Share News

పరిహారం వివాదాన్ని త్వరితగతిన పరిష్కరించండి

ABN , Publish Date - Nov 19 , 2026 | 06:01 AM

హైదరాబాద్‌ శివార్లలోని బాలాపూర్‌, చింతలకుంట తదితర ప్రాంతాల్లో డీఆర్‌డీఓ అవసరాల కోసం సేకరించిన భూముల పరిహారం వివాదంపై దాఖలైన అప్పీళ్లను త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.

పరిహారం వివాదాన్ని త్వరితగతిన పరిష్కరించండి
TG HIgh Court

  • డీఆర్‌డీఓ కోసం సేకరించిన భూములపై తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ శివార్లలోని బాలాపూర్‌, చింతలకుంట తదితర ప్రాంతాల్లో డీఆర్‌డీఓ అవసరాల కోసం సేకరించిన భూముల పరిహారం వివాదంపై దాఖలైన అప్పీళ్లను త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లను మెరిట్స్‌ ఆధారంగా విచారించాలని తెలిపింది. 2006లో భూ సేకరణ జరగ్గా.. భూ సేకరణ అధికారి (ఎల్‌ఏఓ) నిర్ణయించిన పరిహారం తక్కువగా ఉందని, మార్కెట్‌ ధర ప్రకారం చెల్లించాలని కే శ్రీనివాస్‌ తదితరులు కోర్టును ఆశ్రయించారు. సివిల్‌ కోర్టు పరిహారం పెంచుతూ తీర్పునివ్వగా, దాన్ని సవాల్‌ చేస్తూ రక్షణ శాఖ, ఎల్‌ఏఓ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం రైతులకు అనుకూలంగా తీర్చినిచ్చింది. ప్రస్తుతం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఎదుట కేసు పెండింగ్‌లో ఉంది. ఈ దశలో ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అది బుధవారం జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవాలతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. తొలుత ఎల్‌ఏఓ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2006నాటి భూ సేకరణకు 2009 ధరలను ప్రాతిపదికగా తీసుకోవడం సహేతుకం కాదన్నారు. తెలంగాణ హైకోర్టులో డిసెంబరు 30న ఈ కేసు తుది విచారణ ఉందని చెప్పారు. భూనిర్వాసితుల తరఫు న్యాయవాది వాదిస్తూ హైకోర్టు ఆదేశించినప్పటికీ 25 శాతం పరిహారం మాత్రమే చెల్లించి ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. ఈ అంశంపై మరోసారి ఫిబ్రవరి 12న విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..

జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్‌.. కొట్టివేసిన సుప్రీంకోర్టు

Updated Date - Nov 19 , 2026 | 06:02 AM