సగం వాటా నీళ్లు ఇవ్వాల్సిందే
ABN , Publish Date - Aug 25 , 2026 | 06:43 AM
ఉమ్మడి జలాశయాల్లోని కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కావాలని తెలంగాణ స్పష్టం చేసింది. వాస్తవానికి తమకు 70 శాతం జలాలు కేటాయించాలని, ఏపీకి 30 శాతమే ఇవ్వాలని.. అయితే ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున 50 శాతం తీసుకోవడానికి అంగీకరిస్తున్నట్లు తెలిపింది
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో తెలంగాణ డిమాండ్
అసలైతే 70శాతం కావాలి.. ఎల్‌నినో వల్ల 50 శాతానికి అంగీకరిస్తున్నాం
ఏపీకి 47 టీఎంసీలు కేటాయిస్తే మాకూ అంతే ఇవ్వాలి
ఉమ్మడి జలాశయాల పరిధిలో తెలంగాణలో 2 కోట్ల మంది నివాసం
ఏపీలో 76 లక్షల మందే.. అయినా 47 టీఎంసీలు ఎందుకని ప్రశ్న
రిజర్వాయర్లు లేనందువల్ల.. సాగర్‌లో నీటిని నిల్వ చేస్తామని వెల్లడి
సాగునీరు ఇవ్వలేం.. వచ్చే ఏడాది మే వరకూ తాగునీటి అవసరాలకే
జలాలు: బోర్డు స్పష్టీకరణ.. సెప్టెంబరు 4న తదుపరి సమావేశం
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో తెలంగాణ డిమాండ్
రిజర్వాయర్లు లేనందువల్ల..
సాగర్‌లో నీటిని నిల్వ చేస్తామని వెల్లడి
వచ్చే మే దాకా తాగునీటికే జలాలు: బోర్డు
సెప్టెంబరు 4న తదుపరి సమావేశం
హైదరాబాద్: ఉమ్మడి జలాశయాల్లోని కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కావాలని తెలంగాణ స్పష్టం చేసింది. వాస్తవానికి తమకు 70 శాతం జలాలు కేటాయించాలని, ఏపీకి 30 శాతమే ఇవ్వాలని.. అయితే ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున 50 శాతం తీసుకోవడానికి అంగీకరిస్తున్నట్లు తెలిపింది. 3-4 నెలల అవసరాలకు నీటి లెక్కలు వేయబోమని.. ఏడాదికి అవసరమయ్యే 112 టీఎంసీలను తమకు కేటాయించాలని డిమాండ్ చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో కనీస నీటిమట్టం(ఎండీడీఎల్)పైన ఉన్న నీటి నిల్వలను పంచుకోవటం కోసం సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. కమిటీ కన్వీనర్ సతీష్ కంబోజ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ ఈఎన్‌సీ వీ రమే్‌షబాబు. ఏపీ ఈఎన్‌సీ నర్సింహమూర్తి హాజరయ్యారు. అక్టోబరు దాకా తమ తాగునీటి అవసరాలకు 47 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. తొలుత 70 శాతం జలాలను కోరిన తెలంగాణ.. ప్రస్తుత పరిస్థితుల్లో 50 శాతానికి అంగీకరిస్తున్నామని, ఈ నేపథ్యంలో తమకు కూడా 47 టీఎంసీలు కేటాయించాలని పేర్కొంది.
తమకు కేటాయించిన జలాలను ‘డిమార్కేషన్’ చేసి జలాశయాల్లో నిల్వ చేయాలని బోర్డును కోరింది. రిజర్వాయర్లు లేకుండా ఏ విధంగా నీటిని తీసుకుంటారని ఏపీ ఈఎన్‌సీ ప్రశ్నించగా.. నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకొని, అవసరమైనప్పుడు వాడుకుంటామని తెలంగాణ ఈఎన్‌సీ బదులిచ్చారు. తెలంగాణలో ఉమ్మడి జలాశయాల పరిధిలో నివసిస్తున్న 2 కోట్ల జనాభా కోసం 47 టీఎంసీల నీటిని కోరుతున్నామని.. ఏపీలో ఈ జలాశయాల పరిధిలో 76 లక్షల జనాభా మాత్రమే నివసిస్తోందని, అయినప్పటికీ, 47 టీఎంసీల నీటిని ఎందుకు కోరుతున్నారని తెలంగాణ ఈఎన్‌సీ అభ్యంతరం వ్యక్తం చేశారు. బచావత్ ట్రైబ్యునల్ గంపగుత్తగా కేటాయింపులు చేసిందనే కారణంతో ఇతర బేసిన్‌లకు నీటిని తరలిస్తే, కృష్ణా బేసిన్ పరిధిలో నివసించే ప్రజల తాగునీటి అవసరాలకు ఇబ్బందులు వస్తాయన్నారు. నీటిని ఏడాది అవసరాలకు సరిపడా పంచాలని, 6 నెలల కోసం వద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లోలు లేవని, అవి వచ్చిన తర్వాతే నీటి కేటాయింపులపై చర్చిద్దామని ఏపీ ఈఎన్‌సీ ప్రతిపాదించగా... సమగ్ర వివరాలతో ఇండెంట్ పెడతామని తెలంగాణ ఈఎన్‌సీ తెలిపారు. తదుపరి భేటీని వచ్చే నెల 4వ తేదీన నిర్వహించాలని కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం.. ఎగువన భారీ వర్షాలు లేనందున శ్రీశైలం. నాగార్జునసాగర్ డ్యాంలలోకి ఈ ఏడాది భారీ ప్రవాహాలు రాలేదని.. ఖరీఫ్ పంటలకు సాగునీరివ్వలేమని బోర్డు ముందే తేల్చిచెప్పింది. అందుబాటులో ఉన్న జలాలను 2027 మే నెల వరకూ తాగునీటి అవసరాలకు మాత్రమే కేటాయిస్తామని స్పష్టం చేసింది. ఇందుకు రెండు రాష్ట్రాలూ అంగీకరించాయి.
50:50 నిష్పత్తితో పంచాలని కోరాం: ఈఎన్‌సీ
సమావేశం అనంతరం తెలంగాణ ఈఎన్‌సీ రమేష్‌బాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జలాశయాల్లో ఉన్న నిల్వలను తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని కమిటీ నిర్ణయించిందని చెప్పారు. ‘పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ భారీగా నీటిని తరలిస్తుందని ఫిర్యాదు చేశాం. తెలంగాణలో కృష్ణా బేసిన్ వెంట 2కోట్ల మంది నివసిస్తున్నారు. ఆ మేరకు తాగునీటి అవసరాలు తీరాలంటే ఉమ్మడి జలాశయాల్లోని నీటిని 50:50 నిష్పత్తితో పంచాలని కోరాం’ అని తెలిపారు. ఏపీ ఈఎన్‌సీ నర్సింహమూర్తి మాట్లాడుతూ.. ‘2015లో కుదిరిన వర్కింగ్ అరేంజ్‌మెంట్‌లో భాగంగా.. మొత్తం 811 టీఎంసీల్లో ఏపీకి 512 టీఎంసీలను పంచారు. మేం 47టీఎంసీల నీటిని కేటాయించాలని కోరగా... తెలంగాణ కూడా అంతే కావాలని పట్టుబట్టింది. అక్టోబరు 31దాకా వినియోగం మేరకు నీటిని కేటాయించాలని ప్రతిపాదించాం’ అని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు
రాహుల్ జీ.. దమ్ముంటే తెలంగాణకు రండి