నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ.. దక్షిణాది మనుగడకే ప్రమాదం: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Apr 10 , 2026 | 09:47 PM
ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగిన సీడబ్ల్యూసీ హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగర నియోజకవర్గాల పునర్విభజన అంశంపై పలు కీలక వాఖ్యలు చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 10: ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగిన సీడబ్ల్యూసీ హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగర నియోజకవర్గాల పునర్విభజన అంశంపై పలు కీలక వాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో జరగబోయే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా చిన్న రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే, అది దేశ సమగ్రతకు, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ పెద్ద రాష్ట్రాలు మరింత పెద్దవిగా మారుతాయి, చిన్న రాష్ట్రాలు అలాగే ఉండిపోతాయి. కేరళలో ప్రస్తుతం ఉన్న 20 సీట్లు 30కి పెరిగితే.. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఉన్న 80 సీట్లు 120కి పెరుగుతాయి. దీనివల్ల కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల గొంతుక పూర్తిగా నలిగిపోతుంది. దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో కేవలం బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల మద్దతుతోనే కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది. నియోజకవర్గాల విషయంలో బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బిజెపికి సరెండర్ అయి ఉండొచ్చు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు మోసపోతున్నాయి దీనివల్ల ఇంకా మోసపోతాం. రైతు చట్టాలు ఎలా వెనక్కి తీసుకున్నారో.. నియోజకవర్గాల బిల్లు ఆమోదం పొందుతే భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలు కూడా ఆందోళన చేస్తాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదని, 2023లోనే ఈ చట్టాన్ని చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన పీఎల్జీఏ డిప్యూటీ కమాండర్..
బట్టల దుకాణాల్లో రహస్య కెమెరాలకు చెక్.. రంగంలోకి షీ నేత్ర టీమ్స్..