మూసీ సుందరీకరణతో నయా హైదరాబాద్
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:16 AM
తెలంగాణ రాష్ట్రం చారిత్రక మార్పు దిశగా అడుగులేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్.. కేవలం ఆర్థిక కేటాయింపుల కోసమే కాదు. అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి....
క్యూర్, ప్యూర్, రేర్ జోన్లతో వేగంగా అభివృద్ధి.. సంస్కరణలతో ప్రజలకు విస్తృత అవకాశాలు
వరల్డ్ గ్లోబల్ హబ్‌గా కోర్ అర్బన్ రీజియన్
జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో క్యూర్ చట్టం
రూ.4,903 కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లు
అసెంబ్లీలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగం
సీఎం, మంత్రుల కితాబు.. బీఆర్‌ఎస్ నిరసన
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ రాష్ట్రం చారిత్రక మార్పు దిశగా అడుగులేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్.. కేవలం ఆర్థిక కేటాయింపుల కోసమే కాదు. అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి మార్గదర్శనం. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలను తీర్చేందుకు.. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడే రోడ్ మ్యాప్’ అని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా వెల్లడించారు. ఆవిష్కరణల్లో అగ్రగామిగా, బలహీన వర్గాలకు భరోసాగా, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే తెలంగాణను నిర్మించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గవర్నర్ మాట్లాడుతున్న సమయంలో నిరసన తెలుపుతూ బీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు చేయగా... ప్రసంగాన్ని సమర్థిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంచుకునే ప్రతి పాలసీ, అమలు చేస్తున్న ప్రతి సంస్కరణ ఈ ప్రాంత ప్రజలకు విస్తృత అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. వికసిత్ భారత్-2047విజన్‌కు అనుగుణంగా తెలంగాణ రైజింగ్-2047 విజన్‌ను ప్రభుత్వం రూపొందించిందని పేర్కొన్నారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను రూపొందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2025-26లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) రూ. 17.82 లక్షల కోట్లు కాగా, 10.7శాతం వృద్ధి రేటు నమోదైందని చెప్పారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.99 శాతం ఉండగా... రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కి చేరుకుందని వివరించారు. గవర్నర్ ప్రసంగం పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..
క్యూర్, ప్యూర్, రేర్.. వ్యూహం
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా, సమతుల్యంగా, సమ్మిళితంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా, క్యూర్, ప్యూర్, రేర్ పేరిట వికేంద్రీకృత వ్యూహాన్ని అనుసరిస్తోంది. నెట్ జీరో సిటీగా, వరల్డ్ గ్లోబల్ హబ్‌గా కోర్ అర్బన్ రీజియన్(క్యూర్)ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న పెరీ అర్బన్ రీజియన్(ప్యూర్)ను మాన్యుఫ్యాక్చర్, లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇక, రూరల్ అగ్రి రీజియన్(రేర్)లో వ్యవసాయ అనుకూల విధానాలు, ఎకో టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలను నెలకొల్పాలని యోచిస్తోంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్‌ను సైబరాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లుగా విభజించింది. పునఃవ్యవస్థీకరణతో నగర పాలనను ప్రజలకు మరింత చేరువ చేయనుంది. ఇప్పుడున్న జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో కొత్తగా క్యూర్ చట్టాన్ని తీసుకురానుంది. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు, హైడ్రాను ఒకటే పాలనా పరిధిలోకి తేనుంది. హిల్ట్ పాలసీతో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు బయటకు తరలించాలని నిర్ణయించింది. మూసీ, ఈసా నదుల సంగమం వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. 55 కిలోమీటర్ల మేర మూసీ సుందరీకరణతో నయా హైదరాబాద్ ఆవిష్కృతం కానుంది. గోదావరి నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు అనుసంధానం చేసి, 2.5 టీఎంసీల నీటితో మూసీకి జీవం పోయనుంది. ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరచడానికి రేడియల్ రోడ్లను నిర్మించే ప్రతిపాదనలున్నాయి. ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి వరంగల్, ఆదిలాబాద్‌లో విమానాశ్రయాలను వేగంగా నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే ఫ్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస విధంగా ప్యూచర్ సిటీ కోసం దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్‌ను రూపొందించే ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం గర్వకారణం.
15.12లక్షల కొత్త రేషన్‌కార్డులు
రాష్ట్రవ్యాప్తంగా 15.12లక్షల కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఫలితంగా రాష్ట్రంలోని 3.38కోట్ల మంది ప్రజా పంపిణీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇప్పటివరకు 3,24,536 ఇళ్లు మంజూరు చేయగా... 2,62,449 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు 269కోట్ల జీరో టికెట్లు ఇచ్చాం. గృహ జ్యోతి కింద 53.09 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల మేర ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. దీనికి రూ.3,900 కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్రంలో యంగ్‌ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూళ్ల నిర్మాణానికి ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంక్ నుంచి రూ.4,903 కోట్ల రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ఏటా 11,000 కోట్లు ఖర్చు చేస్తోంది. వరంగల్ హెల్త్ సిటీ, సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీ నగర్‌లో టిమ్స్ ఆస్పత్రులు, ఉస్మానియా ఆస్పత్రి, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం కొనసాగుతోంది. డ్రగ్స్ ముప్పును ఎదుర్కునేందుకు ఈగల్‌ను ఏర్పాటు చేసింది. ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.