రాజ్యాంగంపై దుష్ట చతుష్టయం దాడి
ABN , Publish Date - Nov 27 , 2026 | 04:27 AM
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుష్ట చతుష్టయంగా అభివర్ణించారు.
మోదీని ఓడిస్తేనే రాజ్యాంగానికి రక్షణ
టీపీసీసీ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో రేవంత్
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుష్ట చతుష్టయంగా అభివర్ణించారు. ఈ దుష్ట చతుష్టయం అధికారాన్ని శాశ్వతం చేసుకుని దేశ సంపదను కొల్లగొట్టాలని చూస్తోందని, ఇందుకు అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగంపైనే దాడి చేస్తోందని ఆరోపించారు. 2029 ఎన్నికల్లో మోదీని ఓడిస్తేనే రాజ్యాంగానికి రక్షణ లభిస్తుందన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ పోరాటం కాదని, దేశ ప్రజల ఉనికి, మనుగడ, హక్కులకు సంబంధించిన పోరాటమని చెప్పారు. గాడ్సే వారసులను ఓడించాలంటే దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి కోటి ఓట్లు, 90 అసెంబ్లీ, 15 లోక్‌సభ సీట్లు సాధించేందుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏఐసీసీ పిలుపుమేరకు గురువారం ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సందీ్‌పకుమార్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్, వాకిటి శ్రీహరి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘స్విస్ ఖాతాల్లోని నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తానని, ఏటా రెండు కోట్ల ఉద్యాగాలిస్తానని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాననే ఉత్తుత్తి హామీలు, మోసపూరిత ప్రసంగాలతో మోదీ మొదటిసారి ప్రధాని అయ్యారు. రెండోసారి మరికొన్ని అబద్ధాలు ఆడి ఎన్నికల్లో గెలిచారు. భాష, ప్రాంతం, మతం పేరిట ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చి, ఉత్తర.. దక్షిణ భారతమనే విభజన తీసుకొచ్చి మూడోసారి ప్రధాని అయ్యారు. నాలుగోసారీ అధికారం కోసం ఇప్పుడు దుష్ట చతుష్టయం ఆలోచన చేస్తోంది. ఇప్పటికే దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించారు. మరో ఏడు కోట్ల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని ధ్వజమెత్తారు.
దళితులు, గిరిజనులు, పేదలు, చదువు రానివారికి ఓటు హక్కు ఇవ్వొద్దని, కొద్దిమంది ఉన్నత వర్గాలు, శ్రీమంతులు, పెద్దలకే ఓటు హక్కు ఉండాలని బీజేపీ సిద్ధాంతకర్తలు (ఆర్‌ఎ్‌సఎస్) రాజ్యాంగ రచన సమయంలో వాదించారని, అయితే, తన జాతికి తాను ఇవ్వగలిగిన హక్కు ఓటు హక్కు అని, నిరుపేద అయిన దళితునికి, దేశ ప్రధానికీ సమానమైన విలువ ఉండే ఓటు హక్కును ఇవ్వడమే తన జాతికి గౌరవాన్ని తెచ్చిపెడుతుందని ఆనాడు అంబేడ్కర్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉండే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీల ఓటు హక్కును తొలగిస్తున్నారని తప్పుబట్టారు. దేశంలో 20 కోట్ల ఓట్లను తొలగించడం ద్వారా మోదీ అధికారాన్ని శాశ్వతం చేయాలన్న కుట్ర జరుగుతోందని, మోదీని, మోదీ గడీని బద్దలు కొట్టి రాజ్యాంగాన్ని కాపాడే పోరాటానికి రాహుల్ నాయకత్వం వహిస్తున్నారని వివరించారు. రాజ్యాంగాన్ని నిలబెట్టేందుకు ఖర్గే, రాహుల్, సోనియా, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ పంచపాండవుల లెక్క ఓవైపు ఉంటే.. గాడ్సే వారసత్వాన్ని తీసుకు రావాలని సంఘ్ పరివార్ వైపు మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ వంటి కౌరవులు నిలబడ్డారని వ్యాఖ్యానించారు. ‘‘స్వాతంత్య్రం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ అయితే అధికారం కోసం పుట్టిన పార్టీ బీజేపీ. 50 ఏళ్ల కిందట లేని బీజేపీ.. పాతికేళ్ల తర్వాత ఉంటదో, ఉండదో ఆ దేవునికే ఎరుక. కానీ, 141 ఏళ్ల కిందట పుట్టిన కాంగ్రెస్.. నిన్న ఉంది.. నేడు ఉంది.. రేపూ ఉంటుంది.’’ అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని ఓడిస్తేనే రాజ్యాంగానికి శాశ్వతరక్షణ లభిస్తుందన్నారు. తాము పాలకులం కాదని, సేవకులమని, రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కు ద్వారానే ముఖ్యమంత్రిగా సేవ చేసే భాగ్యం తనకు కలిగిందని చెప్పారు. ‘‘ఈనాడు మీరంతా అభిమానంతో ‘రేవంత్ అన్న’ అని గట్టిగా పిలిచి, మీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. కాబట్టే పేదల ప్రతినిధిగా మేం ఈ వేదికపై ఉన్నాం’’ అని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ పరిరక్షణకు మరో
ఉద్యమానికి సిద్ధం కావాలి: భట్టి
రాజ్యాంగ పరిరక్షణ కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని శ్రేణులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చి, ఏక వ్యక్తి పాలన ద్వారా నిరంకుశ విధానాలను తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, దానిని అడ్డుకోవడానికి రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ నిరంతరం పోరాడుతోందని చెప్పారు.
సీఎం రేవంత్ నాయకత్వంలో సామాజిక న్యాయం అమలవుతోంది: సందీప్‌కుమార్
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు కృషి చేస్తోందని, ఈ ప్రభుత్వం చేసిన సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచిందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సందీ్‌పకుమార్ కితాబునిచ్చారు. ‘‘13 ఏళ్లుగా భారత రాజ్యాం గం ఇబ్బందుల్లో పడింది. లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్ జై కిసాన్’ అంటే.. మోదీ నల్లచట్టాలు తెచ్చి రైతుల్ని చంపేస్తున్నారు. ఇందిర ‘గరీబీ హఠావో’ అంటే.. మోదీ పేదలను బతకకుండా చేస్తున్నారు’’ అని ధ్వజమెత్తారు. పార్టీ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్చుకోలేకపోతున్న బీజేపీ.. కౌంటర్ ర్యాలీలు చేస్తోందని, ఆ పార్టీ ఎన్ని కౌంటర్ ర్యాలీలు చేసినా ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై బండి సంజయ్ వ్యాఖ్యలు సరికావన్నారు.
ఉత్సాహంగా రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ
కవాడిగూడ, ఖైరతాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): అగ్ర నేతలంతా పాల్గొనడంతో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నేతలు.. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో సీఎం, మంత్రులు పాల్గొనడంతోపాటు పెద్దఎత్తున కాంగ్రెస్, శ్రేణులు, పౌరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ నెల 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. తెరపైకి పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులు?
రాహుల్ గాంధీ ఫొటో పెడితే బ్లాక్ చేస్తున్నారు.. మెటాపై కోర్టుకెక్కిన కాంగ్రెస్