హైదరాబాద్లో అగ్నిప్రమాదం.. క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్..
ABN , Publish Date - Nov 08 , 2026 | 05:27 PM
దీపావళి వేడుకల్లో అప్రమత్తంగా లేకుంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో సికింద్రాబాద్లోని సీతాఫల్మండి ఘటన మరోసారి చాటిచెప్పింది. ఓ రాకెట్ బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్రాకర్స్ భారీగా పేలిపోయాయి.
హైదరాబాద్, నవంబర్ 8: నగరంలోని సికింద్రాబాద్లో దీపావళి వేడుకల సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. సీతాఫల్మండిలో బాణసంచా కాలుస్తుండగా ఓ రాకెట్ అదుపు తప్పి సమీపంలోని క్రాకర్స్ దుకాణంలోకి దూసుకెళ్లింది. అప్పటికే పెద్ద మొత్తంలో బాణసంచా నిల్వ ఉండటంతో రాకెట్ నిప్పు తగలగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
దుకాణంలోని టపాసులన్నీ వరుసగా పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. చూస్తుండగానే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, పేలుళ్ల శబ్దాలతో భీతావహంగా మారింది. అనుకోని పరిణామంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ప్రమాద తీవ్రతను గమనించిన సమీపంలోని ప్రజలు.. వాహనదారులు అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. దీంతో సీతాఫల్మండిలో కొద్దిసేపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. బాణసంచా పేలుళ్ల కారణంగా మంటలు వేగంగా వ్యాపించినప్పటికీ సిబ్బంది తీవ్రంగా శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో దుకాణానికి జరిగిన ఆస్తి నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది. పండుగ వేళ చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. రాకెట్లు, ఇతర పేలుడు స్వభావం కలిగిన టపాసులు కాల్చేటప్పుడు పరిసరాలను గమనించడం, బాణసంచా దుకాణాలు, జనసంచారం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండటం ఎంతో ముఖ్యం. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే పండుగ వేడుకలు విషాదాలకు తావులేకుండా సురక్షితంగా సాగుతాయని అధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్రెడ్డి
జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు