దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి.. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్‌తో భేటీ
ABN , Publish Date - Jan 21 , 2026 | 08:00 PM
దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్ విజన్–2047, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక అభివృద్ధి, యువత నైపుణ్యాల అభివృద్ధి, క్రీడా మౌలిక సదుపాయాలు సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఇంటర్నెట్ డెస్క్: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, పెట్టుబడుల అవకాశాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణంపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’, ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను టాటా చైర్మన్‌కు వివరించారు. తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోందని తెలిపారు. రాష్ట్రం పెట్టుబడుల కోసమే కాకుండా, తన విధానాలు, ఫ్యూచర్ విజన్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని సీఎం వివరించగా, తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చంద్రశేఖరన్ ప్రశంసించారు.
హైదరాబాద్‌లోని ప్రధాన క్రీడా మైదానాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే ఆలోచనలను టాటా చైర్మన్‌తో సీఎం పంచుకున్నారు. ఈ క్రమంలో స్పోర్ట్స్ స్టేడియంల అభివృద్ధిలో ప్రభుత్వంతో కలిసి భాగస్వామిగా పనిచేయడానికి టాటా గ్రూప్ సిద్ధంగా ఉందని చంద్రశేఖరన్ తెలిపారు. దేశంలో ప్రతిభకు కొదవ లేదని, కానీ అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్‌తో కలిసి పనిచేస్తున్నామని సీఎం వెల్లడించారు. అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ సెంటర్లుగా అభివృద్ధి చేసే ప్రణాళికలను వివరించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, 2036 ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకుని క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యాలను సీఎం వివరించారు.
హైదరాబాద్‌లో అమలు చేస్తున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై టాటా చైర్మన్ ఆసక్తి చూపారు. రాజస్థాన్, మహారాష్ట్రల్లో నీటి వనరుల పునరుద్ధరణలో టాటా గ్రూప్‌నకు ఉన్న అనుభవాన్ని గుర్తు చేస్తూ, మూసీ అభివృద్ధిలో భాగస్వామిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మూసీ నది చుట్టూ ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చెప్పారు.
అదే విధంగా రాష్ట్రంలో హోటళ్లు, రిసార్టుల ఏర్పాటు అంశంపై కూడా చర్చ జరిపారు. మేడారం, వేములవాడ, భద్రాచలం వంటి ఆలయ ప్రాంతాల్లో హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేసింది. అలాగే శ్రీశైలం రహదారి వెంబడి అంతర్జాతీయ స్థాయి రిసార్ట్ ఏర్పాటు ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించింది. ఏఐ డేటా సెంటర్లు, సెమీకండక్టర్, ఈవీ తయారీ రంగాల్లో తెలంగాణలో కొత్త పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలపై కూడా చంద్రశేఖరన్ ఆసక్తి చూపారు. ఈ సమావేశంలో మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అలాగే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read:
తెలంగాణకు 1,000 కోట్ల పెట్టుబడులు.. దావోస్‌లో సర్కార్ కీలక ఒప్పందం
ప్రేమజంటను కారులో బలవంతంగా తీసుకెళ్లి... ఆపై
Read Latest Telangana News And Telugu News