ప్రతి జిల్లాకూ రింగు రోడ్డు
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:20 AM
రాష్ట్రంలోని ప్రతీ ప్రధాన జిల్లా కేంద్రానికి ఒక రింగు రోడ్డు నిర్మాణం, వాటిని దగ్గర్లోని హైవేలకు అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
వాటిని హైవేలకు అనుసంధానించాలి.. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయండి
ప్రభుత్వ శాఖలు ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కొనుగోలు చేయాలి
రోడ్ సెక్టార్ పాలసీ-2047కు అనుగుణంగా రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి: సీఎం
హైదరాబాద్, మార్చి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతీ ప్రధాన జిల్లా కేంద్రానికి ఒక రింగు రోడ్డు నిర్మాణం, వాటిని దగ్గర్లోని హైవేలకు అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి, పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. భారీ వాహనాలు జిల్లా కేంద్రాల్లోకి వెళ్లకుండా చూడడంతో పాటు సరుకు రవాణా వాహనాలు వేగంగా గమ్యం చేరేందుకు రింగు రోడ్లు ఉపయోగపడతాయని చెప్పారు. బుధవారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సీఎం రేవంత్ ఆ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలకు సమీపంలో రోడ్లు ఉంటే వాటిని అనుసంధానించి రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఆయా జిల్లా కేంద్రాల నుంచి రింగు రోడ్లకు అనుసంధానించేలా రేడియల్ రోడ్లు నిర్మించాలన్నారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం రూపొందించిన ‘రోడ్ సెక్టార్ పాలసీ-2047’కి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్-విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే నుంచి నాగార్జున సాగర్ చేరేందుకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలకు నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్‌ను ‘ట్రాఫిక్ ఫ్రీ సిటీ’గా మార్చేందుకు కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని, కొత్తవాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా బోధనాస్పత్రులు, పెద్ద ఆస్పత్రుల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కాలుష్య రహిత రవాణాయే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఇకపై ప్రభుత్వంలోని ఏ శాఖైనా తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలనే కొనాలని స్పష్టం చేశారు. ‘క్యూర్’ పరిధిలో ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకునే వాహనాలు సైతం ఈవీలే ఉండాలన్నారు. రవాణా శాఖలో మాన్యువల్ పద్ధతులకు స్వస్తి చెప్పాలని, కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌లోనే జరగాలని ఆదేశించారు.
భూములకు బాండ్లు.. పెట్రోల్ సెస్సులో వాటా! రోడ్లకు నిధుల కోసం ప్రభుత్వం యోచన
రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను లోతుగా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా నిధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు ఆర్ అండ్ బీ శాఖకు అనుబంధంగా ఉన్న రోడ్ల అభివృద్ధి సంస్థ (ఆర్‌డీసీ)ను బలోపేతం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఆర్ అండ్ బీ పరిధిలోని భూముల ద్వారా బాండ్ల రూపంలో నిధులు సేకరించి, వాటిని రోడ్ల అభివృద్ధికి వెచ్చించాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఇంధనం విక్రయాల ద్వారా వస్తున్న సెస్సులో 2 శాతాన్ని ఆర్‌డీసీకి బదిలీ చేయాలనే ఆలోచన చేస్తోంది. దీని ద్వారా ఆర్‌డీసీకి నెలకు సుమారు రూ.400 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంటుందనే అంచనాలున్నాయి. విజన్-2047 డాక్యుమెంట్‌లోని ‘రోడ్ సెక్టార్ పాలసీ’ అమలుకు ఆర్ అండ్ బీ నియమించిన కన్సల్టెన్సీ ప్రాథమిక నివేదిక సమర్పించింది. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో నివేదికలోని అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఆర్ అండ్ బీ భూములను ఆర్‌డీసీకి బదలాయించి, వాటిని తనఖాపెట్టడం/బాండ్లు సేకరించడం ద్వారా నిధులు సమకూర్చి రోడ్ల నిర్మాణానికి వెచ్చించనున్నారు. ప్రస్తుతం ఆ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా కలిపి దాదాపు 400 ఎకరాల వరకు భూములు ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో తేలింది. వీటిలో హైదరాబాద్ పరిధిలో 128 ఎకరాలు, నిజమాబాద్‌లో రైల్వే స్టేషన్ పక్కన 10 ఎకరాలు, వరంగల్‌లో 14 ఎకరాలు సహా ఇతర జిల్లాల్లోనూ కొంతమేర భూములు ఉన్నాయి. వాటిని కార్పొరేషన్‌కు బదలాయించనున్నారు.