పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Oct 15 , 2026 | 03:26 PM
హనుమకొండ జిల్లా మడికొండలో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు..
హనుమకొండ, అక్టోబర్ 15: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా మడికొండలో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ రాంచంద్రు నాయక్, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, కుడా చైర్పర్సన్ సుధారాణి, కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. చరిత్రలోనే ఇంత ముందుగా ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించడం ఇదే తొలిసారని పేర్కొంటూ, దీని వెనుక కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ సింగరేణి కార్మికులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని పొంగులేటి విమర్శించారు. సింగరేణి సంస్థ నష్టాలకు, 18 గనులు మూతపడటానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క గనినైనా కొత్తగా ప్రారంభించారా? అని ప్రశ్నించారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ సింగరేణిని భ్రష్టు పట్టించారని విమర్శించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు వస్తోందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి:
ముస్కాన్‌కు మరణశిక్ష.. పిల్లల భవితవ్యంపై సౌరభ్ కుటుంబం స్పందనిదే.?
నాల్గో టీ20లో టీమ్ఇండియా ఓటమికి ప్రధాన కారణం అతడే.!