తహసీల్దార్ సంతకం ఫోర్జరీ
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:59 AM
అది రూ.కోట్ల విలువైన భూమి.. అంతే కాదు ప్రభుత్వ భూమి కూడా.. దానిపై అక్రమార్కుల కన్ను పడింది. దాన్ని కాజేయాలనుకున్నారు.. అంతే.. తహసీల్దార్ సంతకం ఫొర్జరీ చేసేసి. ఏకంగా పట్టాదార్ పాస్‌బుక్ కూడా పొందారు.
4.25 ఎకరాల ప్రభుత్వ భూమికి ప్రైవేటు పట్టా జారీ
ఆన్‌లైన్‌లో తొలగించిన అధికారులు
పోలీసులకు ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): అది రూ.కోట్ల విలువైన భూమి.. అంతే కాదు ప్రభుత్వ భూమి కూడా.. దానిపై అక్రమార్కుల కన్ను పడింది. దాన్ని కాజేయాలనుకున్నారు.. అంతే.. తహసీల్దార్ సంతకం ఫొర్జరీ చేసేసి. ఏకంగా పట్టాదార్ పాస్‌బుక్ కూడా పొందారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మంగల్‌పల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని 96వ సర్వే నంబరులోని 4.34 ఎకరాల భూమి.. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదైంది. ఇది జంగం కుంట శిఖం భూమి కూడా.
అయితే, ఈ మధ్య తహసీల్దార్ సంతకం ఫొర్జరీ చేసి.. 96వ సర్వే నంబరులోని ఈ భూమిలో 4.25 ఎకరాల భూమి వహీదా బేగం అనే మహిళ పేరు మీద ‘భూ భారతి’ రికార్డుల్లో అనధికారికంగా నమోదు కావడంతోపాటు పట్టాదార్ పాస్‌బుక్ కూడా ఆమె పొందినట్లు గుర్తించిన అధికారులు.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆన్‌లైన్‌లో వహీదా బేగం పేరును తొలగించారు. తన సిబ్బందితో కలిసి గురువారం ఆ భూమిని పరిశీలించిన తహసీల్దార్ సునీతా రెడ్డి.. ‘ఆ భూమి ప్రభుత్వానిది’ అని బోర్డు ఏర్పాటు చేశారు. తన సంతకం ఫొర్జరీతో అనధికార పట్టాదార్ పుస్తకం పొందిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
నాలుగేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన వృద్ధుడికి జీవిత ఖైదు
బాలికలతో అసభ్య ప్రవర్తన.. తండ్రీకొడుకుల అరెస్టు
Read Latest Telangana News And Telugu News