Share News

ఒలింపిక్స్‌ లక్ష్యంగా పోటీపడాలి

ABN , Publish Date - Aug 25 , 2026 | 05:59 AM

అమరావతి చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల్లో రాబోయే కాలంలో 10 నుంచి 20 శాతం మంది ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే స్ఫూర్తితో ఆడాలని..

ఒలింపిక్స్‌ లక్ష్యంగా పోటీపడాలి

  • ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్లు కల్పించాం: హోం మంత్రి అనిత

  • తిరుపతిలో ఘనంగా అమరావతి చాంపియన్‌షి్‌ప ప్రారంభం

తిరుపతి(టీటీడీ), ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): అమరావతి చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల్లో రాబోయే కాలంలో 10 నుంచి 20 శాతం మంది ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే స్ఫూర్తితో ఆడాలని హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. అమరావతి చాంపియన్‌షి్‌ప రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను సోమవారం ఉదయం తిరుపతిలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటలు మరుగునపడుతున్న సమయంలో క్రీడాకారుల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలను ఏకం చేసి చాంపియన్‌షి్‌పను ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. క్రీడా కోటాలో ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్లు కల్పించామని మంత్రి వివరించారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మాట్లాడుతూ.. క్రీడలతో విద్య, విద్యతో ఉద్యోగం అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. చంద్రబాబు అమరావతి అనే పేరును ప్రపంచవ్యాప్తంగా నలుదిశలా తీసుకువెళ్తున్నారని ,అందువల్లనే ఈ పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. అమరావతి చాంపియన్‌ షిప్‌ను రెండు విభాగాలుగా ఏర్పాటు చేశామని, నిజమైన క్రీడాకారులను ప్రోత్సహించాలని ఈ నిర్ణయం తీసుకున్నామని శాప్‌ చైర్మన్‌ రవినాయుడు చెప్పారు. 9911 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పోటీపడుతున్నారని తెలిపారు.

ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

అమరావతి చాంపియన్‌షి్‌ప కార్యక్రమం నూతన రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఈ రికార్డును ప్రతినిధి హరీశ్‌ క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డికి, శాప్‌ చైర్మన్‌ రవినాయుడికి అందజేశారు.

Updated Date - Aug 25 , 2026 | 06:00 AM