రాయదుర్గం రహస్యం
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:33 AM
రాయదుర్గంలోని సర్వే నంబరు 83/1లో ఉన్న 5 ఎకరాల భూములకు టీజీఐఐసీ నిర్వహించిన వేలం వ్యవహరంలో ఎస్‌బీఐ హైకోర్టుకు వెళ్లడం వెనక రాజకీయ కోణం ఉందా.!
సర్కారుపై ఎస్‌బీఐ కేసు వెనక రాజకీయ కోణం
ఎస్‌బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టితో రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నాయకుల మంత్రాంగం
ఢిల్లీస్థాయిలో చక్రం తిప్పిన ఓ పార్టీ మాజీ మంత్రి, కీలక నేత
అందుకే ప్రత్యామ్నాయ భూమికి అంగీకారం తెలిపి హైకోర్టుకు..
మే 4న టీజీఐఐసీతో ఎస్‌బీఐ ప్రతినిధుల భేటీ.. ప్రత్యామ్నాయ భూములకు మౌఖిక సుముఖత.. 12న భూముల సందర్శన
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్షేత్రస్థాయి విచారణలో వెల్లడి
తాజా పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
ఎస్‌బీఐ చైర్మన్, రాజకీయ నేతల ఉమ్మడి డ్రామాగా భావన
ప్రధాని, ఆర్థిక మంత్రి, ఆర్బీఐకి ఫిర్యాదు చేయాలని యోచన
ముంబై నుంచి నేడు ఢిల్లీకి సీఎం.. కేంద్రంతో చర్చించే చాన్స్
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): రాయదుర్గంలోని సర్వే నంబరు 83/1లో ఉన్న 5 ఎకరాల భూములకు టీజీఐఐసీ నిర్వహించిన వేలం వ్యవహరంలో ఎస్‌బీఐ హైకోర్టుకు వెళ్లడం వెనక రాజకీయ కోణం ఉందా.! బ్యాంకు చైర్మన్, రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు కలిసే మంత్రాంగం నడిపారా? ఓ పార్టీకి చెందిన మాజీ మంత్రి, మరో కీలక నేత కలిసి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారా? అంటే.. ప్రభుత్వ వర్గాలు ఔననే చెబుతున్నాయి. అంతేనా.. వేలానికి ముందు వేరేచోట భూమి ఇస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన ఎస్‌బీఐ ఆ తర్వాత మాట మార్చిందని స్పష్టం చేస్తున్నాయి. ‘‘ఎస్‌బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టిది వనపర్తి జిల్లా. ఆ ప్రాంతానికి చెందిన ఒక మాజీ మంత్రితో ఆయనకు స్నేహం ఉంది. అక్కడి నుంచే రాజకీయం మొదలైంది. రాష్ట్ర రాజకీయాల్లో ఓ బ్యాంకు చైర్మన్ వేలు పెట్టారు. దీనిని మేం సీరియ్‌సగా పరిగణిస్తున్నాం’’ అని ప్రభుత్వంలోని కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ మొత్తం పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే భూముల విషయంలో ఎస్‌బీఐ వ్యవహరించిన తీరును ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు వివరించడంతోపాటు రాష్ట్రం తరపున ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఓ పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ముంబై వెళ్లిన సీఎం రేవంత్.. అటునుంచి అటే ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములను కేటాయించినందుకు సంబంధిత శాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పనున్నట్టు సమాచారం. అనంతరం ఎస్‌బీఐ అంశంపై పీఎం, కేంద్ర మంత్రి, ఆర్బీఐ గవర్నర్‌ను కలిసే అవకాశం ఉందని తెలిసింది.
