కేటీఆర్ అసలు మనిషేనా!?
ABN , Publish Date - May 22 , 2026 | 04:35 AM
కేటీఆర్ అసలు మనిషేనా!? రాజకీయాన్ని, సమస్యను వేరుగా చూడాలి. రాజకీయంగా నాతో కొట్లాడాలి. కానీ, మైనర్ బాలికను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడమేంటి!? బాలికను అడ్డం పెట్టుకుని ఏదో చేయాలనే శాడిజం ఏంటి.....
కేటీఆర్‌ది ముమ్మాటికీ శాడిజమే
బాలికను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారా!?
బండి సంజయ్‌కు, కేటీఆర్‌కు మధ్యన ఏదో పంచాయితీ ఉన్నట్లుంది
కేటీఆర్ జడ్జిగా.. ప్రవీణ్‌కుమార్ దర్యాప్తు అధికారిగా శిక్షలు కూడా వేసేశారు
డ్రగ్స్‌తో దొరికిన బావమరిది, పార్టీ మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడలేదేం!?
బీఆర్‌ఎస్ వాళ్లు మనుషులేనా? రైతు మృతదేహం దగ్గర నవ్వుతూ సెల్ఫీలా!?
బీఆర్‌ఎస్ అనుకూల మిల్లర్లు, నేతలు ధాన్యం లారీ లోడ్ దించనీయడం లేదు
బీఆర్‌ఎస్‌ది ఆర్గనైజ్డ్ క్రైం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపాటు
అమ్మాయి దుస్తుల గురించేనా.. అబ్బాయిల పెంపకాన్ని ప్రశ్నించరా?: మీనాక్షి
హైదరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): ‘‘కేటీఆర్ అసలు మనిషేనా!? రాజకీయాన్ని, సమస్యను వేరుగా చూడాలి. రాజకీయంగా నాతో కొట్లాడాలి. కానీ, మైనర్ బాలికను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడమేంటి!? బాలికను అడ్డం పెట్టుకుని ఏదో చేయాలనే శాడిజం ఏంటి!? ఇది ముమ్మాటికీ శాడిజమే’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మనిషికి ఉండాల్సిన కనీస విలువలు గానీ, మానవత్వం గానీ బీఆర్‌ఎస్‌కు, ఆ పార్టీ నాయకులకు లేవని, వాళ్లు అసలు మనుషులుగా కూడా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. వరి వేస్తే ఉరి అని చెప్పినవాళ్లు ఇప్పుడు సిగ్గు లేకుండా రైతుల కల్లాల దగ్గరకు వెళ్తున్నారని, పైగా మరణించిన రైతు దగ్గర నవ్వుకుంటూ సెల్ఫీలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. వాళ్ల దగ్గర దొంగ సొమ్ము చాలా ఉందని, రైతు కుటుంబానికి ఎంతో కొంత సాయం చేయవచ్చని, అయినా చేయడం లేదని తప్పుబట్టారు. సాయం చేయకపోగా ఈ శవ రాజకీయాలు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వివేక్‌తో కలిసి గురువారం సచివాలయంలో ఆయన విలే కరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఇటీవల రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన మైనర్ బాలిక పోక్సో కేసు విషయం గురించి సీఎం రేవంత్‌ను విలేకరులు అడగ్గా.. దానిపై ఆయన స్పందించారు. ‘‘మైనర్ బాలిక వ్యవహారంలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది చాలా సున్నితమైన అంశం. దానిని కూడా రాజకీయం చేస్తున్నారు. బండి సంజయ్‌కు, కేటీఆర్‌కు మధ్యన ఏదో పంచాయితీ ఉన్నట్టుంది. దానిని పిల్లల మీద పెట్టి కేటీఆర్ రాజకీయం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో వారే ఆలోచించుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు. బండి భగీరథ్‌ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారని, తాను దానినే నమ్ముతున్నానని తెలిపారు. పోలీసులను ఇంటికి పిలిచి అప్పగిస్తే దాన్ని సరెండర్ అంటారని, అప్పా జంక్షన్ దగ్గర నాకాబందీ నిర్వహి స్తున్న సమయంలో భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తనకు చెప్పారని తెలిపారు. అరెస్టు చేశామని పోలీసులు చెబుతుంటే, సరెండర్ చేశామని సంజయ్ అంటున్నారని, అప్పా జంక్షన్ ఎవరి ఇల్లు అని ప్రశ్నించారు. భగీరథ్‌పై పోక్సో కేసు విషయంలో ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుందని, కానీ, కేటీఆర్ జడ్జిగా, ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ దర్యాప్తు అధికారిగా (ఐ.వో)గా వ్యవహరించి వాళ్లే శిక్షలు కూడా వేశారని తప్పుబట్టారు. ‘‘ఈ కేసు చాలా సున్నితమైనది.
