‌

  • 4 వారాల్లో సమాధానమివ్వండి

  • తెలంగాణ సర్కారుకు నోటీసులు

న్యూఢిల్లీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో 2019 ఏడాదికి సంబంధించి తమకు రైతుబంధు అందలేదని ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందిన రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. తమకు న్యాయబద్థంగా దక్కాల్సిన మొత్తాన్ని విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. మండల పరిధిలోని తల్లాడ, తెలగారం గ్రామాలకు చెందిన పట్టాదారులైన తూము వెంకట నారాయణ, తూము విజయ్‌కుమార్‌, తూము జ్యోతి, తూము షర్మిల, తూము చంద్రిక తమకు 2018 నుండి 2023 వరకు అన్ని సీజన్లలో రైతుబంధు అందిందని, 2019లో ఖరీఫ్‌, యాసంగి సీజన్లకు పెట్టుబడి సాయం అందలేదని గతంలో కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన అధికారులు 2019 బకాయిల చెల్లింపు ప్రతిపాదనను వ్యవసాయశాఖ కమిషనర్‌కు పంపామని తొలుత సమాధానమిచ్చారు. అయితే, 06.12.2022న ప్రతికూల లేఖ జారీ చేశారు.కొవిడ్‌-19 కారణంగా ఆ సీజన్‌లో పెట్టుబడి సాయం కోసం చిన్న, సన్నకారు రైతులకే ప్రాధాన్యమిచ్చామని, ఫలితంగా ఎక్కువ భూమి ఉన్న రైతులకు సాయం అందించలేకపోయామని వాదనలు వినిపించారు. అయితే ఒకసారి చెల్లింపులకు ప్రతిపాదనలు పంపి ఆ తర్వాత పెద్ద రైతులనే కారణంతో నిరాకరించడం సరికాదని జస్టిస్‌ శరత్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 06.12.2022 నాటి లేఖను పక్కన పెడుతూ, ఉత్తర్వు అందిన ఎనిమిది వారాల్లోగా 2019 ఖరీఫ్‌, యాసంగి సీజన్ల తాలూకు రైతుబంధు మొత్తాన్ని పిటిషనర్లకు చెల్లించాలంటూ కోర్టు 2024 సెప్టెంబరు 27న ఆదేశించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేసింది. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ గురువారం జస్టిస్‌ పామిడిఘంటం శ్రీ నరసింహా నేతృత్వంలోని జస్టిస్‌ అలోక్‌ అరధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకొచ్చింది.


ఈ సందర్భంగా రైతుబంధు పథకం కింద తమకు రావాల్సిన నిధులను నిలిపివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి లిఖితపూర్వక విధానం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ రైతుబంధు నిధులిచ్చారని, తమ విషయంలోనే వివక్ష చూపారని ఆరోపించారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల సమయంలో 54 ఎకరాలున్న ఓ రైతుకు కూడా రైతుబంధు నిధులు మంజూరు చేశారని, తమకు మాత్రం ఇవ్వలేదని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం కొవిడ్‌ పరిస్థితులను ప్రస్తావించింది. కేవలం రూ.7 లక్షల మొత్తం కోసం ఈ స్థాయిలో న్యాయపోరాటం చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తాము చట్టబద్థంగా ఈ మొత్తానికి అర్హులమని మొదటి నుంచీ తమ హక్కు కోసమే న్యాయపోరాటం చేస్తున్నామని పిటిషనర్ల తరఫున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా ట్రెజరీ అధికారికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను 2027 జనవరి 4కు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి..

ఈ నెల 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. తెరపైకి పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లులు?

రాహుల్ గాంధీ ఫొటో పెడితే బ్లాక్ చేస్తున్నారు.. మెటాపై కోర్టుకెక్కిన కాంగ్రెస్

Updated Date - Nov 27 , 2026 | 02:01 AM