నీటి వృథాపై ఫిర్యాదుకు పానీ యాప్
ABN , Publish Date - Oct 30 , 2026 | 03:34 AM
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో.. ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించుకోవడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది
ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో.. ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించుకోవడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నీటిని వృథా చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించనుంది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా.. జలమండలి విభాగం (హెచ్‌ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ) అభివృద్ధి చేసిన ‘పానీ’ మొబైల్ అప్లికేషన్‌ను.. గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో అధికారులతో కలసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. నీటి వృథాను ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేసి, వివరాలు నమోదు చేస్తే.. అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటి కొరతను సమర్ధవంతంగా ఎదుర్కొవాల్సిన అవసరముందని.. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతి కుటుంబం నీటి వినియోగాన్ని 20శాతం మేర తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా నీటిని వృఽథా చేస్తే ‘పాన్’ యాప్ ద్వారా వాటర్‌బోర్డు దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆసక్తి ఉన్న పౌరులు ప్రభుత్వ గుర్తింపు కార్డుతో వాటర్‌బోర్డు వెబ్‌సైట్ https://hyderabadwater.gov.inలో వలంటీర్లుగా (వాటర్ వారియర్) నమోదు చేసుకోవాలని సూచించారు. పానీ యాప్‌లో ఫిర్యాదు చేసే వలంటీర్ల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఉల్లంఘనలు జరిగితే నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తారని చెప్పారు. నీటి సంరక్షణలో చురుకుగా పని చేసే వలంటీర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమై అభినందిస్తారని తెలిపారు. వాహనాలు, ఆవరణలను కడిగేందుకు తాగునీటిని వినియోగించవద్దని, లీకేజీలు అరికట్టాలని మంత్రి సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. భవన నిర్మాణాలు, పార్కులు, పరిశ్రమలు, గార్డెనింగ్‌కు ఎస్‌టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని సూచించారు. నవంబరు 1 నుంచి భవన నిర్మాణాల్లో మొక్కల కోసం శుద్ధి చేసిన నీటిని వాడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!
ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు