Share News

ఎంత కొంటే అంతే!

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:47 AM

కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రంలో పంట ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు తెలిపారు.

ఎంత కొంటే అంతే!

  • కేంద్రం కొనుగోలు చేసే పంటలను అంతే కోటాలో కొంటాం

  • కేంద్రం విధివిధానాల ప్రకారమే రాష్ట్రంలో పంట కొనుగోళ్లు

  • ఇప్పటికే 80 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం.. కానీ కేంద్రం వివక్ష

  • రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన మొత్తం ధాన్యాన్ని కొనాల్సిందే

  • రామగుండంలో ఉత్పత్తయ్యే ఎరువులను రాష్ట్రానికే కేటాయించాలి

  • 30న మధిరలో రైతు సమ్మేళనం.. అక్కడి నుంచే ‘భరోసా’ విడుదల

  • ఉపాధి చట్టంపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

  • మెట్రో విస్తరణకు బీజేపీ మంత్రులు, ఎంపీలు సహకరించాలి

  • ఇక నుంచి కాగితరహిత క్యాబినెట్‌.. మంత్రులకు ట్యాబ్‌లు

  • మంత్రుల ప్రత్యేక సమావేశంలో నిర్ణయం.. వెల్లడించిన మంత్రులు

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రంలో పంట ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు తెలిపారు. కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని నిర్ణయించిందని చెప్పారు. ఇకపై కేంద్రం ఏయే పంట ఉత్పత్తులకు మద్దతు ధర నిర్ణయించి, కొనుగోలు చేస్తుందో.. అవే పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం మంత్రులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వ్యవసాయం, ధాన్యం కొనుగోళ్లు, మెట్రో విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. ఆ వివరాలను మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘‘రాష్ట్రంలో రైతులు ఈ ఏడాది దేశంలోనే రికార్డు స్థాయిలో అత్యధిక ధాన్యం పండించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం కూడా ఈ సీజన్లో ఇప్పటికే దాదాపు 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణనుంచే తక్కువ ధాన్యాన్ని సేకరించటంపై మంత్రుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రం పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిమాండ్‌ చేస్తున్నాం’’ అని స్పష్టం చేశారు. వానాకాలం సీజన్‌కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. రైతులు ఇబ్బంది పడకుండా ఎరువుల కోటాను విడుదల చేయాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖలు రాశారని గుర్తు చేశారు. రామగుండం ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ నుంచి ఉత్పత్తి అవుతున్న యూరియాలో అత్యధిక కోటా తెలంగాణకే కేటాయించాలని ప్రభుత్వం తరఫున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. రాష్ట్ర రైతుల అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇస్తే.. రవాణా ఖర్చులు తగ్గిపోతాయని, ఎరువుల కొరత ఉత్పన్నం కాదని చెప్పారు. ఇదే విషయాన్ని మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి పెంచాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


30న రైతు భరోసా

రైతు భరోసా నిధులను ఈనెల 30న విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రులు తెలిపారు. అదే రోజు ఖమ్మం జిల్లా మధిరలో భారీ ఎత్తున రైతు సమ్మేళనం, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని, అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిశ్చయించిందని వెల్లడించారు. రైతు వేదికపై నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం ప్రారంభమవుతుందని చెప్పారు. ‘‘రైతులు పండించే సన్న ధాన్యంలో ఏడు రకాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించాం. మార్కెట్లో డిమాండ్‌, ప్రజల అవసరాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్‌-15048, హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరామ్‌, కేఎన్‌ఎం-1638, డబ్ల్యూజీఎల్‌ -44, కేఎన్‌ఎం-7715 రకాలకే బోనస్‌ ఇవ్వనున్నాం’’ అని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై విలేకరులు ప్రశ్నించగా.. బీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవాలని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ధాన్యం కొనుగోళ్లకు లక్ష కోట్లు చెల్లించామని, గత పదేళ్లలో కూడా గత పాలకులు ఇంత మొత్తం చెల్లించలేదని తెలిపారు.

ఉపాధి చట్టంపై అధ్యయనానికి ఉపసంఘం

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్‌జీ పేరిట కొత్త పథకంగా అమలు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని మంత్రులు పునరుద్ఘాటించారు. పాత చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కొత్త చట్టం అమలుతో కూలీలపైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా పడే ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వివేక్‌ ఆధ్వర్యంలోని ఉపసంఘం దీనిపై అధ్యయనం చేస్తుందని వివరించారు. వీబీజీ రాంజీ పథకానికి సంబంధించి ఇతర రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి రావాలని సమావేశంలో భావించారు.


మెట్రో విస్తరణకు అనుమతులు ఇవ్వాలి

మెట్రో రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రులు తెలిపారు. ఒప్పందం ప్రకారం ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి రావాల్సిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని కోరుతున్నామన్నారు. ఇందుకు రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు సహకరించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించకుండా కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు ఇప్పించేందుకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇకనుంచి ప్రతి మంత్రివర్గ సమావేశాన్ని కాగితరహితంగా నిర్వహించే పద్ధతికి ఈరోజు నుంచి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. క్యాబినెట్‌ సమావేశాలన్నింటినీ ఇకపై డిజిటల్‌గా నిర్వహిస్తామన్నారు. గురువారంనాటి సమావేశానికి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులందరికీ ఐటీ విభాగం తరఫున మంత్రి శ్రీధర్‌ బాబు స్పెషల్‌ ట్యాబ్‌లు అందజేశారని చెప్పారు. డిజిటల్‌ క్యాబినెట్‌ అమలు తీరును అందరూ పరిశీలించారని, ఇకపై ఈ-బుక్‌ ద్వారానే క్యాబినెట్‌ సమావేశాల ఎజెండా, నోట్స్‌ మంత్రులకు అందుబాటులో ఉంచుతామన్నారు.


వారంలో ఢిల్లీకి మంత్రులు

తెలంగాణ రాష్ట్రానికి కోటా మేరకు ఎరువుల సరఫరా, పూర్తి స్థాయిలో పంట కొనుగోళ్లు, మెట్రో విస్తరణకు అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వంలో సంబంధిత శాఖల మంత్రులను కలిసేందుకు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబు తదితర మంత్రులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయా శాఖల మంత్రుల అపాయింట్‌మెంట్లు అడిగి.. అవి కుదరగానే ఢిల్లీకి వెళతారు. ఈ మేరకు సచివాలయంలో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల భేటీలో నిర్ణయించారు. కోటా మేరకు యూరియా సరఫరా చేయడమే కాకుండా మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసేందుకు వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రబీ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో వారంలోపే కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయించారు. కాగా.. మెట్రో విస్తరణకు కేంద్రం అనుమతులపైనా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అనుమతులు ఇవ్వకుండా పలువురు నేతలు, కేంద్ర మంత్రులు అడ్డు పడుతున్నారని చర్చించారు. ఇతర ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణం తీసుకుందామంటే.. వడ్డీ రేటు ఎక్కువ అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మెట్రో విస్తరణ, ఐఆర్‌ఎ్‌ఫసీ ద్వారా రుణానికి అనుమతుల కోసం కేంద్రం, తెలంగాణ బీజేపీ నాయకులపై ఒత్తిడి పెంచాలని సమావేశంలో నిర్ణయించారు. ఢిల్లీకి వెళ్లనున్న మంత్రులు ఈ విషయంలోనూ సంబంధిత కేంద్ర మంత్రులను కలవాలని సీఎం రేవంత్‌ సూచించారు.

Updated Date - Jun 19 , 2026 | 03:47 AM