రాజకీయ కోణంపై సర్కారు ఆరా
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం (పన్‌మక్త) దగ్గరున్న హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో 5 ఎకరాలకు టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎకరాకు రూ.237 కోట్ల రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. ఆ వేలం ప్రక్రియ ముగిసిన తర్వాత ఎస్‌బీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. వేలం పూర్తయ్యాక భూములు తమవేనంటూ బ్యాంకు ప్రతినిధులు హైకోర్టుకు వెళ్లడం వెనక రాజకీయ కుట్ర ఉందని, రాష్ట్రానికి చెందిన ఇద్దరు నాయకులు చక్రం తిప్పారన్న విషయం విచారణలో వెల్లడైందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎస్‌బీఐ చైర్మన్, ఆ రాజకీయ నాయకులు కలిసే డ్రామా చేస్తున్నారని కూడా తేలినట్టు సమాచారం. తమకు కేటాయించిన భూమిలో 16 ఏళ్లపాటు ఎటువంటి నిర్మాణాలు చేపట్టని ఎస్‌బీఐ.. ఇప్పుడు తమపై బురద చల్లుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్‌బీఐకి ప్రత్యామ్నాయంగా రూ.500 కోట్ల విలువ చేసే భూమిని కేటాయించడంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించిందని, ఆ స్థలాన్ని ఎస్‌బీఐ అధికారులు సందర్శించడంతోపాటు మౌఖికంగా దానిని తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కానీ, అనూహ్యంగా రెండు వారాల్లోనే మనసు మార్చుకొని కోర్టును ఆశ్రయించడం వెనక రాజకీయ హస్తం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దానిని ఆరా తీయగా.. ఎస్‌బీఐ చైర్మన్‌గా శ్రీనివాసులు శెట్టిది తెలంగాణ (ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మనోపాడ్ మండలం పెద్ద పోతులపాడు) కావడం, ఆయన ప్రస్తుత వనపర్తి జిల్లా వాసి కావడం, స్థానిక రాజకీయ పరిచయాలకు ప్రభావితమై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం గుర్తించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 16 ఏళ్లపాటు తమకు కేటాయించిన భూమిని వినియోగించుకోని ఎస్‌బీఐ.. ఇప్పుడు మాత్రం అదే భూమి కావాలంటూ కోర్టుకు వెళ్లడానికి ఇదే కారణమని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌బీఐతో చేస్తున్న అన్ని లావాదేవీలను ఉపసంహరించుకోవాలనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చిందని, దానికున్న ‘లీడ్ బ్యాంకు’ హోదాను కూడా మరో బ్యాంకుకు ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలిసింది.
అంగీకరించింది రీజియన్ ప్రతినిధులు.. మంత్రాంగం ముంబైలో!
ప్రత్యామ్నాయ భూములను తీసుకునేందుకు అంగీకారం తెలిపి ఎస్‌బీఐ హైకోర్టుకు ఎందుకు వెళ్లిందనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసింది. ప్రత్యామ్నాయ భూములకు తెలంగాణ రీజియన్‌కు చెందిన ప్రతినిధులు మౌఖికంగా అంగీకారం చెప్పారు. కానీ, రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులు బ్యాంకుకు చెందిన ముఖ్య, కీలక అధికారితో ముంబైలో మంత్రాంగం నడిపినట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది. అందుకే.. ప్రత్యామ్నాయ ప్రతిపాదనను పక్కనబెట్టి, వేలం వేసిన భూములపై ఎవరికీ హక్కులు ఉండవంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని భావిస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ కూడా ఎస్‌బీఐ పూర్తి వివరాలను వెల్లడించలేదని ప్రభుత్వం గుర్తించింది. నిజానికి, సదరు ఐదెకరాల భూమిని ప్రభుత్వమే తమకు విక్రయించిందని, 2010లోరూ.13.33 కోట్లకు ఆ భూములు కొనుగోలు చేశామని, ఆ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం జరిగినట్లు పిటిషన్‌లో ఎస్‌బీఐ పేర్కొంది. కానీ, టీజీఐఐసీ- ఎస్‌బీఐ మధ్య కొద్ది కాలంగా ఉత్తర ప్రత్యుత్తరాలు, సమావేశాలు జరిగాయని, ఆ అంశాలను బ్యాంకు పిటిషన్‌లో పేర్కొనలేదని ప్రభుత్వం గుర్తించింది. నిజానికి, 2010లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో భూ కేటాయింపు రద్దు చేసింది. దానిపై ఎస్‌బీఐ కోర్టుకెక్కింది. దాంతో, ప్రత్యామ్నాయ భూమిని ఇస్తామని ప్రభుత్వం బ్యాంకుకు తెలిపింది. ఉస్మాన్‌నగర్, గండిపేట ప్రాంతాల్లో ఇవ్వాలని టీజీఐఐసీకి 2021 సెప్టెంబరు 6న రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కోర్టు కేసును ఉపసంహరించుకుని ప్రత్యామ్నాయ భూమికి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం 2023 మార్చి 15న ఎస్‌బీఐకి లేఖ రాసింది. ఆ తర్వాత 2026 మే 4న ఎస్‌బీఐతో టీజీఐఐసీ సమావేశమైంది. ప్రత్యామ్నాయ భూమి తీసుకునేందుకు బ్యాంకు ప్రతినిధులు మౌఖికంగా సుముఖత వ్యక్తం చేశారని తెలుపుతూ టీజీఐఐసీ మే 5న ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎస్‌బీఐ ప్రతినిధులు 2026 మే 12న కూడా ప్రత్యామ్నాయ భూములను సందర్శించారు. ఆ తర్వాతే టీజీఐఐసీ వేలం నిర్వహించింది. ఈ విషయాలను పిటిషన్లో ఎస్‌బీఐ పేర్కొనలేదని ప్రభుత్వం భావిస్తోంది.
