తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
ABN , Publish Date - Jul 29 , 2026 | 05:30 PM
తెలంగాణలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. కేంద్ర పర్యావరణ శాఖ 2021లో జారీ చేసిన ఆఫీస్ మెమోరాండాన్ని రద్దు చేసినప్పటికీ.. ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేసింది.
హైదరాబాద్, జులై 29: తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు భారీ ఉపశమనం కల్పించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ 2021లో జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం(OM)ను సుప్రీంకోర్టు కొట్టివేసినా.. ఆ ఉత్తర్వు ఆధారంగా ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులన్నీ పూర్తిగా చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేసింది. ఈ తీర్పు భవిష్యత్తుకు మాత్రమే వర్తిస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. దీంతో తెలంగాణలో కొనసాగుతున్న ఈ కీలక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎలాంటి చట్టపరమైన ఆటంకం ఉండదని స్పష్టత వచ్చింది.
అదే సమయంలో భవిష్యత్తులో చేపట్టే కొత్త ప్రాజెక్టులకు ముందస్తు పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా చట్టాలను భర్తీ చేయడం సాధ్యంకాదని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వాలంటే కేంద్రప్రభుత్వం చట్టబద్ధమైన నోటిఫికేషన్ జారీ చేయాల్సిందేనని సూచించింది. ఇప్పటికే పూర్తైన లేదా నిర్మాణంలో ఉన్న కీలక ప్రాజెక్ట్ పనులకు ఎలాంటి అంతరాయం ఉండదని న్యాయస్థానం పేర్కొనడంతో తెలంగాణ ప్రభుత్వం, సాగునీటి ప్రాజెక్టులకు ఇది కీలక ఊరటనిచ్చిన తీర్పుగా భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
రోహిత్ శర్మను మళ్లీ ఎదుర్కొనే అవకాశం ఉంటుందో లేదో!: జోస్ బట్లర్
టీడీపీ నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దు: పల్లా శ్రీనివాసరావు