Share News

అన్నదాతకు అండగా ప్రభుత్వం.. చివరి గింజ వరకూ కొంటాం: మంత్రి ఉత్తమ్

ABN , Publish Date - Jun 01 , 2026 | 03:53 PM

దేశవ్యాప్తంగా వరి ధాన్యం సాగులో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించి, ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

అన్నదాతకు అండగా ప్రభుత్వం.. చివరి గింజ వరకూ కొంటాం: మంత్రి ఉత్తమ్
Telangana Paddy Production,

సూర్యాపేట, జూన్ 01: వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, ధాన్యం కొనుగోళ్ల ప్రగతిని వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా.. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా ఇప్పటివరకు సుమారు 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విజయవంతంగా సేకరించామని మంత్రి తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని సైతం రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో, ప్రభుత్వం మద్దతు ధరకే (MSP) కొనుగోలు చేసిందని ఆయన స్పష్టం చేశారు. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.


యాసంగిలో మొత్తం భారతదేశం నుంచి కేంద్రానికి అందిన ధాన్యంలో 63 శాతం వాటా ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే వెళ్లడం మన రైతుల కష్టానికి, ప్రభుత్వ సహకారానికి నిదర్శనమని మంత్రి ఉత్తమ్ కొనియాడారు. అలాగే, గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం అమ్మిన రైతులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా, కేవలం 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, రాబోయే జూన్ 4వ తేదీ లోపు కొనుగోళ్లన్నింటినీ పూర్తిగా ముగించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

పింఛన్లను రూ.4వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ..

పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: ఎమ్మెల్యే వసంత

Updated Date - Jun 01 , 2026 | 05:50 PM