రెండు డీఏల విడుదలకు కేబినెట్ ఆమోదం.. టీఎన్జీవోల హర్షం
ABN , Publish Date - Oct 02 , 2026 | 01:14 PM
రెండు డీఏల విడుదలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై టీఎన్జీవోలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, అక్టోబర్ 2: రెండు డీఏల విడుదలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన డీఏల విడుదలకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు టీఎన్జీవో నేతలు మారం జగదీశ్వర్, ఎస్.ఎం. హుస్సేనీ ముజీబ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ముఖ్యంగా పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి.. 51 శాతం ఫిట్‌మెంట్‌తో కొత్త పే స్కేళ్లను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ మంజూరు చేసి ఆర్థిక ఇబ్బందులు తొలగించాలని కోరారు.
అదేవిధంగా ఉద్యోగుల హెల్త్ కార్డుల అమలులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి.. వైద్య సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని టీఎన్జీవోలు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడని ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. దాదాపు 90 శాతం ఉద్యోగులకు సంబంధించిన ఇలాంటి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని టీఎన్జీవో నేతలు సూచించారు. డీఏల విడుదలకు కేబినెట్ ఆమోదం లభించిన నేపథ్యంలో మిగిలిన ఉద్యోగుల సమస్యలపైనా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు
ఇవి కూడా చదవండి...
నెల్లూరులో పొట్టేపాళెం వంతెన ప్రారంభం.. నెరవేరిన నాలుగు నియోజకవర్గాల ప్రజల కల
ఏపీ హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీల పెంపుపై మంత్రి సంధ్యారాణి హర్షం
Read Latest AP News And Telugu News