Share News

CM Revanth Reddy: ఉరేసినా తప్పులేదు

ABN , Publish Date - Jan 02 , 2026 | 05:14 AM

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్‌ హయాంలో జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వెనుక భారీ అవినీతి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ మార్పునకు అసలు అప్పటి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదమే లేదని చెప్పారు.....

CM Revanth Reddy: ఉరేసినా తప్పులేదు

  • కేసీఆర్‌, హరీశ్‌రావు సంతకం చేసి నీళ్లొదులుకున్నరు

  • కిరణ్‌కుమార్‌రెడ్డి నీటి లెక్కలకు వీళ్లు తలలూపారు

  • గల్ఫ్‌లో అయితే జనం రాళ్లతో కొట్టి చంపేవారు

  • ప్రజాస్వామ్య దేశం కనుక కసబ్‌లాగా కేసీఆర్‌పై విచారించి నిర్ణయం తీసుకుంటాం

  • జూరాల నుంచి తోడితే బాబు, జగన్‌ లబోదిబో

  • పంప్‌లు, లిఫ్ట్‌లతో కేసీఆర్‌ ఇంట్లో కనకవర్షం

  • పాలమూరు-రంగారెడ్డిపై విచారణకు ఆదేశిస్తాం

  • ఆ సంగతి తెలిసే గోదావరిపై కేసీఆర్‌ రచ్చ

  • మామా అల్లుళ్లవి 24 క్యారెట్‌ల అబద్ధాలు: సీఎం

హైదరాబాద్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్‌ హయాంలో జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వెనుక భారీ అవినీతి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ మార్పునకు అసలు అప్పటి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదమే లేదని చెప్పారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే తారీఖుతో సహా ఆయన చేసుకున్న ఒప్పందాలు, పెంచినఅంచనాలన్నీ బయటపెడతామని ప్రకటించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి బ్యారేజీని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చినపుడు మంత్రివర్గ ఆమోదం తీసుకోలేదని, పాలమూరు ప్రాజెక్టు విషయంలోనూ అదే చేశారని చెప్పారు. ప్రాజెక్టుల పేర్లు, ఊర్లు, అంచనాలు మార్చి కేసీఆర్‌ ఇంట్లో కనకవర్షం కురిపించారని సీఎం ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అవినీతిపై అసెంబ్లీలో చర్చించి, దర్యాప్తునకు ఆదేశిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కేసీఆర్‌ కూడా సభకు వచ్చి బలంగా వాదన వినిపించాలని కోరారు. ఆయన గౌరవానికి, వాదనకు ఎక్కడా ఆటంకం కలగకుండా చూసుకుంటానని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఎవరు బాగు పడటానికి జూరాల నుంచి శ్రీశైలానికి వెళ్లిందో, వేల కోట్లు ఎవరికి పోయాయో తేలాల్సి ఉందని అన్నారు. గురువారం ప్రజాభవన్‌లో కృష్ణా , గోదావరి బేసిన్‌ ప్రాజెక్టులపై నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గ, పార్టీ సహచరుల సమక్షంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పుట్టి పెరిగిన వారెవరూ ఇక్కడి నీళ్లను ఇతరులకు ఇచ్చే ఆలోచన చేస్తారా? మన రైతుల హక్కులను కాపాడాల్సిన వాళ్లు ఏపీకి నీళ్లు ధారాదత్తం చేస్తారా? అని ప్రశ్నించారు. జల వివాదంలో అనేక చిక్కులు ఉన్నాయని, ఏ పక్క నుంచి ఎవరు వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు.