ఎప్పుడేం జరిగిందంటే..
2010లో రాయదుర్గంలో ఎకరం రూ.40 కోట్లు పలుకుతోంది. కార్యాలయ నిర్మాణం, ఇతర కార్యకలాపాల కోసం 2010లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవోఆర్‌టీ నం 501 ద్వారా సర్వే నం 83/1లో 5 ఎకరాలను ఎస్‌బీహెచ్‌కు రూ.13.30 కోట్లకు కేటాయించింది.
2011 జనవరి 12న రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌బీహెచ్ మధ్య భూ విక్రయ ఒప్పందం జరిగింది. భూమిని ప్రభుత్వం ఎస్‌బీహెచ్‌కు అప్పగించింది.
ఏడాది తర్వాత కూడా ఎటువంటి నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో 2012 సెప్టెంబరు 13న ఏపీఐఐసీ ఎస్‌బీహెచ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
నిర్మాణాలకు మరింత సమయం కోరుతూ ఎస్‌బీహెచ్ 2016 మార్చి 30న ప్రభుత్వాన్ని కోరింది. ప్రాజెక్టు అమలుకు మరింత గడువు కోరుతూ 2016 జూన్ 27న ప్రభుత్వానికి లేఖ రాసింది.
(ఎస్‌బీహెచ్ 2017 ఏప్రిల్ 1న ఎస్‌బీఐలో విలీనమైంది.)
కార్యాలయ నిర్మాణం, ఇతర కార్యకలాపాలకు ఎస్‌బీఐకి కేటాయించిన భూమిని నిబంధనల ప్రకారం ఉపయోగించనందున భూ కేటాయింపు రద్దుకు అనుమతించాలని టీఎస్‌ఐఐసీ ప్రభుత్వానికి 2019 మే 27న నివేదిక సమర్పించింది.
తమ ప్రాజెక్టు అమలుకు చివరి అవకాశం ఇవ్వాలని ఎస్‌బీఐ 2020 జూలై 2న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
15 రోజుల్లోగా ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన షెడ్యూలును సమర్పించాలని జూలై 30న రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌బీఐకి తుది షోకాజ్ నోటీసు జారీ చేసింది. దానిపై 2020 ఆగస్టు 18న ఎస్‌బీఐ నుంచి టీఎస్‌ఐఐసీకి లేఖ అందింది. దానిపై సెప్టెంబరు 1న టీఎస్‌ఐఐసీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.
పదేళ్లు పూర్తయినా కేటాయించిన భూమిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో 2021 జనవరి 22న రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌బీఐకి భూ కేటాయింపును రద్దు చేసింది.
భూ కేటాయింపు రద్దును ఉపసంహరించుకోవాలని 2021 ఏప్రిల్ 27న ఎస్‌బీఐ లేఖ రాసింది.
భూ కేటాయింపు రద్దును సవాల్ చేస్తూ ఎస్‌బీఐ 2021 జూన్ 1న హైకోర్టులో (రిట్ పిటిషన్ నెం: 2725/2021) పిటిషన్ వేసింది.
