డ్రగ్స్‌పై పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: సీఎం రేవంత్
ABN , Publish Date - Jun 26 , 2026 | 02:49 PM
సమాజాన్ని డ్రగ్స్ నాశనం చేస్తాయి. డ్రగ్స్‌పై పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు..
హైదరాబాద్, జూన్ 26: సమాజాన్ని డ్రగ్స్ నాశనం చేస్తాయి. డ్రగ్స్‌పై పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు కీలక సందేశాన్ని ఇచ్చారు. తెలంగాణను డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల మహమ్మారి కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా, వారి కుటుంబాలతో పాటూ మొత్తం సమాజాన్నే నాశనం చేస్తుందన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా యువత ఎల్లప్పుడూ వీటికి దూరంగా ఉండాలని సీఎం హితవు పలికారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమని, అందుకోసం వారు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం చట్టాలు, పోలీసుల చర్యల వల్లే కాకుండా.. ప్రజల్లో సరైన అవగాహన పెంచడం ద్వారానే మాదక ద్రవ్యాల నియంత్రణ పూర్తిగా సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అక్రమ డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా భావించి సహకరించాలని కోరారు. యువత డ్రగ్స్ వైపు వెళ్లకుండా ఉండేందుకు.. వారిలో సానుకూల ఆలోచనలు, నైతిక విలువలను పెంపొందించడం ఎంతో ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమాజంలో మాదక ద్రవ్యాల వల్ల జరిగే నష్టాలపై నిరంతరం అప్రమత్తత పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహమ్మారిని రూపుమాపడానికి అందరం కలిసికట్టుగా చేసే సమిష్టి పోరాటమే శాశ్వత పరిష్కారమని, డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రతి పౌరుడూ నడుం బిగించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన.. వైసీపీ శ్రేణుల ఓవరాక్షన్
సాయికృష్ణ డెడ్‌బాడీని మాయం చేసింది ఆ ముగ్గురే.. తేల్చిన సిట్
Read Latest AP News And Telugu News