ఉమ్మడి రాష్ట్రంలో నష్టం జరిగిందనే తెలంగాణ తెచ్చుకున్నామని, ఆ విషయం మరచిపోయి ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి తయారు చేసిన లెక్కలకు ఆమోదం తెలుపుతూ కేసీఆర్‌, హరీశ్‌లు గుడ్డిగా సంతకాలు చేశారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కిరణ్‌ కన్నా వీళ్లే ఎక్కువ దుర్మార్గులని చెప్పారు. మనోడే ద్రోహం చేస్తే పాతరేయమని కాళోజీ చెప్పింది వీళ్లిద్దరికీ వర్తిస్తుందని అన్నారు. నీళ్ల విషయంలో వాళ్ల పాపాలకు ఉరితీసినా తప్పులేదన్నారు. మధ్య ప్రాచ్య దేశాల్లో ఇలాంటి నేరాలకు చౌరస్తాలో ప్రజల చేత రాళ్లతో కొట్టి చంపించే వాళ్లన్నారు. ప్రజాస్వామ్య దేశం కాబట్టి కసబ్‌ను విచారించినట్లు కేసీఆర్‌ను కూడా విచారిస్తామని చెప్పారు. కేసీఆర్‌ దగ్గర అవినీతి సొమ్ముంది కాబట్టి వాదించడానికి ఎవర్నైనా తెచ్చుకోగలరని అన్నారు. కేసీఆర్‌, హరీశ్‌లు మాట్లాడే ప్రతీ పదం 24 క్యారెట్ల స్వచ్ఛమైన అబద్ధమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అబద్ధాల్లో పోటీ పెడితే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌లకు ఉమ్మడిగా మొదటి బహుమతి వస్తుందన్నారు. కృష్ణా జలాలపై తప్పుల మీద తప్పులకు పాల్పడిన వారు, ఉద్దేశపూర్వకంగా తెలంగాణకు నష్టం కలిగించిన వారు తాము రైతాంగానికి న్యాయం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను సమర్థించడం మానేసి ప్రజల్లోకి అబద్ధాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద బలమైన వాదన వినిపించింది కాంగ్రెస్‌ నాయకుడు పీజేఆర్‌ అని గుర్తు చేశారు. కేసీఆర్‌ హయాంలో జరిగిన తప్పులను దిద్దుకుంటూ, పక్క రాష్ట్రాన్ని విమర్శించడం కాకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.


811 టీఎంసీల్లో 299 టీఎంసీలు చాలన్నారు

ఉమ్మడి ఏపీకి బచావత్‌ ట్రైబ్యునల్‌ 811 టీఎంసీలు కేటాయిస్తే అందులో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్‌, హరీ్‌షరావు సంతకాలు చేశారని రేవంత్‌ మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి వినియోగంపై కిరణ్‌కుమార్‌రెడ్డి తప్పుడు లెక్కలు తీస్తే వాటిని ప్రశ్నించకుండా కేసీఆర్‌, హరీశ్‌ గుడ్డిగా సంతకం చేశారన్నారు. మొదట ఒక ఏడాదికే ఒప్పందమని, ఏటేటా పొడిగించుకుంటూ పోయారని, నాలుగో ఏడాది బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తేల్చేదాకా మళ్లీ మళ్లీ పిలవొద్దని, 34 శాతానికి ఒప్పుకుని కేసీఆర్‌ సంతకం చేసి, హక్కులు కట్టబెట్టారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. 20 ఏళ్లుగా నీటి లెక్కలు తేల్చని ట్రైబ్యునల్‌ను నమ్మి, అది తేల్చేదాకా 299 టీఎంసీలు అని కేసీఆర్‌ ఒప్పందం కుదుర్చుకోవడంతో ఏపీ వ్యూహాత్మకంగా ట్రైబ్యునల్‌ విచారణను ముందుకు పోనివ్వడం లేదన్నారు. అంతర్జాతీయ జలవిధానం, ప్రకారం 71 శాతం కృష్ణా పరివాహాక ప్రాంతం ఉన్న తెలంగాణకు 555 టీఎంసీలు రావాలని, 1005 టీఎంసీల లెక్క అయితే 763 టీఎంసీలు రావాలని చెప్పారు. ట్రైబ్యునల్‌లో తెలంగాణ సమర్థ వాదనతో ఏపీ ఉక్కిరి బిక్కిరి అవుతోందని స్వయంగా ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ అక్కడి సీఎం చంద్రబాబుకు లేఖ రాశారని ప్రస్తావించారు. వరుస ఓటములతో పార్టీ మనుగడ కష్టంగా మారిన కేసీఆర్‌ బయటికి వచ్చి ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణ సీఎం ఆంధ్రాకు సహకరిస్తున్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.38 వేల కోట్లతో ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని, రీ డిజైన్‌ పేరుతో లిఫ్ట్‌లు, పంపులు అనేక రెట్లు పెంచి కేసీఆర్‌ ఇంట్లో కనక వర్షం కురిపించుకున్నారని ఎద్దేవా చేశారు. ‘‘జూరాలోనూ మూడు దశల్లో ఉన్న పంపులను శ్రీశైలానికి మార్చి ఐదు దశలు పెట్టారు. 22పంపులు, 37పంపులయ్యాయి. రూ.32,200 కోట్ల ప్రాజెక్టు రూ.84 వేల కోట్లకు పెరిగింది. జూరాల పూర్తిగా తెలంగాణ ప్రాజెక్టు. కర్ణాటక నుంచి నీళ్లు వచ్చినవి వచ్చినట్లే లిఫ్ట్‌ చేసుకోవచ్చు. కేసీఆర్‌ తలను(జూరాల) వదిలేసి, తోక (శ్రీశైలం)దగ్గరికి పోయిండు. శ్రీశైలం దగ్గర ఏపీ రోజుకు 13.50 టీఎంసీలు తరలించే భౌగోళిక వెసులుబాటు ఉంది. తెలంగాణ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినా 2 టీఎంసీలకు మించి తరలించలేదు. ఇప్పుడు తరలిస్తున్నదే 0.25 టీఎంసీలు. నీటి దొంగతనంలో ఏపీతో పోటీపడే పరిస్థితి లేదు. హక్కులు సాధించే శక్తి లేదు. పైగా జూరాల నుంచి శ్రీశైలంకు ప్రాజెక్టును తరలించడంతో ఏపీకి కేసు వేసే అవకాశం కలిగింది’’ అని రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు.


