Share News

QR code sharee: ‘క్యూఆర్‌ కోడ్‌’ను చీరపై నేస్తే ఆశ్చర్యమే కదా..

ABN , Publish Date - Jan 11 , 2026 | 10:01 AM

బిల్లు చెల్లించాలన్నా, విషయం తెలుసుకోవాలన్నా ‘క్యూఆర్‌ కోడ్‌’ను క్లిక్‌ చేయడం చూస్తున్నాం. అది డిజిటల్‌గానో, పేపర్‌పైనో ఉంటుంది. అయితే దానిని చీరపై నేస్తే ఆశ్చర్యమే కదా. అలాంటి చేనేత కళాకారుడి విశేషాలే ఇవి...

QR code sharee: ‘క్యూఆర్‌ కోడ్‌’ను చీరపై నేస్తే ఆశ్చర్యమే కదా..

- ‘క్యూఆర్‌ కోడ్‌’ చేనేత వస్త్రాలు!

అతివ ఒంటిపై ధరిస్తే ఐదు గజాల చీర... మడతపెడితే అగ్గిపెట్టెలోనూ ఒదుగుతుంది. పట్టు చీరలు... ఉంగరం, దబ్బనాల్లో నుంచి దూరిపోతాయి. చేనేత మగ్గంపై ఇలాంటి ఎన్నో అబ్బురపరిచే ఆవిష్కరణలతో నల్ల విజయ్‌కుమార్‌ ‘వస్త్ర శాస్త్రవేత్త’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఈయన చేనేత రంగంలో చేస్తున్న ప్రయోగాలు అద్భుతాలే.

‘క్యూఆర్‌’ కోడ్‌కు వస్త్ర బంధం

ఈరోజుల్లో దేనికైనా ‘క్యూఆర్‌’ కోడ్‌నే వాడుతున్నారు. పత్రికల ఈ - పేపర్‌ నుంచి... వివిధ పేమెంట్ల దాకా... క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే సరిపోతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని క్యూఆర్‌ కోడ్‌ను వస్త్రబంధంతో ముడిపెట్టాడు విజయ్‌. సాధారణంగా క్యూఆర్‌ కోడ్‌ను పేపర్‌, కార్డులపై ముద్రిస్తుంటారు. అదే తరహాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి చిత్రాలను తెలుసుకోవడానికి... చేనేత మగ్గంపై నేసే వస్త్రంపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించే ఆలోచన చేశాడు విజయ్‌.


తన ఆలోచనకు అనుగుణంగా హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వైష్ణవి యాప్‌ను రూపొందించి ఇచ్చారు. యాప్‌లో పొందుపరిచే ఫొటోలకు క్యూఆర్‌ కోడ్‌ క్రియేట్‌ అవుతుంది. దీనిని టెక్స్‌టైల్‌ డిజైనర్‌ రాజు ద్వారా బట్ట మీద నేసే విధంగా డిజైన్‌ చేశాడు. మగ్గంపై బిగించిన ఎలకా్ట్రనిక్‌ జాకార్డ్‌ మిషన్‌కు క్యూఆర్‌ కోడ్‌ డిజైన్‌ను, స్మార్ట్‌ఫోన్‌ ద్వారా బ్లూటూత్‌తో లింక్‌ ఇస్తారు. మగ్గంపై బట్ట నేయడానికి ఏర్పాటుచేసిన పోగుల ద్వారా క్యూఆర్‌ కోడ్‌ వస్తుంది. ‘సాధారణంగా పేపర్‌పై చూసే క్యూఆర్‌ కోడ్‌ వస్త్రంపైౖ కనిపించడంతో అందరూ ఆసక్తిగా స్కాన్‌ చేస్తార’ని విజయ్‌ తెలిపాడు.


తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ...