ఎస్‌బీఐ లేఖను పున:పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.
ఉస్మాన్‌నగర్, గండిపేటల్లో ఎస్‌బీఐకి ప్రత్యామ్నాయ ప్లాట్ ఇవ్వాలని టీఎస్‌ఐఐసీకి 2021 సెప్టెంబరు 6న రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
కోర్టు కేసును ఉపసంహరించుకుని ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం 2023 మార్చి 15న ఎస్‌బీఐకి లేఖ రాసింది.
ఎస్‌బీఐకు కేటాయించిన భూమి క్యాన్సిలేషన్ డీడ్ అమలును నమోదు చేయాలని, ప్రత్యామ్నాయ ప్లాట్ కేటాయింపుపై ఆదేశాలు జారీ చేయాలని టీజీఐఐసీ 2024 ఆగస్టు 21న ప్రభుత్వానికి నివేదించింది. (2024 ఏప్రిల్ నెలలో టీఎస్‌ఐఐసీని టీజీఐఐసీగా మార్చారు)
భూ కేటాయింపు పునరుద్ధరణ అభ్యర్థనను తిరస్కరించామని, విక్రయ ఒప్పందం రద్దు అమలుకు ముందుకు రావాలని ప్రభుత్వం 2024 డిసెంబరు 9న ఎస్‌బీఐకి లేఖ రాసింది. ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపునకు కొత్త దరఖాస్తును సమర్పించాలని సూచించింది.
భూ కేటాయింపు రద్దును ఉపసంహరించుకొని, తమకు మొదట కేటాయించిన భూమి విషయంలో జోక్యం చేసుకోవద్దని ఎస్‌బీఐ హైకోర్టులో 2024 డిసెంబరు 18న (నం: 35923/2024) పిటిషన్ దాఖలు చేసింది.
కాల పరిమితి ముగిసినప్పటికీ ఎస్‌బీఐ ప్రతిపాదనలను పరిశీలించేందుకు 4 వారాల సమయం కేటాయించాలంటూ హైకోర్టు 2025 ఫిబ్రవరి 24న కేసును డిస్పోజ్ చేసింది.
ఎస్‌బీఐ ప్రతిపాదనలు వినాలనే హైకోర్టు ఉత్తర్వుల మేరకు విచారణకు హాజరుకావాలని ఎస్‌బీఐకి 2026 మే 4న టీజీఐఐసీ నోటీసులు జారీ చేసింది.
ఆ రోజు జరిగిన సమావేశంలో రెండున్నర ఎకరాల ప్రత్యా మ్నాయ భూమి తీసుకునేందుకు ఎస్‌బీఐ అధికారులు మౌఖికంగా సుముఖత వ్యక్తం చేశారు. ఈ అంశంపై టీజీఐఐసీ ఎండీ మే 5న ప్రభుత్వానికి లేఖ రాశారు.
ప్రత్యామ్నాయ భూమి తీసుకునేందుకు ఎస్‌బీఐ సుముఖత వ్యక్తం చేయడంతో రాయదుర్గం సర్వే నం: 83/1 లోని 5 ఎకరాల భూమిని ఈ-వేలం వేసేందుకు మే 6న ప్రభుత్వం నోటీసు జారీ చేసింది.
ఎస్‌బీఐ అధికారులు మే 12న ప్రత్యామ్నాయ స్థలాన్ని సందర్శించారు. దీనిపై హెడ్ ఆఫీస్‌లో టీజీఐఐసీ అధికారులతో మాట్లాడారు.
ప్రత్యామ్నాయ భూమి తీసుకోవాలన్న ప్రభుత్వ వినతిని మే 20న ఎస్‌బీఐ తిరస్కరించింది. ఈ మేరకు మే 27న లేఖ రాసింది. అది మే 29న టీజీఐఐసికి అందింది.
మే 28న టీజీఐఐసీ ఈ-వేలం నిర్వహించింది.
ప్రత్యామ్నాయ స్థలంపై ఎస్‌బీఐ అధికారుల మౌఖిక అంగీకారం తెలపడంతోపాటు దానిని సందర్శించిన విషయాన్ని టీజీఐఐసీ మే 29న బ్యాంకుకు ఈ-మెయిల్ పంపింది.