Share News

కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయండి

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:50 AM

బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్‌ బంధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శరీరాలు వేరైనా వాటి ప్రాణం ఒక్కటేనన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు..

కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయండి

  • బీజేపీకి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌

  • బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల శరీరాలే వేరు.. ప్రాణం ఒక్కటే

  • కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు అతీగతీ లేదు

  • లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ చచ్చి.. బీజేపీకి అవయవదానం చేసింది

  • బదులుగా బీఆర్‌ఎస్‌ నేతల్ని కాపాడుతూ ప్రొటెక్షన్‌ మనీ

  • రాష్ట్రానికి ఏమిచ్చారని నితిన్‌ నబీన్‌ను తీసుకొచ్చారు?

  • చొప్పదండి ప్రగతిబాట సభలో బీజేపీపై సీఎం ధ్వజం

  • ఔటర్‌తో కరీంనగర్‌, వరంగల్‌ను కలుపుతామని వెల్లడి

కరీంనగర్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్‌ బంధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శరీరాలు వేరైనా వాటి ప్రాణం ఒక్కటేనన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్‌ వద్ద గురువారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే ఆరు నెలలైనా దానికి అతీగతీ లేదన్నారు. దీని వెనక ఉన్న మర్మమేమిటో చెప్పాలని బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతలను కాపాడుతూ ప్రొటెక్షన్‌ మనీ తీసుకుంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకొని కొల్లగొట్టారని, ప్రధాని మోదీ, అమిత్‌ షా ఆరోపించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ‘మీకు ప్రధాని వద్ద పరపతి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్‌ను, హరీశ్‌ను, కార్ల దందాలో కేటీఆర్‌ను బొక్కలో వేయాలి. మా వాళ్లను బెదిరించడం కాదు’ అని కేంద్రమంత్రి బండి సంజయ్‌కు సవాల్‌ విసిరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కరీంనగర్‌ కీలకపాత్ర పోషించిందని, ఈ గడ్డపై ఏర్పాటు చేసిన సభలోనే తెలంగాణ ప్రజల ఆవేదనను, ఆకాంక్షను తెలుసుకున్న సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇస్తామని ప్రకటించారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఆంధ్రా పెట్టుబడిదారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని రేవంత్‌ చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులు వేల కోట్లు సంపాదించుకున్నారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ప్రజాపాలన అందిస్తుంటే కుటుంబమంతా ఒక్కటై విషం చిమ్ముతున్నారని, దిగిపో అంటూ దాడి చేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న పాలమూరుకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు గతంలో ప్రధాని మోదీ పాలమూరు పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని ఇచ్చిన హామీపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకొని బీజేపీ జాతీయ నాయకులు ప్రచారానికి వస్తున్నారని నిలదీశారు. ఎంత మందిని తీసుకొచ్చినా రాష్ట్రంలో ఒక్క మునిసిపాలిటీ కూడా గెలవలేరన్నారు. తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ తప్ప ఏమీ ఇవ్వలేదని విమర్శించారు.


రెండేళ్లలో ఎన్నో చేశాం..

రెండేళ్లలో ఏం చేశారని మాట్లాడుతున్నారని.. పదేళ్ల బీఆర్‌ఎస్‌, పన్నెండేళ్ల బీజేపీ పాలనలో ఏం చేశారని రేవంత్‌ ప్రశ్నించారు. తాము చేసింది చెబితే గుండెలు పగిలి చస్తారన్నారు. రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు కల్పించామని, హాస్టల్‌, గురుకుల విద్యార్థుల మెస్‌ చార్జీలను 40ు పెంచామని, కాస్మెటిక్‌ చార్జీలను 200ు పెంచామని చెప్పారు. రూ.25 వేల కోట్లతో 100 యంగ్‌ ఇండియా స్కూళ్లు నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు అల్పాహారం అందిస్తామని తెలిపారు. చొప్పదండిలో డిగ్రీ కళాశాల, హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్‌, లా కళాశాల, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో యూనివర్సిటీలను ఏర్పాటు చేశామని వివరించారు. 25.3 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేశామని, తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు ఇచ్చామని తెలిపారు. వ్యవసాయరంగానికి రూ.1.15 లక్షల కోట్లు వెచ్చించామని, వ్యవసాయాన్ని పండగ చేశామని చెప్పారు. సభకు వచ్చిన అక్కల చీరలు చూస్తుంటే పాల పిట్ట చీరల్లా ఉన్నాయని, తమ్ముడు వచ్చి సారె ఇచ్చాడని సంబరపడుతున్నారని అన్నారు. నాడు సూరత్‌ నుంచి కమీషన్ల కోసం కిలోల కొద్దీ చీరలు తీసుకొచ్చి ఇస్తే ఒక్క ఆడబిడ్డా వాటిని కట్టుకోలేదని గుర్తుచేశారు. ‘ఆడ బిడ్డల చీరల్లో కూడా కమీషన్లు దండుకున్నారు. మీ బతుకులు చెడ’ అని రేవంత్‌ మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల చేతిలో రూ.27 వేల కోట్లు పెట్టామన్నారు. ఇప్పుడు మహిళలు పెట్రోల్‌ బంకులు నడుపుతున్నారని, అదానీ, అంబానీ అవసరం లేకుండా వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్లు పెట్టారని తెలిపారు. కేసీఆర్‌ 8.11 లక్షల కోట్ల అప్పులు చేస్తే, నెలకు ఐదారు వేల కోట్ల వడ్డీలు కడుతున్నామన్నారు. రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఆయన ఫాంహౌ్‌సలో పడుకున్నాడని, నేను బడికి రాను అంటున్నాడని విమర్శించారు. బడికి రానంటే పంతులు వీపు పగలగొడతాడని, ఉద్యోగానికి రానంటే జీతం కట్‌ చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో మునిసిపాలిటీల అభివృద్ధి కోసం రూ.17,442 కోట్లు వెచ్చించామని తెలిపారు.


వేములవాడకు వెళితే పదవి పోతుందని చెప్పారని, అయినా వెళ్లి వచ్చానని, కేసీఆర్‌ ఇస్తానని ఎగ్గొట్టిన రూ.150 కోట్లు ఇచ్చి శివయ్య ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని రేవంత్‌ చెప్పారు. శివయ్య ఆశీర్వాదంతో పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం స్థానాల్లో గెలుపొందామన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న దేవాలయాలన్నింటినీ నాలుగైదు వేల కోట్లు ఖర్చు చేసైనా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. కొండా సురేఖ, సీతక్క వెళ్లి కేసీఆర్‌ను మేడారం జాతరకు రావాలని ఆహ్వానించినా రాలేదన్నారు. ఆయన రాకున్నా పిలగాళ్లకు ఏమైందని.. ఒకరు తాటి చెట్టు లాగా పెరిగారని, మరొకరు అచ్చోసిన ఆంబోతులా గాలికి తిరుగుతారు గానీ పేదల దేవుళ్లను దర్శించుకునేందుకు రారని అన్నారు. కరీంనగర్‌, వరంగల్‌ నగరాలను కలిపేందుకు ఔటర్‌రింగ్‌ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. ఈ రెండు నగరాల మధ్యలో డంపుయార్డును ఏర్పాటు చేసి విద్యుదుత్పత్తి చేస్తామన్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. కరీంనగర్‌ గడ్డ మీద కాంగ్రెస్‌ జెండా ఎగరాలన్నారు. ఫలితాల తర్వాత మళ్లీ కరీంనగర్‌కు వస్తానని, కార్పొరేషన్‌ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకుందామని చెప్పారు.

Updated Date - Feb 06 , 2026 | 06:13 AM