తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన పీఎల్జీఏ డిప్యూటీ కమాండర్..
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:54 PM
తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(PLGA) డిప్యూటీ కమాండర్ సోడిమల్ల కేశాలు లొంగిపోయారు. అతనితోపాటు మెుత్తం 42 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల నుంచి వచ్చి వీరంతా లొంగిపోయారు.
హైదరాబాద్: తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(PLGA) డిప్యూటీ కమాండర్ సోడిమల్ల కేశాలు లొంగిపోయారు. అతనితోపాటు మెుత్తం 42 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల నుంచి వచ్చి వీరంతా లొంగిపోయారు. ములుగు, భూపాలపల్లి మీదుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోతున్నట్లు ప్రకటించారు.
అనంతరం సరిహద్దుల నుంచి పోలీసులు వీరిని వాహనాల్లో హైదరాబాద్‌కు తరలించారు. మావోయిస్టు నేత హిడ్మా PLGAను వదిలి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి వెళ్లిన తర్వాత బెటాలియన్ బాధ్యతలను బడ్సే దేవాకు, కేశాలుకు అప్పగించారు. అయితే, కొన్ని రోజులు కిందటే PLGA కమాండర్ దేవా.. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుపోయారు. ఆ తర్వాత బెటాలియన్ బాధ్యతలు నిర్వహిస్తున్న సోడిమల్ల కేశాలు సైతం తాజాగా నేడు లొంగిపోయారు. ఇతనికి సోడిమల్ల అలియాస్ కేశాలు అలియాస్ నిఖిల్ వంటి పేర్లున్నాయి.
గెరిల్లా ఆర్మీ ఇక లేదు: డీజీపీ
ఈ మేరకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇవాళ మెుత్తం 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయినట్లు తెలిపారు. వీరిలో PLGA బెటాలియన్ కమాండర్ సోడిమల్ల అలియాస్ కేశాలు అలియాస్ నిఖిల్ ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ పోలీసుల ఎదుట ఆయుధాలు, బంగారంతో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసినట్లు చెప్పారు. 36 తుపాకులు, ఐదు ఏకే 47లు, నాలుగు ఎస్ఎల్ఆర్‌లు, 1,007 తూటాలతో పోలీసులు ముందు మావోలు లొంగిపోయినట్లు పేర్కొన్నారు. అలాగే 800 గ్రాముల బంగారం సైతం అప్పగించినట్లు వెల్లడించారు. వీరి లొంగుబాటుతో అత్యంత కీలకమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పూర్తిగా కనుమరుగైనట్లు డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్‌లో ‘పిల్లి’ పంచాయితీ.. మొక్కల వ్యాపారిపై దొంగతనం ఆరోపణ.. పోలీసుల కౌన్సెలింగ్
హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఘటనలో యువతి ఆత్మహత్య