Share News

ఆ భూముల విలువ రూ.33 వేల కోట్లు

ABN , Publish Date - Oct 30 , 2026 | 02:36 AM

మియాపూర్‌ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనన్న సుప్రీంకోర్టు తీర్పుతో.. 550 ఎకరాలకుపైగా ఉన్న ఆ భూములు ఇక మీదట ప్రభుత్వానికి బంగారుకొండలా మారనున్నాయి

ఆ భూముల విలువ రూ.33 వేల కోట్లు
CM Revanth Reddy

  • ప్రభుత్వానికి బంగారుకొండ.. మియాపూర్‌ భూములు

  • సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసిన 23 ఏళ్ల న్యాయపోరాటం

  • సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ

హైదరాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మియాపూర్‌ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనన్న సుప్రీంకోర్టు తీర్పుతో.. 550 ఎకరాలకుపైగా ఉన్న ఆ భూములు ఇక మీదట ప్రభుత్వానికి బంగారుకొండలా మారనున్నాయి. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ ఏకంగా రూ.33 వేల కోట్లపైనే ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ ఎకరా రూ.60 కోట్లు పలుకుతోందంటున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌ పరిధిలో.. మియాపూర్‌-బొల్లారం రోడ్డులో జేపీ నగర్‌కు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు 100, 101లలో ఈ భూములున్నాయి. 2003లో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కొందరు ప్రైవేటు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ న్యాయవివాదం 23 ఏళ్లపాటు కొనసాగింది. గురువారం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో దీనికి తెరపడినట్లయ్యింది. రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న న్యాయ వివాదానికి ముగింపు లభించిందని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సుప్రీం తీర్పును ప్రభుత్వ భూముల పరిరక్షణ దిశగా కీలక పరిణామంగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇతర ప్రభుత్వ భూముల వివాదాల పరిష్కారంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నాయి.


సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ

మియాపూర్‌ భూముల అంశంలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. అత్యంత విలువైన ఈ ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు న్యాయపరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. స్వయంగా రేవంత్‌రెడ్డి పర్యవేక్షణలో ప్రభుత్వ యంత్రాంగం, న్యాయ నిపుణులు సమన్వయంతో కదిలారని ఆ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ పక్షాన సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ సమర్థవంతమైన వాదనలు వినిపించారు. మియాపూర్‌ భూములు ప్రభుత్వానికే చెందుతాయని స్పష్టం చేసే పాత రెవెన్యూ రికార్డులు, సేత్వార్‌, క్లాసర్‌ రిజిస్టర్‌, గత న్యాయస్థానాల తీర్పులను ప్రభుత్వం సమర్పించింది. ప్రైవేటు వ్యక్తులు హక్కులు కోరుతూ చూపిన రెవెన్యూ ఎంట్రీల్లో అవకతవకలు ఉన్నాయంటూ గత న్యాయస్థానాలు గుర్తించిన అంశాలను ప్రభుత్వ వాదనల్లో ప్రస్తావించారు. ఈ పకడ్బందీ ప్రయత్నాలతోనే తాజా విజయం లభించిందని రెవెన్యూ వర్గాలు పేర్కొన్నాయి.

దశాబ్దాల నాటి వివాదం

మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101లోని భూములపై నెలకొన్న వివాదం దశాబ్దాల నాటిది. ఈ భూములపై తమకు హక్కులున్నాయని కొందరు ప్రైవేటు వ్యక్తులు, సహకార గృహ నిర్మాణ సంఘాలు వాదించగా, ఇవి పూర్తిగా ప్రభుత్వ భూములేనని సర్కారు పేర్కొంది. ఈ క్రమంలో భూముల స్వభావం, రెవెన్యూ రికార్డులు, యాజమాన్య హక్కులపై న్యాయపోరాటం మొదలైంది. భూ ఆక్రమణల నిరోధక చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం.. 1990 దశకంలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చింది. వీటిని సవాలు చేస్తూ ప్రైవేటు పక్షాలు హైకోర్టును ఆశ్రయించాయి. 2003 ఏప్రిల్‌ 16న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పును వెలువరించింది. సర్వే నంబర్‌ 100, 101లలోని భూములు ప్రభుత్వానివేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ప్రైవేటు పక్షాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. అక్కడ సుదీర్ఘకాలంపాటు వాదోపవాదాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా గురువారం తుదితీర్పు వెలువడింది.


కొంత భూమిలో అక్కడక్కాడా నివాసాలు

మియాపూర్‌ భూముల్లో 480 ఎకరాలు ఇప్పటికీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండగా.. మరో 70 ఎకరాల్లో అక్కడక్కడా నివాసాలు ఏర్పాటయ్యాయి. ప్రశాంత్‌నగర్‌ సహకార హౌసింగ్‌ సొసైటీ పేరుతో సుమారు 20 ఎకరాల్లో 150 నివాసాల వరకు ఉన్నాయని రెవెన్యూ అధికారులు తెలిపారు

ఈ వార్తలు కూడా చదవండి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!

ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు

Updated Date - Oct 30 , 2026 | 02:41 AM