చేనేత మగ్గాలపై తొలిసారిగా అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి, ప్రపంచం ముంగిట చేనేత కళా నైపుణ్యాన్ని ప్రదర్శించిన నేతకారుడు నల్ల పరంధాములు. ఆయన ప్రయోగాలకు వారసుడిగా విజయ్‌కుమార్‌ నిలిచాడు. పరంధాములు 1986 అగ్గిపెట్టెలో పట్టే చీరను, కుట్టు లేని చొక్కాలు నేసి దేశవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకున్నాడు. 1997లో 112మీటర్ల జాతీయ జెండాను మగ్గంపై నేస్తే... అట్లాంటాలో జరిగిన ఒలింపిక్‌ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు దానిని ప్రదర్శించారు. 2006లో పరంధాములు కన్నుమూసిన తర్వాత ఆయనతోనే చేనేత కళ మూగబోయిందని భావించారు. అయితే తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని, చేనేత కళకు సాంకేతిక నైపుణ్యతను జోడించాడు విజయ్‌.


book4.2.jpg

నిత్య ప్రయోగాలు...

చేనేత మగ్గంపై నిత్య ప్రయోగాలతో విజయ్‌... అబ్బురపరిచే వస్త్రాలను తయారు చేస్తూ మన్ననలు అందుకుంటున్నాడు. 2012లో అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర నేసిన విజయ్‌... ఆ తర్వాత అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు శాలువాను, 2013లో దబ్బనంలో దూరే ఐదు మీటర్ల చీరలు నేశాడు. 2015లో అరటి నారతో శాలువా నేసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించాడు. కుట్టు లేకుండా జాతీయ పతాకాన్ని చేనేత మగ్గంపైనే రూపొందించాడు. మూడు కొంగుల చీర, సుగంధాలు వెదజల్లే పట్టుచీర, 220 రంగులతో చీర, రంగులు మార్చే త్రీడీ చీర, వెండి పట్టుచీర, 200 గ్రాముల బంగారు పట్టుచీర నేసి ‘ఔరా’ అనిపించాడు. అంతేకాదు... ఆపరేషన్‌ సిందూర్‌ చిత్రాలతో అగ్గిపెట్టెలో పట్టే విధంగా శాలువా నేసి, చేనేత దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రధాని మోదీకి అందించాడు.


చీరలపై అభివృద్ధి చిత్రాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి చిత్రాలకు పోగు బంధాన్ని కలుపుతూ విజయ్‌ మరో ప్రయోగం చేశాడు. అదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో కట్టిన కాళేశ్వరం, యాదాద్రి వంటి ప్రాజెక్టుల ఫొటోలతో రూపొందించిన యాప్‌నకు ‘క్యూ ఆర్‌’ కోడ్‌ను పట్టు వస్త్రంపై నేశాడు. మొబైల్‌ ఫోన్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే అభివృద్ధి ఫొటోలు చూడొచ్చు. ఒక వస్త్రంపై ఇలా క్యూఆర్‌ కోడ్‌ను నేయడం అనేది వి‘చిత్రమే’. దానికి ఎంతో ఓర్పు, నేర్పు అవసరం అవుతుంది. చేనేత మగ్గంపై ఇలాంటి ఎన్నో అద్భుత ఆవిష్కరణలకు జీవం పోస్తున్న విజయ్‌ అనేక అవార్డులను అందుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని అందించింది. మూడుసార్లు ‘తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డు’ల్లోకి ఎక్కాడు.

- టి.వి. నారాయణ, రాజన్న సిరిసిల్ల


ఖండాంతర ఖ్యాతి...

సిరిసిల్ల చేనేత రంగానికి ఖండాంతర ఖ్యాతి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. మా తండ్రి పరంధాములు వారసత్వాన్ని పదిలపరుస్తా. త్వరలో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కళ్లు చెదిరే కదలాడే చీరను నేసేందుకు సిద్ధమవుతున్నా.

- నల్ల విజయ్‌, చేనేత కళాకారుడు


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు షాక్.. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

దారి మళ్లింది 42 కోట్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 11 , 2026 | 10:04 AM