ఎవరి పేర్లు చెప్పడానికి వీల్లేదు. బీఆర్‌ఎస్ నేతలు మాత్రం సదరు మైనర్ బాలికను రోడ్లపైకి తీసుకొస్తున్నారు. దాంతో, ఆ అమ్మాయి కుటుంబం ఆవేదన చెందుతోంది’’ అని బండి సంజయ్ కొడుకు విషయంలో ఇంతస్థాయిలో మాట్లాడిన కేటీఆర్.. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుని దొరికిన తన బావ మరిది విషయంలో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ‘‘దీపావళి పండుగ చేసుకుంటుంటే ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నిస్తూ, ఎదురు తిరిగారు. వాళ్ల పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ కోడి పందేల్లో దొరికాడు. ఆర్థిక లావాదేవీలతో దుబాయ్‌లో చనిపోయిన తన మిత్రుడి గురించి కానీ, ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌తో దొరికి పోలీసులపై కాల్పులు జరిపిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గురించి కానీ ఎందుకు మాట్లాడడం లేదు!? పార్టీ మాజీ ఎమ్మెల్యేకి కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఇంతకంటే సిగ్గు తప్పిన వ్యక్తులు ఉంటారా!? డ్రగ్స్‌తో దొరికి, పోలీసులపై కాల్పులు జరిపిన వ్యక్తి జాతిరత్నంలాగా కనిపిస్తున్నారని, ఇతరుల పిల్లలపై చట్టపరంగా చర్యలు తీసుకున్నా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్‌లో డ్రగ్స్‌తో దొరికిన కేటీఆర్ బావమరిదికి ఎలా అయితే నోటీసు ఇచ్చామో, బండి భగీరథ్‌కు కూడా అదేవిధంగా నోటీసు ఇచ్చామని తెలిపారు. ‘‘అమ్మాయి మేజర్ అని భగీరథ్ కరీంనగర్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో, అమ్మాయి వయసు ఎంత, మేజరా, మైనరా అని నిర్ధారించాల్సి వచ్చింది. అందుకోసం ఆస్పత్రికి, పాఠశాలకు వెళ్లడంతోపాటు ఆధార్ కార్డు పరిశీలించి, పదో తరగతి పత్రాలు చూసి.. అమ్మాయి మైనర్ అని నిర్ధారించాం. దాని ప్రకారమే చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. కేటీఆర్ కోర్టులో ఆయన జడ్జిగా, ప్రవీణ్‌కుమార్ ఐవోగా చెబితే సరిపోతుందా!?’’ అని మండిపడ్డారు. ప్రవీణ్‌కుమార్ ఇప్పుడు తీసేసిన తహశీల్దార్ అని, ఆయన ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు. ‘‘మైనర్ బాలిక విషయంలో రాష్ట్రంలో ఇంత చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎందుకు బయటకు రాలేదు!? ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని పార్టీలోకి చేర్చుకునేందుకు జగిత్యాల వరకు వెళ్లిన వ్యక్తి.. కేటీఆర్ చెబుతున్నదే నిజమైతే బాలిక విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు!?’’ అని ప్రశ్నించారు. ఇంకా కల్వకుంట్ల రాజ్యాంగంలోనే ఉన్నానని కేటీఆర్ అనుకుంటున్నారని, వాళ్ల నాన్న దిగిపోయి చాలాకాలం అయిందంటూ కేటీఆర్‌కు చురకలు అంటించారు.
మళ్లీ ఇదో కొత్త దరిద్రం..!
విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎ్‌సను ఉద్దేశించి కొన్సిసార్లు టీఆర్‌ఎస్ అని, మరికొన్నిసార్లు బీఆర్‌ఎస్ అని వ్యాఖ్యానించారు. ఆ సందర్భంగానే.. ‘‘టీఆర్‌ఎస్ అంటే ఇప్పుడు మళ్లీ కొత్త వాళ్లు వస్తారేమో. కొత్త సమస్య వచ్చిపడింది. ఇదొక కొత్త దరిద్రం మళ్లీ’’ అని వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్‌ది ఆర్గనైజ్డ్ క్రైమ్
రాష్ట్రంలో వరి కొనుగోలు ఇంకో 20 శాతమే ఉందని, దానిని కూడా సేకరిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. తమ ప్రభుత్వం ఇప్పుడు కొనుగోలు చేసిన స్థాయిలో గడిచిన పదే ళ్లలో ఎప్పుడూ బీఆర్‌ఎస్ ధాన్యం కొనుగోలు చేయలేదని తప్పుబట్టారు. ‘‘ధాన్యం కొనుగోలు పూర్తయ్యాక 72 గంటల్లోనే నిధులు రైతులకు అందిస్తున్నాం. బీఆర్‌ఎస్ హయాంలో 6-7 నెలలు పట్టేది. ధాన్యం లోడ్‌తో వెళ్లిన లారీల నుంచి దిగుమతి కాకుండా బీఆర్‌ఎస్ అనుకూల మిల్లర్లు వ్యవహరిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతలు వెళ్లి ధాన్యాన్ని దించనీయడం లేదు. బీఆర్‌ఎస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తోంది’’ అని మండిపడ్డారు. జనగణనలో కులగణన చేసిన రాష్ట్రంగా.. దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలబడిందని, ఇది రాష్ట్రానికి దక్కిన గౌరవమని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా జనగణనలో కులగణన చేయాల్సిందేనని చెప్పిందని, జనగణనలో కులగణనను చేర్చి దేశంలో ఏ జనాభా ఎంత ఉన్నారనే లెక్కలు తేల్చి వారి సంక్షేమం, ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధిలో వారికి సముచిత స్థానాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నా మని డిమాండ్ చేశారు.