సంగారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ.. మామను హత్య చేసిన అల్లుడు?
ABN , Publish Date - Oct 11 , 2026 | 04:21 PM
సంగారెడ్డి జిల్లా తూముకుంట అటవీ ప్రాంతంలో ఆటో డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో మిస్టరీ వీడింది. కుటుంబ కలహాలే హత్యకు కారణమని తెలుస్తోంది. ఈ కేసులో అల్లుడు బస్వరాజ్ సహా ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.
Sangareddy Srinivas Murder Case: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం తూముకుంట అటవీ ప్రాంతంలో ఇటీవల కలకలం సృష్టించిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్ హత్య ఉదంతానికి సంబంధించి పోలీసులు మిస్టరీని ఛేదించారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యగా తేల్చారు. ఈ దారుణానికి పాల్పడింది ఎవరో కాదు.. స్వయంగా ఆటో డ్రైవర్ అల్లుడే కావడం గమనార్హం.
కుటుంబ కలహాలు, కోర్టు పిటిషన్
కొన్నేళ్ల క్రితం వికారాబాద్ జిల్లాకు చెందిన బస్వరాజ్‌కు ఆటో డ్రైవర్ శ్రీనివాస్ తన కూతుర్నిచ్చి వివాహం చేశారు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో, శ్రీనివాస్ కూతురు కొన్ని నెలల క్రితం పుట్టింటికి వచ్చేసింది. అంతేకాకుండా భరణం కింద భర్త బస్వరాజ్ ఆస్తిలో సగం ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
కోర్టులో కేసు వేయడం, భార్య వైపు నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో అల్లుడు బస్వరాజ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా మామ శ్రీనివాస్‌పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా మామను అంతుమొందించాలని తన స్నేహితులతో కలిసి ప్లాన్ పక్కాగా వేశాడు.
ఈ నెల 7వ తేదీన బస్వరాజ్ స్నేహితులు పథకం ప్రకారం శ్రీనివాస్ ఆటోను కిరాయికి మాట్లాడారు. దారి మధ్యలో మద్యం సేవించి, తూముకుంట శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి ఆటోను తీసుకెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన అల్లుడు బస్వరాజ్, తన స్నేహితులతో కలిసి మామ శ్రీనివాస్‌పై తీవ్రంగా దాడి చేసి హత్య చేశాడు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు హత్య అనంతరం శ్రీనివాస్ మృతదేహంతో పాటు ఆటోపై పెట్రోల్ పోసి తగలబెట్టి నిందితులు పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు వేగవంతం చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఈ వార్తలూ చదవండి
బీసీసీఐకి గంభీర్ హెచ్చరిక.. పిచ్‌లు మారకపోతే భారత క్రికెట్‌కు నష్టమే!
ఆటగాళ్ల మార్పులే అసలు సమస్య.. గంభీర్‌పై సీఎస్కే మాజీ స్టార్ విమర్శలు