ఏపీ లబోదిబోమని ఏడ్చేది

జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 35 రోజులు తరలిస్తే... 70 టీఎంసీలతో ప్రాజెక్టు కింద నీటిని అందించే అవకాశం ఉండేదని రేవంత్‌ చెప్పారు. శ్రీశైలం దగ్గర ఎవ్వరికి చుక్కనీరు దొరికే అవకాశం ఉండేది కాదన్నారు. వచ్చింది వచ్చినట్లే తెలంగాణకు తరలిస్తే చంద్రబాబు, జగన్‌ లబోదిబోమని మోదీ దగ్గరకు పోయి ఏడవాల్సి వచ్చేదన్నారు. వాళ్లు తెలంగాణ లోపలికి వచ్చి జూరాల వద్ద పాలమూరు కట్టకుండా ఆపగలిగే వారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ తప్పుడు పనుల వల్ల తెలంగాణకు 0.25 టీఎంసీల సామర్థ్యం, ఏపీకి 13 టీఎంసీల సామర్థ్యం ఏర్పడ్డాయని చెప్పారు. పదేళ్లు వాళ్లకు అవకాశం ఇచ్చింది కేసీఆరేనన్నారు. వీటన్నింటిపై అంతర్గతంగా చర్చించి, దర్యాప్తు జరపాలని అధికారులకు మార్గదర్శనం చేయగానే బీఆర్‌ఎస్‌ వాళ్లు గోదావరి-బనకచర్ల వివాదాన్ని లేవనెత్తుతున్నారన్నారు. అసలైన కృష్ణా చర్చను వదిలేసి గోదావరికి వెళ్లారని అన్నారు. మంత్రి ఉత్తమ్‌ జలాల సమస్యపై రోజుకు 18 గంటలు పని చేస్తున్నారని, ఫైళ్లను అధ్యయనం చేస్తూ మతలబులన్నీ బయటకు తీస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారంతా ప్రెస్‌మీట్‌ పెట్టి, కేసీఆర్‌ను సభకు రావాలని కోరాలని సూచించారు. 2007 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంత ప్రాజెకక్టులను ఐఏఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ చూశారని, ఏపీ ప్రాజెక్టులకు ఎస్‌కే జోషి ఉన్నారని రేవంత్‌ ప్రస్తావించారు. ప్రతీ ప్రాజెక్టును ఎంత ఖర్చుతో పూర్తి చేయెచ్చో ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఆయనకు అవగాహన ఉందని, ఆ లెక్కలన్నీ ప్రస్తుత ప్రభుత్వానికి తెలుస్తున్నాయన్న ఉక్రోషంతో బీఆర్‌ఎస్‌ నేతలు ఆయన మీద విమర్శలు చేస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు. ఏపీ కోసం పనిచేసిన వారిని కేసీఆర్‌ పెట్టుకుంటే తెలంగాణ కోసం పనిచేసిన దాస్‌ను తాము తెచ్చుకున్నామని చెప్పారు.


