Share News

డిసెంబరులో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ!

ABN , Publish Date - Nov 27 , 2026 | 04:43 AM

రాష్ట్రంలోని నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అంశంలో మళ్లీ కదలిక వచ్చింది.

డిసెంబరులో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ!
congress logo

  • పార్టీ పదవులు కూడా..

  • సీఎం, టీపీసీసీ చీఫ్‌తో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సందీప్‌ వేర్వేరుగా భేటీ

హైదరాబాద్‌, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అంశంలో మళ్లీ కదలిక వచ్చింది. నామినేటెడ్‌ పోస్టులతోపాటు పార్టీ పదవులను డిసెంబరులో భర్తీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సందీప్ కుమార్, టీపీసీసీ చీఫ్‌ మహేశ్ గౌడ్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సందీప్‌ కుమార్‌ సీఎం రేవంత్‌ రెడ్డి, మహేశ్‌ గౌడ్‌లతో గురువారం వేర్వేరుగా ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో ఆయా పదవుల భర్తీపై నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి ముందు ప్రజాభవన్‌లోని గెస్ట్‌హౌస్ లో సందీప్ కుమార్ ను సీఎం రేవంత్‌ గురువారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, కేంద్రంలో, రాష్ట్రంలో పార్టీని అధికారంలో తేవడానికి సంబంధించి వ్యూహాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అన్ని వర్గాలకు గుర్తు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం రేవంత్‌ సూచించనట్టు తెలిసింది. ఈ విషయంలో పార్టీ యంత్రాంగం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు సమాచారం.


ఈ సందర్భంగానే పార్టీలో పెండింగ్‌లో ఉన్న కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార.. ఇతర కమిటీలు, కార్యదర్శులు తదితర పదవుల నియామకాలు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అంశం చర్చకు వచ్చిందని పార్టీ శ్రేణులు తెలిపాయి. నామినేటెడ్‌ పోస్టులు, పార్టీ పదవుల భర్తీకి సంబంధించి పూర్తి స్థాయిలో నాయకులను సంతృప్తి పరచడం సాధ్యమయ్యేది కాదన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా కసరత్తు పూర్తి చేసి డిసెంబరులో నియామకాలు చేపట్టాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇక, రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ ముగిసిన తర్వాత.. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌తో సందీప్‌ కుమార్‌ భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు సాగిన ఈ భేటీలో కూడడా నామినేటెడ్‌ పదవులు, పార్టీ పదవుల భర్తీపైనా చర్చించినట్లు సమాచారం. కాగా.. డిసెంబరు 15 తర్వాత సందీప్ కుమార్ .. జిల్లా పర్యటనలకు వెళ్లాలని నిర్ణయించారు. స్థానిక డీసీసీలు, ముఖ్యనాయకులతో భేటీలు నిర్వహించి వారిని ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం చేయనున్నట్లు చెబుతున్నారు

ఇవి కూడా చదవండి..

ఈ నెల 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. తెరపైకి పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లులు?

రాహుల్ గాంధీ ఫొటో పెడితే బ్లాక్ చేస్తున్నారు.. మెటాపై కోర్టుకెక్కిన కాంగ్రెస్

Updated Date - Nov 27 , 2026 | 04:44 AM