రూ.2 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:07 PM
రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి స్వర్ణకుమారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుపడ్డారు. ఎల్బీనగర్‌లో లైసెన్స్ లేదంటూ మూసివేసిన ఓ ఫిజియోథెరపీ ఆస్పత్రిని తిరిగి తెరవడానికి ఆమె రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది. ఈ మేరకు లంచం తీసుకుంటూ ఆమె పట్టుపడ్డారు.
రంగారెడ్డి: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (డీఎంహెచ్‌వో) స్వర్ణకుమారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుపడ్డారు. ఎల్బీనగర్‌లో లైసెన్స్ లేదంటూ మూసివేసిన ఓ ఫిజియోథెరపీ ఆస్పత్రిని తిరిగి తెరవడానికి ఆమె రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది. ఆ రూ.2 లక్షల్లో భాగంగా రూ.లక్ష ఇవ్వాలని స్వర్ణకుమారి కోరినట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం నిఘా పెట్టారు. బాధితుడు రూ.లక్షను హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌కు అందజేసినట్లు అధికారులు గుర్తించారు.
అనంతరం శ్రీనివాస్ ఆ నగదును డీఎంహెచ్‌వో డ్రైవర్ కృష్ణయ్యకు ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ డబ్బులు కారులో పెట్టేందుకు వెళ్తున్న సమయంలో కృష్ణయ్యను పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో లంచం డిమాండ్‌కు సంబంధించిన ఆధారాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు, లంచం డిమాండ్, నగదు తీసుకోవడం వంటి వ్యవహారంలో డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి, హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డ్రైవర్ కృష్ణయ్య పాత్రపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఏసీబీ దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
రామప్పకు మైనింగ్ ముప్పు లేదు.. వెంకటాపూర్ ఓపెన్‌కాస్ట్‌పై సింగరేణి కీలక స్పష్టత
నిజామాబాద్ జిల్లాలో సామాజిక బహిష్కరణ ఘటనలపై బీసీ కమిషన్ సీరియస్