2022 దాకా డీపీఆర్‌ సిద్ధం చేయలేదు

పాలమూరు-రంగారెడ్డి లాభదాయకతను తెలుసుకోవాలంటే డీపీఆర్‌ తయారు చేయాలని, కేసీఆర్‌ ఉద్దేశపూర్వంగానే 2022 వరకు డీపీఆర్‌ను తయారు చేయలేదని ముఖ్యమంత్రి అన్నారు. రూ.70 వేల కోట్లకు చేరిన పాలమూరు డీపీఆర్‌ తయారైతే దానిపై ప్రజల్లో చర్చ జరుగుతుందనే ఉద్దేశంతో కేసీఆర్‌ రూ.27 వేల కోట్ల పనులు కాంట్రాక్టర్లకు అప్పగించి, డీపీఆర్‌ తయారు చేయలేదని చెప్పారు. పర్యావరణ అనుమతి కోసం 2017లో అవకాశం ఇచ్చినా బహిరంగ విచారణ చేయలేదని ప్రస్తావించారు. 2019లో కూడా నోటిఫికేషన్‌ ఇచ్చి వెనక్కి తీసుకున్నారని తెలిపారు. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారని ఎన్టీజీలో కేసులు వేస్తే స్టే వచ్చిందన్నారు. డీపీఆర్‌ కూడా లేకుండా అప్పగించిన పనులకు సంబంధించి పంపులు, లిఫ్టుల బిల్లులు తెచ్చుకోవడం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లి, తాగునీటి అవసరాల కోసం 7.15 టీఎంసీలతో పనులు చేస్తామని అఫిడవిట్‌ ఇచ్చారని తెలిపారు. అసెంబ్లీలో కేసీఆర్‌ చర్చకు వస్తే రికార్డులన్నీ తీసి చూపిస్తామన్నారు. తాగునీటి అవసరాల కోసం 7.15 టీఎంసీలు సరిపోతాయని కేసీఆర్‌, హరీశ్‌లు సుప్రీంకోర్టులో కేసు వేస్తే 7.15 టీఎంసీల పనులకే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందన్నారు. పంపులు, లిఫ్టుల కాంట్రాక్టర్లకు చెల్లింపుల కోసమే ఇలా తెగబడ్డారన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయితే బీఆర్‌ఎస్‌ శాశ్వతంగా రాజకీయ సమాధి అవుతుందనే భయంతో కేసీఆర్‌, హరీశ్‌ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డికి తొలి విడతలో 45 టీఎంసీలతో, రెండో విడతలో మరో 45 టీఎంసీలతో పూర్తి చేయాలని, అనుమతి తెచ్చుకోవాలనేది ప్రభుత్వ విధానమని చెప్పారు. అనుమతులు వస్తే 7.25 శాతానికి దీర్ఘకాలిక వ్యవధితో రుణాలు లభిస్తాయన్నారు. రూ.84 వేల కోట్ల ప్రాజెక్టులో ప్రధానమంత్రి కృషి సింఛాయ్‌ యోజన కింద 60 శాతం నిధులు తెచ్చుకొని, 40 శాతం రాష్ట్ర నిధులతో ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏడాదిలోపు కృష్ణా ట్రైబ్యునల్‌లో నీటి కేటాయింపుల కోసం పట్టుబడుతున్నామని, నెలకు రెండు, మూడుసార్లు వాదనలు వినిపించే స్థాయికి ట్రైబ్యునల్‌ను తెచ్చామని అన్నారు. చేసింది చెప్పుకోవడంలో గ్యాప్‌ ఉందన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 05:14 AM