డిసెంబరులో రాష్ట్రానికి ప్రధాని..!
ABN , Publish Date - Oct 23 , 2026 | 04:57 AM
ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబరు రెండో వారంలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం,
వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన
వరంగల్-కరీంనగర్ హైవే జాతికి అంకితం
వచ్చే నెలలో రానున్న కేంద్ర మంత్రి అమిత్‌షా
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబరు రెండో వారంలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. వరంగల్ విమానాశ్రయంతోపాటు సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మొదటి దశలో సుమారు రూ.550 కోట్ల అంచనాతో గిరిజన యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అలాగే, రూ.700కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రధాని ప్రారంభించనున్నారు. రూ. 2,250 కోట్లతో నిర్మించిన వరంగల్-కరీంనగర్(ఎన్‌హెచ్563) జాతీయ రహదారిని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం, వరంగల్‌లో పార్టీ కార్యకర్తలతో నిర్వహించే బహిరంగసభకు ప్రధాని హాజరవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రధాని పర్యటన అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ప్రధాని పర్యటన సందర్భంగా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉందని బీజేపీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వచ్చే నెలలో రాష్ట్రానికి రానున్నారు. కరీంనగర్‌లో ప్రతిమ మెడికల్ కాలేజీ సిల్వర్ జుబ్లీ ఉత్సవాలకు ఆయన హాజరు కానున్నారు. అనంతరం హైదరాబాద్‌లో పార్టీ కార్యకర్తలతో అమిత్‌షా సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు హక్కు తొలగింపు చిన్న విషయమా?
భారత టెలికాంపై బడా గుత్తాధిపత్యం!