సూపర్ ఎల్‌నినో ముప్పు.. నీటిని పొదుపుగా వాడండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ABN , Publish Date - Oct 24 , 2026 | 05:31 PM
సూపర్ ఎల్‌నినో ప్రభావంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం కొదుమూరులో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో డిప్యూటీ సీఎం మాట్లాడారు..
ఖమ్మం, అక్టోబర్ 24: సూపర్ ఎల్‌నినో ప్రభావంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని చింతకాని మండలం కొదుమూరులో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో డిప్యూటీ సీఎం మాట్లాడారు. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని తెలిపారు. వర్షాలు తగ్గి, నీటి వనరులు ఎండిపోతే తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చెరువుల్లో అందుబాటులో ఉన్న నీటిని కాపాడుకోవాలని.. వాటిని ప్రధానంగా తాగునీటి అవసరాలకే వినియోగించాలని కోరారు. పశువులు, ఇతర జీవరాశులకు నీటి కొరత రాకుండా చూడాలని, ఆహార పదార్థాల కొరత ఏర్పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని భట్టి విక్రమార్క వెల్లడించారు. కరోనా సమయంలో సమష్టిగా స్పందించినట్టే.. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి కూడా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 2023లో 15,493 మెగావాట్లుగా ఉండగా, 2026 నాటికి 20,018 మెగావాట్లకు చేరిందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో నిరంతరాయంగా సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ ముందస్తు ఏర్పాట్లు చేస్తోందన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లలో సుమారు 15 లక్షల పంపుసెట్లకు భూగర్భజలాలు అందుబాటులో లేవని పేర్కొన్నారు. భూగర్భజలాలు లేని ప్రాంతాల్లో మోటార్లను ఉపయోగించకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి వనరులను నిర్లక్ష్యంగా వినియోగిస్తే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, నీటిని పొదుపు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
బొత్స చైతన్యపై జనసేన ఫిర్యాదు.. జెడ్పీటీసీ నామినేషన్‌పై అభ్యంతరం
స్థానిక ఎన్నికలను ఆపేందుకు 59 పిటిషన్లు.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
Read Latest AP News And Telugu News