Share News

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం.. సరస్ మేళాలో మంత్రి సీతక్క కీలక ప్రకటన

ABN , Publish Date - Oct 11 , 2026 | 09:55 PM

హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సరస్ మేళాలో మంత్రి సీతక్క మహిళా సంఘాల అభివృద్ధిపై కీలక ప్రకటన చేశారు. శిల్పారామం పక్కన ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్‌లో 106 షాపులను మహిళా సంఘాలకు కేటాయించినట్లు వెల్లడించారు.

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం.. సరస్ మేళాలో మంత్రి సీతక్క కీలక ప్రకటన
SARAS Mela Women Empowerment

SARAS Mela Women Empowerment: మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న 'సరస్ మేళా'కు మంత్రి సీతక్క హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు.

రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ ఈ సందర్భంగా మంత్రి సీతక్క బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబం సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల ఆర్థిక ఎదుగుదల ద్వారానే గ్రామీణ పేదరికం నిర్మూలన సాధ్యమవుతుందని, ఆ ఉద్దేశంతోనే ప్రతి ఏటా 'సరస్ మేళా'ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మహిళలకు రూ. 67 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేసిందని, మహిళలే స్వయంగా వ్యాపారాలను విజయవంతంగా నడిపిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

శిల్పారామం పక్కన ఏర్పాటు చేసిన 'ఇందిరా మహిళా శక్తి బజార్‌'లో 106 షాపులను మహిళా సంఘాలకు కేటాయించామని, రాష్ట్రవ్యాప్తంగా 22 'ఇందిరా మహిళా శక్తి భవనాలను' అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ: పవన్ కల్యాణ్

తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సిబ్బందికి ప్రమాదం

Updated Date - Oct 11 , 2026 | 09:55 PM