ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఆర్టీసీ సమ్మెపై కీలక చర్చ
ABN , Publish Date - Apr 23 , 2026 | 08:04 PM
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కీలకంగా చర్చ జరిగినట్లు మంత్రులు తెలిపారు.
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చ జరిగింది. సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ప్రాణాలు తీసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని స్పష్టం చేసిన ఆయన.. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో రేపు TGS RTC JACను చర్చలకు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని కార్మిక సంఘాలకు పిలుపు నిచ్చింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రుల బృందం కార్మిక సంఘాలతో భేటీ కానుంది.
50 శాతం వేతనం రిటైర్డ్ ఉద్యోగులకు: పొంగులేటి
అంతేకాకుండా.. ఈ భేటీలో మరికొన్ని అంశాలపైనా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేల వేతనాల్లో 50 శాతం రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాలని కేబినెట్ నిర్ణయించందన్నారు. అలాగే.. సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కూడా నిర్ణయించినట్లు చెప్పారు. ఆర్టీసీ సమ్మెపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చ జరిగిందని.. సమస్యా పరిష్కారానికి ఐదుగురు మంత్రులతో కూడిన బృందం కార్మిక సంఘాలతో చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. కార్మికులు క్షణికావేశానికి లోనుకావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, చర్చల ద్వారా పరిష్కారం సాధించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. అలాగే.. రెవెన్యూ రీసోర్సెస్ కమిటీని ఏర్పాటుచేసినట్లు కూడా కేబినెట్ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కార్మికులు తొందరపడొద్దని, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. కార్మికులు ప్రాణాలు తీసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మరో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కార్మికులు సంయమనం పాటించాలని సూచించారు. ప్రాణాలు తీసుకోవడం సరైన చర్య కాదని, ఆర్టీసీ కార్మికుల పాత్ర రాష్ట్ర సాధనలో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని ఆయన కోరారు.
కాళేశ్వరం అంశంపైనా..
కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపైనా చర్చ జరిగింది. ఈ కేసులో CBI విచారణకు ఒత్తిడి తేవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్
కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ములేకే మాపై విమర్శలు: కిషన్ రెడ్డి
Read Latest Telangana News