Share News

8 నెలల్లోనే 2,216 భవనాలు!

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:33 AM

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 8 నెలల వ్యవధిలోనే 2,216 భవనాలను నిర్మించింది.

8 నెలల్లోనే 2,216 భవనాలు!
rudram

  • రూ.281.78 కోట్లతో 31 జిల్లాల్లో నిర్మాణం

  • ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల్లో స్థిరాస్తుల కల్పన

  • మహిళా స్వయం సంఘాలు, పంచాయతీలు, అంగన్‌వాడీలకు భవనాలు

  • 19న ఇందిరాగాంధీ జయంతి రోజు ప్రారంభం

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 8 నెలల వ్యవధిలోనే 2,216 భవనాలను నిర్మించింది. మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్‌ ఆధ్వర్యంలో వీటి నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేసింది. ఇంత తక్కువ సమయంలో గ్రామస్థాయిలో భవనాల నిర్మాణం చేపట్టడం అరుదైన అంశమని సంబంధిత విభాగాలు చెబుతున్నాయి. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలతోపాటు మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామ పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలను అందుబాటులోకి తెచ్చేలా ఉపాధి హామీ (ప్రస్తుత వీబీజీరామ్‌జీ) పథకం నిధులను ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటోంది. అందులో భాగంగానేరాష్ట్రంలోని 31 జిల్లాల్లో రూ.281.78 కోట్లతో ఏకకాలంలో 2,216 భవనాలను నిర్మించడమే కాకుండా.. ఈ నెల 19న ఒకేరోజు వాటిని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్తచట్టంలో భాగంగా ఉపాధి పనులకు కేంద్రం వాటా నిధులు 60 శాతం ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 40 శాతం నిధులు ఇస్తోంది. ఈ నిధులు సద్వినియోగం కావాలన్న ఉద్దేశంతోనే గ్రామ స్థాయిలో భవనాల నిర్మాణం చేపట్టినట్లు ప్రభుత్వ విభాగాలు వెల్లడించాయి.


మహిళా సంఘాల భవనాలే అధికం..

ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించనున్న మొత్తం 2,216 భవనాల్లో.. అత్యధికంగా 1,399 మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబందించిన భవనాలున్నాయి. ఒక్కో భవనాన్ని రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.139.90 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక 599 గ్రామ పంచాయతీ భవనాలను ఒక్కొక్కటి రూ.20 లక్షల వ్యయం చొప్పున మొత్తం రూ.119.80 కోట్లతో నిర్మించినట్లు, 184 అంగన్‌వాడీ భవనాలను రూ.12 లక్షల వ్యయం చొప్పున రూ.22.08 కోట్లతో నిర్మించినట్లు పేర్కొన్నాయి. అన్ని భవనాలనూ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించగా.. అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి అయిన రూ.12 లక్షల వ్యయంలో మాత్రం రూ.8 లక్షలు ఉపాది నిధులు, రూ.2 లక్షలు 15వ ఆర్థిక సంఘం నుంచి, మరో రూ.2 లక్షలు మహిళా శిశు సంక్షేమశాఖ ద్వారా వినియోగించినట్లు పీఆర్‌ ఇంజనీరింగ్‌ విభాగాలు వెల్లడించాయి. అదే విదంగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు సంబంధించి 28 వర్క్‌షెడ్లను, ఆహార ధాన్యాల నిల్వ కోసం నిర్మించిన ఆరు భవనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా భవనాల నిర్మాణంతో గ్రామాల్లో స్థిరాస్తుల కల్పన మాత్రమే కాకుండా.. గ్రామీణ కూలీలకు ఎక్కువ సంఖ్యలో పని కల్పించే అవకాశం కూడా లభించిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.


ggram.jpgనల్లగొండ జిల్లాలో అత్యధికంగా..

మాజీ ప్రదాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 19న రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 2,216 భవనాలు ఒకేరోజు ప్రారంభం కానుండడం గ్రామీణ మౌలిక వసతుల కల్పనలో కీలక పరిణామంగా మారింది. వీటిలో నల్లగొండ జిల్లాలోనే అత్యధికంగా 336 భవనాలు నిర్మించగా.. అందులో 47 గ్రామపంచాయతీ భవనాలు, 271 ఎస్‌హెచ్‌జీ, 18 అంగన్‌వాడీ భవనాలు ఉన్నాయి. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో 268 భవనాలు, ఖమ్మం జిల్లాలో 120, వికారాబాద్‌లో 109, భద్రాద్రి కొత్తగూడెంలో 96, నిజామాబాద్‌ 87, కరీంనగర్‌ 86, మెదక్‌ 84, ఆదిలాబాద్‌ జిల్లాలో 80 భవనాలు ప్రారంభానికి సిద్థంగా ఉన్నాయి. అతితక్కువగా నారాయణపేట జిల్లాలో 14 భవనాలు నిర్మించారు. ఈ నెల 19న ఈ భవనాలన్నింటినీ ప్రారంభించేందుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి.

భవనాలు ఇలా...!

ఉపాధి హమీ పథకం నిధులతో నిర్మించిన భవనాల్లో.. రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘం భవనంలో ఒక హాలు, చిన్న గది ఉంటాయి. ఇందులో ఆ గ్రామానికి చెందిన ఎస్‌హెచ్‌జీ గ్రూపులు తరచూ సమావేశమయ్యేందుకు, తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇక రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంలో ఒక హాలుతోపాటు సర్పంచ్‌, కార్యదర్శి కోసం వేరువేరుగా రెండు గదులు ఉంటాయి. అదేవిధంగా అంగన్‌వాడీ భవనం.. పెద్ద హాలు మాదిరిగా ఉండటమే కాకుండా చిన్నారులకు అవసరమైన మౌలిక సదుపాయాలను సైతం అందులో ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి..

మూడు టిమ్స్‌కు ఒకే రిక్రూట్‌మెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు

Updated Date - Nov 13 , 2026 | 03:34 AM