సంతోష్‌రావుకు సిట్ నోటీసులు
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:58 AM
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొద్దిరోజులుగా వరుసగా బీఆర్‌ఎస్ కీలక నేతలను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం....
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నేడు మధ్యాహ్నం 3 గంటలకు రావాలని పిలుపు
నోటీసులపై ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
ట్యాపింగ్ కోసం అధికారులకు వచ్చిన ఫోన్ నంబర్లన్నీ సంతోష్‌రావు నుంచే?
దీనిపై ప్రశ్నించనున్న సిట్ అధికారులు?
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొద్దిరోజులుగా వరుసగా బీఆర్‌ఎస్ కీలక నేతలను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజాగా మరో కీలక నేతను విచారణకు పిలిచింది. ఆ పార్టీ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌రావుకు సిట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాలని పేర్కొంది. సిట్ నోటీసులను సంతోష్‌రావు కూడా ధ్రువీకరించారు. నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం దర్యాప్తు అధికారుల ఎదుట విచారణకు హాజరవుతానని ప్రకటించారు. కాగా, సిట్ ఎదుట విచారణకు హాజరు కావడానికి ముందు బంజారాహిల్స్‌లోని బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ నాయకులు, శ్రేణులతో సంతోష్‌రావు సమావేశం కానున్నట్లు, అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా విచారించిన వారందరినీ ఉదయమే హాజరు కావాల్సిందిగా సూచించిన సిట్ అధికారులు.. సంతోష్‌రావు విషయంలో మాత్రం భిన్నమైన సమయాన్ని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌తోపాటు ఇతర పార్టీల నాయకులు, అధికారులు, మాజీ అధికారులు, సాక్షుల్ని కూడా నిర్ణీత తేదీలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ సూచించింది. కానీ, సంతోష్‌రావును మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. అయితే నాలుగు రోజుల క్రితం కేటీఆర్‌ను విచారించిన సమయంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధాకిషన్‌రావును అదే సమయంలో సిట్ కార్యాలయానికి పిలిచి విచారించారు. దీంతో సంతోష్‌రావును విచారించే సమయంలోనూ అదే పద్ధతిని అవలంబించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నోటీసుల్లో ఏముందంటేసంతోష్‌రావుకు సిట్.. సెక్షన్ 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైం నంబరు 243/2024లో ఐపీసీ సెక్షన్లు 166, 409, 427, 201, 120(బీ) రెడ్ విత్ 34. పీడీపీపీ యాక్ట్‌లోని సెక్షన్ 3, ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 65, 66, 66(ఎఫ్)(1)(బీ)(2) 70 కింద నమోదైన కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కొంత సమాచారం సేకరించాల్సి ఉందని తెలిపింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా పేర్కొంటున్న వారికి, ప్రత్యేకించి బీఆర్‌ఎస్ నాయకులకు జారీ చేస్తున్న నోటీసులు ఐపీసీ సెక్షన్ 160 సీఆర్‌పీసీ కింద ఉంటున్నాయి. ఈ సెక్షన్ దర్యాప్తు అధికారికి.. విచారణ సమయంలో సాక్షులు, సంబంధిత వ్యక్తులను హాజరు కావాలని ఆదేశించే అధికారాన్నిస్తుంది. ఈ సెక్షన్ కింద నోటీసులు అందుకున్న వ్యక్తి ఒకవేళ విచారణకు హాజరుకాకపోతే.. ఐపీసీలోని సెక్షన్ 174 కింద ఉద్దేశపూర్వకంగానే హాజరుకానట్లు భావించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించే అధికారం దర్యాప్తు అధికారులకు ఉంటుంది.
సంతోష్‌రావు నుంచే ఫోన్ నంబర్లు?
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు చేసిన పోలీస్ అధికారులను విచారించిన సమయంలో సిట్ కీలక సమాచారం సేకరించింది. వారి ఫోన్లు, ల్యాప్‌టా్‌పలను విశ్లేషించిన సమయంలోనూ కీలక ఆధారాలు సేకరించింది. నిందితులు తమ ఫోన్లను ఫార్మాట్ చేయించి మొత్తం సమాచారాన్ని తుడిచి పెట్టినా.. ఎఫ్‌ఎ్‌సఎల్‌కు పంపించి రిట్రీవ్ చేసి ఆ సమాచారాన్ని తిరిగి రాబట్టారు. కాగా, వారిని విచారించిన సమయంలో.. ఏ నంబర్‌ను ట్యాప్ చేయాలనే ఆదేశాలు అప్పటి ఎంపీ సంతోష్‌రావు నుంచే అందేవని గుర్తించినట్లు తెలిసింది. అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావుతోపాటు టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌రావు, ఎస్‌ఐబీలో డీఎస్పీలుగా పనిచేసిన ప్రణీత్‌రావు, మరికొందరికి సంతోష్‌రావు నుంచే ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో విచారణలో ఇదే అంశంపై ఆయనను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. సిట్ చీఫ్‌గా ఉన్న వీసీ సజ్జనార్ నేతృత్వంలో విచారణ క్రమం, అడగాల్సిన ప్రశ్నలకు సంబంధించి దర్యాప్తు అధికారులు ఒక ప్రణాళిక, ప్రశ్నావళి సిద్ధం చేసుకున్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్‌రావును కూడా సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉందని ‘ఆంధ్రజ్యోతి’ నాలుగు రోజుల క్రితమే చెప్పింది.
త్వరలో కేసీఆర్ వంతు?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు.. బీఆర్‌ఎస్ కీలక నేతలను ఒక్కొక్కరిని పిలిచి విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నారు. అవసరమైతే మరోసారి తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి పంపుతున్నారు. ఇప్పటివరకు మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ప్రశ్నించిన సిట్.. ఇప్పుడు సంతోష్‌రావు విచారణకు పిలిచింది. దీంతో త్వరలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సైతం నోటీసులు జారీ అవుతాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన నిందితులను విచారించిన సమయంలో.. తాము బిగ్‌బాస్ ఆదేశాల మేరకే పనిచేస్తామని వారు చెప్పుకొచ్చారు. దీంతో బిగ్‌బాస్ ఎవరనేది సిట్ ఇప్పటికే రాబట్టినట్లు, త్వరలోనే ఆయనకూ నోటీసులు జారీ చేసి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో.. నాటి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో కొన్ని ఆడియోలను బహిర్గతం చేశారు. ఆ ఆడియోలు సైతం ట్యాపింగ్ నుంచి సేకరించినవేనన్న ఆరోపణలున్నాయి. మొత్తంగా అన్ని ఆధారాల మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆఫర్లంటూ అడ్డగోలు ప్రచారం.. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో ఆకర్శించే రీల్స్.. మేడారానికి సిటీ బస్సులు..